ఎస్సీ, ఎస్టీ చట్టం ప్లాన్​ లేకుంటే ఎట్లా?

దళిత, గిరిజన వర్గాలపై తరతరాలుగా జరుగుతున్న  వివక్ష, వేధింపులు, దారుణాల  నేపథ్యంలో పుట్టుకొచ్చింది ‘ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్.’  దారుణాలకు గురవుతున్న వారికి ఈ చట్టం ఒక సెక్యూరిటీగా ఉపయోగపడుతుంది. కనీసం చట్టం ఉందన్న భయంతోనైనా అట్టడుగు వర్గాలపై  జరిగే దాడులు తగ్గుతాయని ఆశించారు. చట్టమైతే పకడ్బందీగా చేశారు కానీ అమలు కావడమే కష్టంగా మారింది. చట్టం అమలులో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముందుగా ఈ సమస్యలను పరిష్కరించుకోలేకపోతే చట్టం చేసిన స్ఫూర్తే దెబ్బతింటుందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. 

ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్  ’ 30 ఏళ్ల నాటిది. చట్టం చేసి ఇన్నేళ్లయినా ఇప్పటికీ సమర్థవంతంగా అమలుకావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం చట్టం అమలుకు అవసరమైన కంటింజెన్సీ ప్లాన్ అంటూ ఏదీ లేకపోవడం. ఒకటో  రెండో కాదు మొత్తం 18 రాష్ట్రాలు, కంటింజెన్సీ ప్లాన్ ను ఇప్పటికీ తయారు చేసుకోలేదని దళిత హ్యూమన్ రైట్స్ గ్రూప్ ‘ సోషల్ అవేర్ నెస్ సొసైటీ ఫర్ యూత్స్ (ఎస్ఎస్​ఎఫ్​వై)’ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ లపై దారుణాల నిరోధక చట్టం అమలులో కంటింజెన్సీ ప్లాన్​దే కీలక పాత్ర. సహాయ, పునరావాసం అందించడానికి అవసరమైన  గైడ్ లైన్స్ తయారీలో రాష్ట్రాలకు ఈ ప్లాన్ సాయ పడుతుంది. అంతేకాదు దారుణాలకు గురైనవారికి సంబంధించి వివిధ గవర్నమెంట్ డిపార్ట్​మెంట్లు, అధికారులకున్న బాధ్యతలను కూడా కంటింజెన్సీ ప్లాన్ నిర్దేశిస్తుంది. చట్టాన్ని బాగా  అమలు చేయడానికి ఇప్పటివరకు అవసరమైన కంటింజెన్సీ ప్లాన్​ని అనేక రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోలేదు. ఈ విషయాన్నే ‘సోషల్ అవేర్​నెస్ సొసైటీ ఫర్ యూత్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండ్యన్ తప్పుపట్టారు.

మానిటరింగ్ కమిటీలే  లేవు

ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్  అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైన కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిల్లో ఈ రివ్యూ మీటింగులు జరుగుతుండాలి. దీనికోసం ‘డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ)’లు ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు రెగ్యులర్​గా సమావేశమై ఎప్పటికప్పుడు  సమీక్షలు జరుపుతుండాలి. ఈ రివ్యూ మీటింగ్​లు చాలా తక్కువగా జరుగుతున్నాయన్నది దళిత హక్కుల గ్రూప్ ఆరోపణ.  కొన్ని రాష్ట్రాల్లో అసలు ‘విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ’లే ఏర్పాటు కాలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

తగ్గిన సమీక్షా సమావేశాలు

చట్టం అమలుకు సంబంధించి  తమిళనాడును ఒక కేస్ స్టడీగా ‘సోషల్ అవేర్​నెస్ సొసైటీ ఫర్ యూత్స్’ తీసుకుంది. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ (ఆర్టీఐ) కింద వచ్చిన సమాచారాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం తమిళనాడులో 2015–19 మధ్య కాలంలో దళితులపై అట్రాసిటీ  కేసులకు సంబంధించి మొత్తం 220 సమీక్షా సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ కేవలం 112 మీటింగులే జరిగాయని దళిత హక్కుల వేదిక ఆరోపించింది. అంతేకాదు, తమిళనాడులో  కేవలం 11 జిల్లాల్లోనే ఈ సమావేశాలు జరిగాయని  ఈ వేదిక తేల్చి చెప్పింది. వీటన్నిటితో పాటు  తమిళనాడులో అట్రాసిటీ కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వాల్సిందిగా  కోరితే… కేవలం 11 జిల్లాలు మాత్రమే రెస్పాండ్ అయ్యాయని దళిత  హక్కుల వేదిక పేర్కొంది.

ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఏది?

కేసుల విచారణకు స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఎస్సీ,  ఎస్టీ యాక్ట్​లోని నాలుగో చాప్టర్ స్పష్టంగా పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా కేసులపై విచారణ జరిపి దోషులకు శిక్షలు విధించడం ఈ  ప్రత్యేక కోర్టుల ఏర్పాటు అసలు లక్ష్యం.  ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదే. తమ తమ  హైకోర్టు చీఫ్ జస్టిస్​లతో సంప్రదించి ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చొరవ తీసుకోవాలి. చాలా రాష్ట్రాల్లో ఇది జరగడం లేదు. జిల్లా సెషన్స్ కోర్టుల్లోనే అట్రాసిటీస్ యాక్ట్​కి సంబంధించిన కేసుల విచారణ జరిపి చేతులు దులుపుకుంటున్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ‘సోషల్ అవేర్​నెస్ సొసైటీ ఫర్ యూత్’ ప్రస్తావించింది. ప్రత్యేక కోర్టులు లేకపోవడం వల్ల చట్టం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని పేర్కొంది.