బెంగాల్ లో రాష్ట్రపతి పాలనపై.. ఈ సమయంలోమేం రాష్ట్రపతికిఆదేశాలివ్వాలా?

బెంగాల్ లో రాష్ట్రపతి పాలనపై.. ఈ సమయంలోమేం రాష్ట్రపతికిఆదేశాలివ్వాలా?
  • ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నం: సుప్రీంకోర్టు జడ్జి
  • కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నరు
  • ఇప్పుడు బెంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? 
  • రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలంటూ ఆర్డర్స్​ ఇవ్వాలని కోరుకుంటున్నారా?
  • ముర్షిదాబాద్​​ అల్లర్ల పిటిషన్​విచారణ సందర్భంగా జస్టిస్​ బీఆర్ ​గవాయ్​ ప్రశ్న
  • ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరణ

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థపై  బీజేపీ నేతలు చేస్తున్న కామెంట్స్​పై సుప్రీంకోర్టు పరోక్షంగా స్పందించింది. బెంగాల్​లోని ముర్షీదాబాద్​లో ఇటీవల జరిగిన అల్లర్లపై దాఖలైన పిటిషన్​విచారణ సందర్భంగా సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం.. ఈ సమయంలో రాష్ట్రపతికి ఆదేశాలివ్వాలా? అని ప్రశ్నించింది. వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో బెంగాల్‌‌లో ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ నేపథ్యంలో బెంగాల్‌‌లో రాష్ట్రపతి పాలన కోరుతూ ఇద్దరు పిటిషనర్ల తరపున 2021లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన లాయర్​ విష్ణు శంకర్ జైన్.. తాజా అల్లర్లపై కొత్త పిటిషన్‌‌ను విచారణకు స్వీకరించాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్​ను  జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌‌, జస్టిస్​ గవాయ్​తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పరిశీలించింది. ఈ సమయంలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.  “ఇప్పటికే మేం కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో బెంగాల్​లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? ఇందుకోసం రాష్ట్రపతికి మాండమస్ రిట్ జారీ చేయాలని ఆదేశాలివ్వాలని మీరు కోరుకుంటున్నారా?” అని పిటిషనర్​ను ప్రశ్నించారు. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు  నిరాకరించారు.

బీజేపీ నేతల కామెంట్ల నేపథ్యంలోనే..

రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి టైమ్‌‌లైన్ విధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని  స్పష్టం చేసింది. ఈ తీర్పును ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్​ధన్​ఖడ్​​, పలువురు బీజేపీ నేతలు తప్పుపట్టారు.  ఉప రాష్ట్రపతి ధన్‌‌ఖడ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్య శక్తులపై సుప్రీంకోర్టు మిసైల్​ను ప్రయోగించొద్దు. మనకు శాసనాలు చేసే జడ్జీలు ఉన్నారు. కార్యనిర్వాహక విధులూ వారే నిర్వహిస్తారు” అని వ్యంగ్యంగా అన్నారు. అలాగే, ఈ అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌‌ దూబే కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒకవేళ సుప్రీంకోర్టు  చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌‌ భవనాన్ని మూసివేయాలి’’ అని కామెంట్​ చేశారు. ఈ క్రమంలోనే కాబోయే చీఫ్​ జస్టిస్​ బీఆర్​ గవాయ్ స్పందించారు. బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.