ఎస్సీ ఉపకులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. తెలంగాణ మాదిగ సంఘాల డిమాండ్

ఎస్సీ ఉపకులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి.. తెలంగాణ మాదిగ సంఘాల డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 77 ఏం డ్లు దాటుతున్నా బేడ, బుడగ జంగం, సంచార జాతులకు రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర చైర్మన్ క్రాంతికార్ పోకల కిరణ్ మాదిగ అన్నారు. సామాజిక సమతుల్యం అవసరమని, సంచార జాతులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. 

ఆదివారం  హైదరాబాద్ బర్కత్​పురాలోని మహాకూటమి స్టేట్​ఆఫీసులో ప్రజా సంఘాల సమావేశం జరిగింది. కిరణ్ మాట్లాడుతూ వీఆర్ఎస్ తీసుకున్న డీఎస్పీ మదనం గంగాధర్ కు ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని డిమాండ్​ చేశారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జ్ ​మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. 

ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గొల్లపల్లి దయానంద రావు మాట్లాడుతూ సమాజంలో నేటికీ బేడ, బుడగ జంగం వారు అత్యంత వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ప్రాధాన్యత లేకపోవడమే కారణమన్నారు. ఆ వర్గాల వారికి ఎమ్మెల్సీ పదవి కేటాయిస్తే కాంగ్రెస్​కు మద్దతుగా ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో బాలరాజు, కొండ రాజు, కొండలరావు, పుష్పవతి, నవీన్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.