బహుజన పాట లక్ష్యం రాజ్యాధికారం

పాటది వర్గ శత్రువును, ఆ తరువాత ప్రాంతేతర ఆధిపత్యాన్ని నిరసిస్తూ గానం చేసిన చరిత్ర. అది ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకోనుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా సరే, ఇంకా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల బతుకులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి. అందుకు కారణం అధికారం వీరి చేతిలో లేకపోవడమే. అందుకే వీరు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే బతుకుతున్నారు. ‘‘రాజ్యాధికారానికి దూరమైన జాతులు అంతరిస్తాయి’’ అన్న మాన్యవర్‌‌‌‌ కాన్షీరామ్‌‌‌‌ మాటలు అక్షరసత్యం. నిత్యం బతుకు పోరాటం మాత్రమే చేస్తూ బతకాల్సిన దుస్థితిలో వీరు ఉంటే, అగ్రవర్ణాలు అధికారాన్ని తమ జన్మహక్కుగా భావిస్తున్నాయి. రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని తమ కులాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ దుర్మార్గం నశించాలంటే బహుజనులు పాలకులు కావాలి. బాబా సాహెబ్‌‌‌‌ అంబేద్కర్‌‌‌‌ అన్నట్టు ‘‘పొలిటికల్‌‌‌‌ పవర్‌‌‌‌ ఈజ్‌‌‌‌ ది మాస్టర్‌‌‌‌ కీ’’. దానికి ఓటు హక్కు చైతన్యం మాత్రమే మార్గం. అదే ఇప్పుడు బహుజన పాటకు వస్తువుగా మారింది. బహుజన పాట అంబేద్కరిస్టు దృక్పథం నుంచి పుట్టింది. దానికి మూలవాసుల చరిత్రే పునాది. మహనీయుల త్యాగాలే థీమ్‌‌‌‌. 
తెలంగాణ ఉద్యమ కాలపు సాంస్కృతిక చైతన్యం క్రమంగా చల్లబడ్డది. పాట ఎవరి కోసం రాయాలో? ఎందుకోసం రాయాలో ఆలోచించుకునే ఓపిక వాగ్గేయకారులకు లేకుండా పోయింది. అందుకే పాట పలుకడం లేదు. ఇలాంటి స్తబ్ధతను బ్రేక్​ చేయడానికి కాలం ఎనిమిదేండ్లుగా ఎదురుచూస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే బహుజన రాజ్యాధికార ఆవశ్యకతను బోధించడానికి ‘బహుజన ధూంధాం’ ముందుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు పోషించిన పాత్ర ఏమిటో తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. రాజకీయ ఉద్యమానికి మద్దతు కూడగట్టడానికి బలమైన సాంస్కృతిక ఉద్యమం రూపుదిద్దుకుంది. అందుకే పాట లేని తెలంగాణను ఎవ్వరం ఊహించలేం. అలాంటి పాట అవసరం మరోసారి మన ముందుకు వచ్చింది. బహుజన ఉద్యమ ఆశలు ఆవిరి కాకుండా, రాజకీయ లక్ష్యాన్ని బోధించడానికి..ఊరూర మరోసారి బహుజన భావజాల వ్యాప్తికి నడుం కట్టింది బహుజన ధూంధాం.

పాటను బందీ చేసిన పాలకులు

బహుజన ధూంధాం పోటెత్తడానికి ముందు సాంస్కృతిక చైతన్యం తిరోగమన దశకు చేరుకుంది. ఒకవైపు పాలకులు కళాకారులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి సారథిలో వారిని బందీలు చేశారు. ప్రజలమీదో, ప్రజా సమస్యల మీదో పాట పాడొద్దనే ఆంక్షలు పెట్టారు. కేవలం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి పొగడమని వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సారథిలో ఉన్న కళాకారులు ఆశ్చర్యపోయారు. అప్పటి దాకా తెలంగాణ నేల మీద ప్రజాకవి, ప్రజా కళాకారులు అనే మాటకు ఉన్న పేరును తలుచుకొని లోలోపలే కుమిలిపోయారు. అట్లని వారి ఉద్యోగాలను వదులుకుంటే అర్ధాకలితో.. అప్పులతో జీవించాలి. కుటుంబం, పిల్లలు రోడ్డున పడతారు. ఈ సంఘర్షణలో సారథి కళాకారులంతా నలుగుతున్నారు. కొందరైతే ఇమడలేక బయటికి కూడా వచ్చేశారు. ఇట్లా ప్రజా పోరాట పాట పాలకుల ఎత్తులకు చిత్తయ్యింది. 

చారిత్రక వేదికగా..

బహుజనులను ఓటు చైతన్య దిశగా నడిపించడానికి నడుంకట్టింది బహుజన ధూంధాం. ఇవాళ తెలంగాణలో ఏ సమూహాన్ని కదిలించినా అసంతృప్తి, ఆవేదన, నిరాశ, నిస్పృహలే ఉన్నాయి. వారికి అండగా నిలబడటానికి ముందుకు వచ్చిందే బహుజన ధూంధాం. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి పలువురు కవులు, కళాకారులు ముందుకు వచ్చారు. ముఖ్యంగా వర్గ దృక్పథం తప్ప ఈ దేశాన్ని మరేది విముక్తం చేయలేదని ఆరు దశాబ్దాల పాటు పాటుపడిన యుద్ధనౌక గద్దర్‌‌‌‌, తెలంగాణ పాటల కోయిల ఉద్యమ గాయని విమలక్క, పాటను అంబేద్కరీకరించి శక్తివంతమైన భావజాల పాటల్ని అందించిన మాస్టార్జీ వంటి సీనియర్లతో పాటు పాటను శక్తివంతంగా ప్రయోగించగలిగిన అనేక మంది యువ గళాలు ఈ వేదిక మీద గొంతెత్తడం ఒక చారిత్రక సందర్భం. అందుకే సీనియర్‌‌‌‌ జర్నలిస్టు పాశం యాదగిరి మొన్నటి వేదిక మీద ప్రారంభ ఉపన్యాసంలోనే ఇది ఇప్పటి నుంచి లలిత కళాతోరణం కాదు, దళిత కళాతోరణం అని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. 

కొత్త ఆశను నింపిన ధూంధాం...

ప్రజల పాటలు గత చరిత్ర కాదు. వర్తమానం.. మన భవిష్యత్‌‌‌‌ కూడా. పాటకు మరణం లేదు. పాటే ప్రజల ఆస్తి. ప్రజల నోళ్లల్లో నానుతూ వారిని కార్యోన్ముఖులను చేసే శక్తి పాటకే ఉంది. అలాంటి బహుజన ఉద్యమ పాట, ధూంధాం వేదిక మీద పోటెత్తింది. కాన్షీరామ్‌‌‌‌ చూపిన మార్గం పాటలో ప్రతిధ్వనించింది. బహుజనుల వారసత్వంగా వస్తున్న డప్పులు, ఒగ్గుడోళ్లు, బైండ్ల జమిడికలు మార్మోగిన తీరు భవిష్యత్‌‌‌‌ మీద ఎంతో ఆశను కలిగిస్తున్నాయి. మరోసారి సాంస్కృతిక ఉద్యమం ఉవ్వెత్తున లేవనుందనే నమ్మకాన్ని, భరోసాను కలిగిస్తున్నది. ఇటీవల జరిగిన బహుజన ధూంధాం వేదిక మీద గొంతు విప్పిన ప్రతీ కళాకారునిలో బహుజన విముక్తి కాంక్షే ప్రధానంగా రగిలింది. బహుజనుల బతుకు మారాలంటే పాలన మారాలి. బహుజనులు రాజ్యాధికారాన్ని సాధించాలి. అదే తెలంగాణ అమరవీరులకు అసలైన నివాళి అనే భావన ప్రతీ ఒక్కరిలో కనిపించింది. ఇందుకోసం రాత్రింబవళ్లు కష్టపడిన నిర్వాహకుల శ్రమ వృథా కాలేదు. యావత్‌‌‌‌ రాజకీయ పార్టీలకు ఈ బహుజన ధూంధాం ఒక సంకేతాన్ని అందించింది. మరోసారి పాట ఊరూరా పోటెత్తనుందనే విషయాన్ని చాటిచెప్పింది. తెలంగాణలో దొరల పాలన ఇక కొనసాగకుండా బహుజనులు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసింది. ఇప్పుడు తెలంగాణలోని బహుజన మేధావులు, ఉద్యోగులు యువత ఈ సాంస్కృతికోద్యమ పతాకను ఊరూరికీతీసుకువెళ్లాలి. 

ఎదురీది నిలబడ్డ పాట

అలరించే పాటల వరదలో ఏటికి ఎదురీది నిలబడ్డది బహుజన పాట. పూలే, అంబేద్కర్ల ఆలోచన విధానంతో సరికొత్త బహుజన పాటను అందించిన వాగ్గేయకారులు లేకపోలేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న బహుజన చైతన్యానికి పాట నెత్తుటసొంటి శక్తిని అందించింది. ఫలితంగా అంబేద్కరిజం అందివచ్చింది. పాటను బహుజనీకరించాలన్న సోయి క్రమంగా పెరుగుతోంది. కాకుంటే ఇవాళ ఎర్ర ఉపాళి వంటి వాగ్గేయకారుల అకాల మరణం బహుజన ఉద్యమానికి అతిపెద్ద లోటు. ఈ లోటును పూడ్చడానికి యువ వాగ్గేయకారులు అందిరావాల్సి ఉంది. బహుజన ఉద్యమ చరిత్రను అధ్యయనం చేయాలి. ప్రజలను నడిపించే పాట కావాలి. రాజ్యాధికారానికి పాట ప్రజలను సన్నద్ధం చేయాలి. అట్లా చేసినప్పుడు బహుజన ఉద్యమంలో సాంస్కృతిక పార్శ్వం బలంగా నిలబడగలుతుంది. పాట బహుజనులది. ఆ పాట ఇప్పటి దాకా ఏవేవో ఉద్యమాలకు రాళ్లందించింది. ఇవాళ బహుజన కళాకారులు తమ విముక్తి కోసం కొట్లాడ్తరు.
- డా.పసునూరి రవీందర్‌‌‌‌, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత.