స్వరాష్ట్రంలోనూ ఎస్సీ ఉపకులాల పరిస్థితి దారుణమే..

ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన దళిత వర్గాలకు స్వరాష్ట్రంలోనూ సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. వీరిలో ఎస్సీ ఉపకులాల పరిస్థితి మరీ దారుణం. ఎస్సీల్లో ఇంకా ఎన్నో కులాలు సామాజిక న్యాయానికీ, విద్యకు, వైద్యానికీ, రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నాయి. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని చిందు, హోలియదాసరి కళాకారులు భాగవతం, యక్షగానాలు, బైండ్ల జమిడిక దరువులు, పోతరాజుల ఈరగోలలు, డక్కలి కిన్నెర వాయిద్యాలతో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు. ప్రజలను చైతన్యం చేస్తూ ఉద్యమంలో వారి పాత్ర నిర్వర్తించారు. కానీ రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లు కావొస్తున్నా.. ఎస్సీ ఉపకులాల అభివృద్ధి గురించి సర్కారు పట్టించుకున్న పాపాన పోలేదు. 

రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం దళితుల జనాభా 63 లక్షల 60 వేల 158 ఉండగా ఇందులో మాదిగ కులస్తుల జనాభా 25 లక్షల 9వేల 992(39%)ఉంది. మాల కులస్తులు జనాభా17 లక్షల 5 వేల 448(27%) గా ఉంది. ఎస్సీ ఉపకులాల జనాభా మొత్తం 21లక్షల14 వేల 718(34%) ఉన్నది. గత ప్రభుత్వాలను పక్కనపెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నిరుటి వరకు ఈ ఏడేండ్లలో.. ఎస్సీ కార్పొరేషన్​ ద్వారా లబ్దిపొందిన దళితుల యూనిట్ల వివరాలు పరిశీలిస్తే.. 39 శాతం జనాభా ఉన్న మాదిగలు69.1 శాతం యూనిట్లు పొందగా, 27 శాతం జనాభా కలిగిన మాల కులస్తులు 23.5 శాతం యూనిట్లు పొందారు. కానీ 34 శాతం జనాభా ఉన్న ఎస్సీ ఉపకులాలు కేవలం 7.4 శాతం యూనిట్లను మాత్రమే పొందారు. ఇలా ప్రభుత్వం ఎస్సీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఉపకులాలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో వారు మరింత పేదలుగానే మిగిలిపోతున్నారు. దళితబందు పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలో వందమందికి కేటాయిస్తే అందులో కేవలం రెక్కల కష్టంపై మాత్రమే ఆధారపడి జీవించే ఎస్సీ ఉపకులాలవారికి ఎక్కడా కూడా అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. 

కులవృత్తి వదిలి కూలీలుగా..

దేశ చరిత్రను, యాక్షగాన, భాగవత పురాణాలను, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే ఎస్సీ ఉపకులాల కులవృత్తులను ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్ల క్రమంగా అవి కనుమరుగవుతున్నాయి. ఉపాధి కరువై వారు రోజువారీ కూలీలుగా మారుతున్నారు. ఒకప్పుడు చెప్పులు కుట్టి ఉపాధి పొందిన మోచీ, చమార్, సమగర కులస్తులు ఇయ్యాల దిక్కులేని వారు అయ్యారు. గ్రామ దేవతలకు పట్నాలు వేసి, జమిడిక వాయిద్యంతో పూజలు అందించే బైండ్ల (పంబాల, కొలుపుల, ద్యావతి, పోతురాజులు) సోదరుల వృత్తికి ఆదరణ లేకుండా పోయింది. చిందు, హోలీయదాసరి కులస్తుల యక్షగాన, భాగవత పురాణగాథ ప్రదర్శనలు గ్రామాల్లో ఎంతో మార్పు తీసుకువచ్చేవి. ఇప్పుడా కళాకారులు ఉపాధి దొరక్క పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారిపోయారు. కిన్నెర వాయిద్యంతో ఆదిజాంబవ, ఎల్లమ్మ ,శివ పురాణాలను చెప్తూ సంచార జీవనం చేసే డక్కలి కులస్తులు, బేడా బుడగ జంగాలు, పశువులను కాస్తూ కళలను ప్రదర్శించే గోసంగి కులస్తులు, గారడీ విద్యలు ప్రదర్శించి పొట్ట పోసుకునే మాష్టిన్ కులస్తులు విద్యకు దూరమై ఉపాధిలేక దుర్భర జీవితం గడుపుతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఎస్సీ ఉపకులాలు ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయి. 

కులం సర్టిఫికెట్లకూ తిప్పలే..

ఎస్సీ ఉపకులాల్లో చాలా వర్గాల ప్రజలు కనీసం కుల ధ్రువీకరణ పత్రాలు కూడా సకాలంలో పొందలేక విద్య, ఉపాధి, ఉద్యోగ పరంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం దళితులకు అందించే పథకాలను కూడా అందుకోలేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. కొన్ని కులాలకు కులం సర్టిఫికెట్లు మండలాల్లో తహసీల్దార్లు ఇస్తుండగా మరి కొన్ని కులాలకు ఆర్డీవో లేదా కలెక్టర్ ద్వారా తీసుకోవాల్సి వస్తోంది. రెక్కాడితేగానీ డొక్కాడని ఉపకులాల ప్రజలు చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూ కులం సర్టిఫికెట్​ తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ బాధలు భరించలేక ఉపకులాలకు చెందిన చాలా మంది మాల లేదా మాదిగ కులం సర్టిఫికెట్లు పొందుతూ వారి కులాల అస్థిత్వాన్ని కోల్పోతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనాదిగా పశుపోషణ వృత్తిలో ఉన్న మదాసికురువ/మదారికురువ కులస్తులకు అధికారులు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలు అంటగడుతూ వారి కుల అస్థిత్వాన్నే కనుమరుగు చేసేలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మారాలె. ప్రభుత్వం బడుగుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరం 
ఎంతైనా ఉంది.

ఆదుకోవాల్సిన బాధ్యత సర్కారుదే..

ఎస్సీ ఉపకులాలు కుల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఇబ్బందులు తొలగించాలి. ఎస్సీ ఉపకులాలను దళితుల్లో అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దళితబందులో ఎస్సీ ఉపకులాలకు ప్రతి నియోజకవర్గంలో 40 శాతం యూనిట్లు కేటాయించాలి. ప్రభుత్వ గురుకులాల్లో ఎస్సీ ఉపకులాల విద్యార్థులకు అర్హత పరీక్షలు లేకుండా నేరుగా ప్రవేశం కల్పించాలి. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంపై ఆధారపడి బతికే మాంగ్, మహార్, మాంగ్ గరోడి కులస్తుల భూములకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలి.  ఇప్పటి వరకు చట్టసభల్లో ఎలాంటి ప్రాతినిధ్యం లేని ఎస్సీ ఉపకులాలకు రాజ్యసభ సీటు కేటాయించాలి. జనాభా ప్రకారం రాజకీయంగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో ప్రత్యేక వాటా ఇయ్యాలి. చర్మకార వృత్తిపై ఆధారపడి జీవించే మోచీ, చమార్, సమగర కులస్తులను చేతి వృత్తి దారులుగా గుర్తించి, లెదర్ పార్కులు నిర్మించి ప్రత్యేక సొసైటీ ద్వారా చెప్పుల మార్కెటింగ్​ను ప్రోత్సహించాలి. బైండ్ల పూజారులను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని గ్రామదేవతల ఆలయాల్లో పూజారులుగా నియమించి గౌరవ వేతనం ఇయ్యాలి. 2018 లో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మోచీ, బైండ్ల, బెడబుడగ జంగం కులాలకు కేటాయించిన ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి, అన్ని ఉపకులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించి ఇయ్యాలి. అప్పుడే ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరుగుతుంది. 

57 ఎస్సీ ఉపకులాలు

దళితులలో అత్యంత వెనుకబడిన కులాలు 57 వరకు ఉన్నాయి. మోచీ, హోలియదాసరి, బైండ్ల, చిందోల్లు, మష్టిన్, గోసంగి, డక్కలి, మాలజంగం, సమగర, మాదిగజంగం, బెడబుడగ జంగం, మాలదాసరి, కొలుపుల, మితల్అయ్యవార్లు, మదాసికురువ/మాదారికురువ, మాంగ్, మహార్, మాంగ్ గరోడి, నేతకాని, పాకి, మోటి, తోటి, మెహతర్, బ్యాగరి, చాచాటి, దండాసి, దోర్, దోంబర, పైడి, పానో లాంటి కులాలు విద్య, ఉద్యోగాలు, ఉపాధి ఫలాలు అందక సంచార జీవనాన్ని గడుపుతున్నాయి. దళితులలో మాల, మాదిగలు కాకుండా ఇన్నికులాలు ఉన్నాయా అన్న విషయం కూడా ఈ సమాజంలో చాలా మందికి తెలియదు. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-  బైరి వెంకటేశం 
రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి