
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ విమెన్స్ పోస్ట్‌మెట్రిక్ హాస్టల్ స్టూడెంట్లు ఆరున్నరేండ్లుగా అవస్థల నడుమ చదువులు సాగిస్తున్నారు. హాస్టల్కోసం నిర్మించిన బిల్డింగ్‌ను గతంలో కలెక్టరేట్‌కు కేటాయించి ఆ మహిళా స్టూడెంట్లను పట్టించుకోని అధికారులు.. మరోసారి వారికి అన్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. హాస్టల్కోసం డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అన్ని సౌలతులతో బిల్డింగ్ నిర్మించినప్పటికీ వారికి అది అందకుండా పోయింది.
ఆరున్నరేండ్లుగా..
2016 అక్టోబర్‌లో మంచిర్యాలను ప్రభుత్వం ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంతో స్టూడెంట్ల హాస్టల్కోసం నిర్మించిన ఈ బిల్డింగ్‌ను టెంపరరీగా కలెక్టరేట్కోసం కేటాయించారు. నస్పూర్‌లో ఇంటిగ్రేటెడ్కలెక్టరేట్ నిర్మాణం ఆలస్యం కావడంతో గత ఆరున్నరేండ్లుగా కలెక్టరేట్‌ను ఆ విమెన్స్ హాస్టల్ బిల్డింగ్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్కలెక్టరేట్ బిల్డింగ్ సిద్ధమైంది. జూన్9న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్ల పేషీలు, కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణంపూర్తి కాగా.. మిగతా పనులు కొనసాగుతున్నాయి. రెండు, మూడు నెలల్లో ఈ పనులు కంప్లీట్‌కాగానే ఓల్డ్కలెక్టరేట్ బిల్డింగ్‌లోని ఆఫీసులన్నింటినీ కొత్త బిల్డింగ్‌కు షిఫ్ట్చేయనున్నారు. అయితే, త్వరలోనే ఖాళీ కానున్న ఈ బిల్డింగ్‌ను స్టూడెంట్లకు కేటాయిస్తారా? మరి దేనికైనా ఉపయోగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
సౌలతులు లేక అవస్థలు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ప్రభుత్వం హయాంలో ఎస్సీ సబ్‌ప్లాన్ ఫండ్స్‌తో ఎస్సీ విమెన్స్ పోస్ట్మెట్రిక్హాస్టల్ను నిర్మించారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థినుల వసతి కోసం దాన్ని తీర్చిదిద్దారు. అయితే, తీరా ఆ బిల్డింగ్‌ను కలెక్టరేట్‌కు కేటాయించడంతో ఆరున్నర సంవత్సరాలుగా హమాలివాడలోని ఓ రెంట్ బిల్డిం
గ్లో వారిని ఉంచుతున్నారు. అందులో సరిపడా రూములు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉంటున్న హాస్టల్ నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రోజూ అప్ అండ్ డౌన్ ఏడెనిమిది కిలోమీటర్లు నడవలేకపోతున్నామని, మార్గం మధ్యలో పోకిరీల ఈవ్ టీజింగ్‌లు భరించలేకపోతున్నామని విద్యార్థినులు వాపోతున్నారు.
హాస్టల్‌కే అప్పగించాలని డిమాండ్
హాస్టల్ బిల్డింగ్ నుంచి కలెక్టరేట్ ఖాళీ కాగానే తిరిగి హాస్టల్‌కే కేటాయించాలని ఆ విద్యార్థినులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అద్దె బిల్డింగ్‌లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ బిల్డింగ్‌ను జిల్లా కోర్టు కోసం ఆ శాఖ అధికారులు పరిశీలించారు. కోర్టు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, తమకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో మరోసారి హాస్టల్బిల్డింగ్తమకు దక్కదేమోనని ఆ స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. పక్కనే డిగ్రీ, జూనియర్‌కాలేజీలు ఉండడంతో హాస్టల్‌ను ఇక్కడికి షిఫ్ట్ చేస్తే తమ కష్టాలు తొలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు సైతం హాస్టల్ బిల్డింగ్‌ను హాస్టల్‌కే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్చక్రపాణి, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతను కలిసి మెమోరాండం అందజేశారు.