వడ్ల కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల స్కామ్​..కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రోహిత్ రావు

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోళ్లలో రూ.1000కోట్ల భారీ స్కామ్​ జరుగుతోందని కాంగ్రెస్ నాయకులు మెన్నేని రోహిత్ రావు ఆరోపించారు. ఆదివారం కరీంనగర్​వ్యవసాయ మార్కెట్ యార్డ్​ను రోహిత్ రావు ఆధ్వర్యంలో కిసాన్​సెల్​ లీడర్లు సందర్శించారు. రైతులు, కూలీలతో మాట్లాడి కొనుగోలు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న మోసాల్ని ప్రయోగత్మకంగా వివరించారు. రైతులు ప్రతి క్వింటాల్ కి 1875 గ్రాముల వడ్ల చొప్పున ప్రతి ఎకరానికి రూ.900 నష్టపోతున్నారని వివరించారు. 

ఈ యాసంగిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 54 లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఎకరాకు  రూ. 900 చొప్పున  54 లక్షల ఎకరాలకు  రూ.486 కోట్లు, ఇలా ఏడాది రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. దీనికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో  కిసాన్ కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి, కొత్తపెల్లి మండల అధ్యక్షుడు  నాగప్రసాద్, నాయకులు హరీశ్​గౌడ్, సత్యనారాయణ, రమేశ్‌ యాదవ్ పాల్గొన్నారు.

కొనుగోళ్లను వేగవంతం చేయాలి 

కోనరావుపేట, వెలుగు: రైతు సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎందుకని కాంగ్రెస్ రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని పోసి నెలలు గడుస్తున్నా తూకం వేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, లీడర్లు నందు గౌడ్,  ప్రభాకర్ పాల్గొన్నారు.