
- భద్రాచలంలో అక్రమ కట్టడాల జోరు..
- గోదావరి పుష్కరాల వేళ బిజినెస్ కోసం యథేచ్ఛగా నిర్మాణాలు
- నిబంధనలు బేఖాతరు.. పట్టించుకోని అధికారులు
భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో భవంతుల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు తీసుకోకుండానే కొందరు మహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నారు. మరికొందరు ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని రెండు, అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించేస్తున్నారు. కూడళ్లు, ప్రధాన ప్రాంతాల్లో ఖరీదైన స్థలాలు కొనుగోలు చేస్తున్న కొందరు వ్యాపారులు, ఇళ్ల యజమానులు పార్కింగ్ కోసం కనీసం గజం స్థలం కూడా వదలకుండా కట్టడాలు చేపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన గ్రామపంచాయతీ అధికారులు మౌనంగా ఉంటున్నారు. గోదావరి పుష్కరాలు వస్తున్న వేళ భద్రాచాలానికి లక్షల్లో భక్తులు వస్తారు. వీరికి వసతి దొరకడం చాలా కష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా అనుమతులు తీసుకోకుండానే బహుళ అంతస్తుల భవనాలు లాడ్జీల కోసం కడుతున్నారు. రామాలయం పరిసరాల్లోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి.
ప్లాన్ లేకుండా నిర్మాణాలు..
భద్రాచలం పట్టణంలోని రామాలయం సమీపం, తాతగుడి సెంటర్, యుబీరోడ్డు, చర్ల రోడ్డు, కూనవరం రోడ్డు, ఫైర్ స్టేషన్ సమీపంలో అనుమతులు లేకుండానే భవనాలు కడుతున్నారు. బడా కంపెనీలు, కార్పొరేట్ ఆస్పత్రులు, వస్త్ర దుకాణాలు వెలుస్తున్నాయి. పెద్ద భవంతులు కట్టి వీరికి లీజుకు ఇస్తున్నారు. ఒక్క సెంటు రూ.20లక్షల ధర పలుకుతోంది. స్థలాన్ని వృథా చేయకూడదనే ఉద్దేశంతో సెట్ బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో కొందరు కక్కుర్తితో ఎలాంటి టెక్నికల్ ప్లాన్స్ లేకుండానే కట్టడం వల్ల అవి కుప్పకూలుతున్నాయి. దానిలో భాగంగానే రామాలయం పరిసరాల్లో శ్రీపతి నేషనల్ ఫౌండేషన్ నిర్మిస్తున్న భవనం రెండు రోజుల కింద పేకమేడలా కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయిన విషయం తెలిసిందే.
పర్మిషన్లు తీసుకోకుండానే..
ఎత్తైన భవనాలు నిర్మించాలంటే పంచాయతీ నుంచి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. 1/70 యాక్టు లాంటి గిరిజన చట్టాలు ఉన్న ఏజెన్సీలో గిరిజనేతరులకు ఎలాంటి అనుమతులు ఇవ్వరు. అయినా 30కి పైగా భవనాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో నిర్మాణాలు పూర్తయ్యాయి. నిబంధనలు ఏ మాత్రం పాటించిన పాపాన పోలేదు. భవనం ముందు కచ్చితంగా ఖాళీ స్థలం వదలాలి చుట్టూ ఫైరింజన్ తిరిగేలా ప్లేస వదలాలి. సెల్లార్లు నిర్మించి పార్కింగ్‌కు కేటాయించాలి.
కానీ అందులో కూడా దుకాణాలు పెట్టి వాహనాలను రోడ్లపై వదిలేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. ఇంత జరుగుతున్నా పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నయి.
ప్రైవేటు వ్యక్తులతో టీమ్ లు..
అనుమతులు లేకుండా కట్టే భవన నిర్మాణాలకు ప్రైవేటు వ్యక్తులతో కూడిన కొన్ని టీమ్‌లు అండగా నిలుస్తున్నాయి. ఏజెన్సీ ఏరియాలో 1/70 చట్టం అమలులో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలకు పర్మిషన్లు కేవలం గిరిజనులకు మాత్రమే ఇవ్వాలి. తరతరాలుగా ఇక్కడి గిరిజనులతో మమేకమై జీవిస్తున్న గిరిజనేతరులకు ఇంటి నిర్మాణం వరకు మినహాయింపు ఫర్వాలేదు. కానీ తమ వ్యాపారాల కోసం గిరిజనేతరులు కట్టే భవంతులకు అనుమతులు, అండగా ఉండేందుకు మామూళ్లు తీసుకుని ఈ ప్రైవేటు టీమ్‌లు చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి.
ఈ విషయంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. శ్రీపతిఫౌండేషన్ భవన నిర్మాణ విషయంలో పంచాయతీ ఈవో మూడు సార్లు నోటీసులిచ్చి, పనిచేసే యంత్రాలను, మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆయన తిరిగి పెద్ద మనుషులతో పైరవీలు చేయించుకుని, గుట్టుచప్పుడు కాకుండా అంతస్తులు లేపేందుకు సిద్ధమయ్యాడు. ట్రస్టు పేరుతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి కడుతున్న ఇటువంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ వస్తోంది.
కఠిన చర్యలు తీసుకోవాలి
నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఎత్తైన భవంతులు కడుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? శ్రీపతి ఫౌండేషన్ భవనం విషయంలో వందలసార్లు ఆఫీసర్లను కలిశాం. వారి సమక్షంలోనే మాపై దాడులకు ప్రయత్నించారు. అనుమతులు లేకుండా కట్టిన భవంతులను వెంటనే కూల్చివేయాలి. – పూనెం ప్రదీప్, మానవహక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి