నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లులో అక్రమాలు.. రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్ గాయబ్

నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లులో అక్రమాలు..  రూ.7 కోట్ల విలువైన సీఎంఆర్ గాయబ్
  • నిర్మల్ జిల్లా తిరుపల్లిలోని రైస్ మిల్లులో అక్రమాలు 
  • ముందస్తు సమాచారంతో రెవెన్యూ అధికారులు,  పోలీసుల రైడ్  
  • 30,112 క్వింటాళ్లకుపైగా మాయమైనట్టుగా నిర్ధారణ  
  • రైస్ మిల్లు ఓనర్ పై కేసు నమోదు

లక్ష్మణచాంద, వెలుగు:  నిర్మల్​జిల్లా లక్ష్మణచాంద మండలం తిరుపల్లిలోని ఎంఎస్ శ్రీ నిర్వాణ రైస్ మిల్లులో రూ.7 కోట్ల విలువైన కస్టమ్స్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) మాయమైంది. రైస్ మిల్లులో సీఎంఆర్ అక్రమాలు జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం మేరకు సోమవారం సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా రైడ్ చేశారు. దీంతో ధాన్యాన్ని అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన రెండు లారీ(టీఎస్ 18టీ-8887),(టీఎస్ 18టీ-2616)ల్లోని 1,500 ధాన్యం బస్తాలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం మిల్లు లోపల తనిఖీలు చేపట్టగా మొత్తం 30,112 క్వింటాళ్లకుపైగా బియ్యం మాయమైనట్లు గుర్తించారు. వాటి విలువ రూ. 6 .33 కోట్లకు పైగా ఉంటుందని లెక్కించారు. ఇంకా పూర్తిగా ఎంక్వైరీ చేస్తే మిల్లు ఓనర్ అక్రమాలు మరిన్ని బయటకు వస్తాయని స్థానికులు పేర్కొంటున్నారు. రైస్ మిల్లు ఓనర్ హన్మంత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు డీఎస్ఓ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఘటన స్థలాన్ని ఏఎస్పీ రాజీవ్ మీనా పరిశీలించారు. ఈ తనిఖీల్లో సోన్ సీఐ నవీన్ కుమార్, ఖానాపూర్ సీఐ సదారావ్, లక్ష్మణచాంద ఎస్ఐ సుమలత, డిప్యూటీ తహసీల్దార్(ఎన్ ఫోర్స్ మెంట్ ) కార్తీక్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.