సుప్రీంకోర్టుకు కేసీఆర్..విద్యుత్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను రద్దు చేయాలని పిటిషన్​ దాఖలు

  • విద్యుత్‌‌‌‌ కమిషన్‌‌‌‌ను రద్దు చేయాలని పిటిషన్​ దాఖలు
  • సీజేఐ బెంచ్ ​నేతృత్వంలో నేడు విచారణ
  • ఇప్పటికే పిటిషన్‌‌‌‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : విద్యుత్​ కొనుగోళ్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడీషియల్​ కమిషన్‌‌‌‌ను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్  తన విచారణను కొనసాగించవచ్చని ఇటీవల హైకోర్టు సీజే ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఆయన సవాల్​ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీన్ని సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 

మళ్లీ అవే ఆరోపణలతో..!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న విద్యుత్ రంగ నిర్ణయాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో జుడీషియల్ కమిషన్‌‌‌‌ను నియమించిన విషయం తెలిసిందే. దీన్ని తప్పుపడుతూ కేసీఆర్​ మొదట హైకోర్టును ఆశ్రయించారు. 

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్‌ను ఏర్పాటు చేశారని, వెంటనే విచారణ నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్​ వేశారు. అప్పట్లో కమిషన్‌ చైర్మన్‌కు రాసిన సుదీర్ఘ లేఖలోనూ ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.  నాటి తమ ప్రభుత్వం విద్యుత్​ కొనుగోళ్లు జరపడం తప్పు కాదని, ఇప్పుడు కొనుగోళ్లపై విచారణ చేయడమే తప్పు అని, విచారణ నుంచి తప్పుకోవాలని కమిషన్ చైర్మన్‌ జస్టిస్ నర్సింహారెడ్డికి లేఖలో  కేసీఆర్​ డిమాండ్​ చేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్‌లోనూ జస్టిస్​ నర్సింహారెడ్డిపై కేసీఆర్ పలు ఆరోపణలు చేశారు. జస్టిస్​ నర్సింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ముందే ఓ నిర్ణయానికి వచ్చి మీడియాకు లీకులు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ వేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్​ నర్సింహారెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘మీడియా సమావేశం నిర్వహించారనే కారణంతో జస్టిస్​ నర్సింహారెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించారనడం సరికాదు. ఇంకేవైనా ఆధారాలు ఉంటే కోర్టుకు అందజేయాలి” అని కేసీఆర్ తరపు లాయర్లకు హైకోర్టు సూచించింది. ఆధారాలేవీ సమర్పించకపోవడంతో కేసీఆర్​ పిటిషన్‌ను కొట్టేసింది. విద్యుత్ కమిషన్ తన విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు అవే ఆరోపణలతో కేసీఆర్ సుప్రీంకోర్టు గడపతొక్కారు. ఈ నెల 9న సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్​ దాఖలు చేశారు.