
- డబ్బులు వేసినట్లు ఫేక్ మెసేజ్ పంపి, రిటన్ చేయమని అడిగిన కేటుగాడు
- పంపుతున్నా అంటూ అదే మెసేజ్‌ను ఎడిట్ చేసి సెండ్ చేసిన యువతి
న్యూఢిల్లీ: డబ్బులు గుంజుదామనుకున్న స్కామర్ ప్లాన్‌ను ఓ టీనేజర్ తెలివిగా తిప్పికొట్టింది. ఫేక్ మెసేజ్ సెండ్ చేసి, పొరపాటుగా క్యాష్ పంపించానంటూ కాల్ చేసిన సైబర్ మోసగాడికి అదే రీతిలో ఆ అమ్మాయి నకిలీ మెసేజ్ పంపి తప్పించుకుంది. సైబర్ కేటుగాడి నుంచి తానెలా తప్పించుకున్నానో చూడండి అంటూ కాల్ రికార్డింగ్స్‌ను ఆ టీనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.
ఇదీ స్కామర్ కాల్ రికార్డింగ్..
మీ నాన్న స్నేహితుడిని అంటూ కాల్ చేసిన స్కామర్.. ‘నీ బ్యాంక్ ఖాతాకు మీ ఫాదర్ 12 వేలు పంపించమన్నాడు. రూ.10 వేలు వేశాను. ఇంకో 2 వేలు ట్రాన్స్‌ఫర్ చేస్తాను’ అని ఆ టీనేజర్‌తో చెప్పాడు. ఆ 10 వేల ట్రాన్సాక్షన్‌కు సంబంధించిన ఓ ఫేక్ మెసేజ్‌ను అమ్మాయి నంబర్‌కు పంపాడు.
బ్యాంక్ నుంచి కాకుండా ప్రైవేట్ నంబర్ నుంచి మెసేజ్ రావడంతో తేరుకున్న ఆ యువతి స్కామర్‌ను నమ్ముతున్నట్లుగానే నటించింది. ఆపై ఇంకో రూ.2 వేలు వేస్తున్నానని చెప్పిన కేటుగాడు, ఈసారి రూ.20 వేల ట్రాన్సాక్షన్ పూర్తయినట్లుగా ఉన్న ఫేక్ మెసేజ్ క్రియేట్ చేసి పంపించాడు. అనంతరం తేరుకున్నట్లుగా నటిస్తూ, తాను పొరపాటున రూ.2 వేలకు బదులు రూ.20 వేలు పంపించానని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. రూ.18 వేలు రిటన్ చేయాలని కోరాడు.
అయితే, ఆ యువతి తెలివిగా అతడు పంపిన ఫేక్ మెసేజ్‌ను తానే రూ.18 వేలు పంపినట్లుగా ఎడిట్ చేసి అతనికి ఫార్వార్డ్ చేసింది. ‘‘చూడండి, నేను కూడా మీకు 18 వేలు పంపేశాను’’ అని స్కామర్‌కు చెప్పింది. దీంతో షాకైన ఆ మోసగాడు ఇక చేసేదేమీలేక.. తెలివికల్లదానివని మెచ్చుకుంటూ కాల్ కట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువతి.. అవగాహనతో ఉండకపోతే చిక్కుల్లో పడాల్సివస్తుందంటూ అలర్ట్ చేసింది.