- సగమన్నా ఖర్చు చేయలే
- కేటాయింపులు ఘనం.. విడుదల చేసేది అంతంతే
- చట్టం తెచ్చినా నిధులు క్యారీ ఫార్వర్డ్ చేస్తలే
- చట్టం అమలుచేసేందుకు కమిటీలు వేసినా సమావేశాలు లేవు
- నిధులున్నా ఎస్సీ, ఎస్టీలకు స్కీంలు సక్కగా అమలైతలే
- దరఖాస్తులు తీసుకుని ఏడాదైనా పత్తాలేని లోన్లు
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కథ మళ్లీ మొదటికొచ్చింది. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయలేదు. బడ్జెట్‌లో ఎంతో గొప్పగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్తున్నా.. పైసలు మాత్రం విడుదల చేస్తలేదు. ఈ నిధులన్నీ ఇతర విభాగాలకు మళ్లిస్తున్నది. ఇట్లా ఏడేండ్లలో రూ. 65 వేల కోట్ల సబ్‌ప్లాన్ ఫండ్స్‌ను మళ్లించింది. ఇక నిధుల క్యారీ ఫార్వర్డ్ ముచ్చటే లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీల స్కీంలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయి. యువతకు లోన్లు ఇస్తామని ఏడాది కింద అప్లికేషన్లు తీసుకున్నా ఇప్పటి దాకా ఒక్కరికీ మంజూరు కాలేదు.
బడ్జెట్‌లో మాత్రం మస్తు..
2021–22 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చింది. త్వరలో కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. కానీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సగం కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ కోసం రూ. 33,610.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ఎస్డీఎఫ్ కింద రూ. 21,306 కోట్లు కేటాయించగా.. ఎస్టీ ఎస్డీఫ్ కింద రూ.12,304 కోట్లు కేటాయించింది. కానీ, జనవరి 20 వరకు ఎస్సీ ఎస్డీఎఫ్ కింద 10,290 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే 48 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసింది. ఇక ఎస్టీ ఎస్డీఎఫ్‌లో కూడా 45% నిధులు మాత్రమే ఖర్చయినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. రూ. 5,500 కోట్లే ఉపయోగించినట్లు అర్థమవుతున్నది.
నిధులున్నా లోన్లు ఇస్తలేరు
ఓ వైపు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చూపిస్తున్నా ఎస్సీ, ఎస్టీల స్కీంలు సక్కగ అమలవడం లేదు. దళితులకు మూడెకరాల భూమి ముందుకు సాగడంలేదు. కల్యాణలక్ష్మి, స్కాలర్‌షిప్‌ల బిల్లులు ఎప్పుడూ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు మాత్రమే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేశారు. ఇక నిరుడు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లకు దరఖాస్తులను తీసుకుని మూలకుపడేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి చేసిన సర్కారు ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. ఏడాదైనా లోన్లు ఇవ్వట్లేదు. నాలుగు లక్షల మంది నిరుద్యోగులు లోన్ల కోసం ఎదురుచూస్తున్నారు.
క్యారీ ఫార్వర్డ్ ముచ్చటే లేదు
రాష్ట్రంలో ఎస్సీలు 16%, ఎస్టీలు 9% ఉన్నారు. జనాభా ప్రాతిపదికన వీరికోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నారు. చట్టంలో చేసిన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీల నిధులను ఉపయోగించకుంటే మిగిలిన నిధులను క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది వాడుకోవాలి. కానీ ఏ ఒక్క సంవత్సరంలోనూ క్యారీ ఫార్వర్డ్ చేయలేదని ఎస్సీ, ఎస్టీ లీడర్లు మండిపడుతున్నారు. అలాంటప్పుడు ఈ చట్టం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.
కమిటీలు పత్తాలేవు..?
ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్‌మెంట్ యాక్ట్ పకడ్బందీగా అమలుకు, పారదర్శకంగా ఉండేందుగా సీఎం కేసీఆర్ పలు కమిటీలను తీసుకొచ్చారు. సీఎం చైర్మన్‌గా స్టేట్ కౌన్సిల్, మంత్రి చైర్మన్‌గా నోడల్ ఏజెన్సీల కోసం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలు ఏడాదికి రెండు సార్లు సమావేశమవ్వాల్సి ఉన్నా.. మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. నిరుడు జూన్ చివర్లో ఎస్టీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తూతూమంత్రంగా సాగింది. ఎస్సీ ఎస్డీఎఫ్ పర్యవేక్షణపై ఏడాదిగా ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు. ఇక జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా అధికారులు, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. అనేక జిల్లాల్లో అసలు ఆ కమిటీలే వేయలేదు.
బడ్జెట్‌లో మాత్రమే మస్తు కేటాయింపులు
బడ్జెట్‌లో మాత్రం ఎంతో గొప్పగా వేల కోట్లు కేటాయిస్తున్నరు. ఆహో.. ఓహో.. అని కీర్తించుకుంటున్నరు. కానీ తీరా నిధుల ఖర్చు విషయానికొచ్చేసరికి మాత్రం అందు లో సగం కూడా ఖర్చు చేయడం లేదు. క్యారీ ఫార్వర్డ్ అని చెప్పినా అతీగతీ లేదు. చట్టం అమలులో సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది. పూర్తి నిధులు ఖర్చు చేయాలి. లేదా క్యారీ ఫార్వర్డ్ అయినా చేయాలి.
- రాంప్రసాద్, మాల సంక్షేమ సంఘం, స్టేట్ ప్రెసిడెంట్
ఏడేండ్లుగా రూ. 65 వేల కోట్లకు పైనే..!
ఎస్సీ, ఎస్టీల నిధులను యథేచ్ఛగా ఇతర వాటికి మళ్లీస్తున్నారనే ఉద్దేశంతో స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ యాక్ట్‌ను 2017లో ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఆ చట్టం లక్ష్యం నెరవేరడంలేదు. ఎస్సీ, ఎస్టీల నిధులను ఇతర విభాగాలకు దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్లకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం సబ్‌ప్లాన్ కింద రూ. 1,07,319 కోట్లను కేటాయించారు. కానీ అందులో సగం కూడా ఖర్చు చేయలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ. 65 వేల కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి.