ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ తో..ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక భేటీ

ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ తో..ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక భేటీ
  • వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడి

ఖైరతాబాద్, వెలుగు : ఎస్సీ వర్గీకరణ కమిషన్​చైర్మన్​జస్టిస్ షమిమ్​అక్తర్​ను ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతల బృందం బుధవారం కలిసింది. వర్గీకరణను తాము అనుమతించేది లేదంటూ బృందం నేతలు తెలిపారు. ఈ మేరకు చైర్మన్​షమిమ్​అక్తర్​కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమ సమస్యను వన్​ మెన్​ కమిషన్​ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుతం డిమాండ్​ చేస్తున్న విధంగా వర్టికల్​వర్గీకరణ కాకుండా హారిజంటల్​ వర్గీకరణతో నిరుపేదలకు న్యాయం జరుగుతుందన్నారు.

ఆర్టికల్​ 341, 342 ఎస్సీ ,ఎస్టీలకు రిజర్వడ్​ కేటగిరీలో ఉప వర్గీకరణ చేయడం రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి, అంబేద్కర్​ ఆలోచనా విధానానికి వ్యతిరేకమని కమిషన్ కు తెలియజేశారు. అంటరానితనంతో వచ్చిన రిజర్వేషన్లను ఆర్థిక స్థితులకు ముడిపెట్టడం సరికాదన్నారు. కులాల మధ్య అసమానతల సమస్యకు వర్గీకరణ పరిష్కార మార్గం కాదన్నారు.

కమిషన్​చైర్మన్​కు వినతి పత్రం అందజేసిన వారిలో  ఎస్సీ, ఎస్టీ  ప్రజా సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు చెట్లపల్లి అరుణ్​కుమార్​, అంబేద్కర్​ ఉత్సవాల కమిటీ మాజీ అధ్యక్షుడు రావుల విజయ్​కుమార్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్, సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చొక్కంపేట ఆంజనేయులు, మన్నెగూడెం వేణు గోపాల్,​ సివిల్​ సప్లై కమిటీ సభ్యుడు కల్పగురి రాజేశ్ ఉన్నారు.