
- న్యూడ్ వీడియోలున్నయంటూ డబ్బు డిమాండ్ చేసిన కేటుగాడు
- రకరకాల స్టోరీలు చెప్పి ఉల్టా పైసలు వేయించుకున్న కాన్పూర్ వాసి
కాన్పూర్: మీకు సంబంధించిన న్యూడ్ వీడియోలున్నాయంటూ బెదిరించిన స్కామర్‌నే బాధితుడు బురిడీ కొట్టించిండు. సీబీఐ అధికారినంటూ స్కామర్ కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా అందుకు బాధితుడు అంగీకరిస్తూనే ఆ ఫేక్ సీబీఐ ఆఫీసర్కే టోపీ పెట్టిండు. మూడు స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే మూడు సార్లు.. మొత్తంగా రూ.10 వేలకుపైగా తన అకౌంట్లో వేయించుకున్నడు. ఆఖరికి తానే మోసపోయానని గ్రహించిన స్కామర్.. డబ్బు రిటన్ చేయాలని వేడుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.
బంగారు గొలుసని చెప్పి మోసగాడికే మస్కా..
కాన్పూర్‌కు చెందిన భూపేంద్ర సింగ్ అనే వ్యక్తికి ఓ స్కామర్ కాల్ చేసి తాను సీబీఐ అధికారినని, న్యూడ్ వీడియోస్ ఉన్నాయని బెదిరించాడు. కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.16 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆన్లైన్ మోసగాడని పసిగట్టిన భూపేంద్రసింగ్.. ఆ స్కామర్కే మస్కా కొట్టాలని అనుకున్నడు. ఆ వీడియోస్ గురించి ఎవరకీ చెప్పొద్దని భయపడ్డట్టు నటిస్తూనే డబ్బులిస్తానని ఒప్పుకున్నాడు.
కానీ, తన బంగారు గొలుసు తాకట్టులో ఉందని, రూ.3 వేలు పంపిస్తే విడిపించి డబ్బులిస్తానని స్కామర్‌తో భూపేంద్ర చెప్పాడు. అది నిజమే అనుకున్న స్కామర్.. సింగ్ అకౌంట్‌కు 3 వేలు పంపించాడు. కాసేపాగి సింగ్.. స్కామర్‌కు కాల్ చేసి మరో స్టోరీ చెప్పిండు. తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి గొలుసు ఇవ్వట్లేదని, మీరే నా తండ్రిలాగ మాట్లాడాలని కోరాడు. అందుకు స్కామర్ ఓకే చెప్పగా సింగ్ తన ఫ్రెండ్‌నే నగల వ్యాపారి మాదిరిగా మాట్లాడించాడు.
ఇంకో రూ.4,480 ఇస్తే గొలుసు విడిపించుకోవచ్చని, అప్పుడు రూ. 1.10 లక్షల లోన్ తీసుకోవచ్చని ఆ నగల వ్యాపారి చెప్పగానే అత్యాశకుపోయి స్కామర్ ఆ డబ్బుకూడా పంపించాడు. అక్కడితో ఆగకుండా ఆ కేటుగాడికి కాల్ చేసి సింగ్ మరో కహానీ చెప్పిండు. ప్రాసెసింగ్ ఫీజు కింద నగల వ్యాపారి ఇంకో 3 వేలు అడుగుతున్నాడని అనగానే అతడు వెంటనే ట్రాన్స్ఫర్ చేసిండు.
ఆఖరికి తానే మోసపోతున్నానని గ్రహించిన స్కామర్.. డబ్బులు రిటన్ చేయాలని సింగ్‌ను వేడుకున్నడు. అందుకు ఒప్పకోని సింగ్.. నేరగాడిపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. వచ్చిన పదివేలు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తానని చెప్పాడు. మీ న్యూడ్ వీడియోలు ఉన్నాయంటూ బెదిరించిన స్కామర్‌నే ఓ వ్యక్తి బురిడీ కొట్టించిండు. మూడు స్టోరీలు చెప్పి స్కామర్ నుంచే మూడు సార్లు.. మొత్తంగా రూ.10 వేలకుపైగా తన అకౌంట్లో వేయించుకున్నడు.