హైడ్రా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు.. డబ్బు చెల్లిస్తే ఇళ్లు కూల్చరని వసూళ్ల దందా

హైడ్రా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు.. డబ్బు చెల్లిస్తే ఇళ్లు కూల్చరని వసూళ్ల దందా

చెరువు, కుంటలను కాపాండేందకు ఏర్పాటైన హైడ్రా.. ఆక్రమణ దారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేస్తుండంతో చాలా మందిలో హైడ్రా భయం అక్కడో ఇక్కడో ఉంది. ఈ భయాన్నే క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. అధికారులకు డబ్బులు ఇస్తే ఇళ్లు, అక్రమ కట్టడాలు కూల్చరని వసూళ్ల దందా మొదలు పెట్టారు. తాజాగా హైదరాబాద్ అమీన్ పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల నుంచి వసూళ్ల దందాకు దిగారు. 

అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీలో స‌భ్యులు కావాలంటే రూ. వేయి చెల్లించాల‌ని.. త‌ర్వాత గ‌జానికి 500ల చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ శాఖ‌ల‌లో స‌ర్దుబాట్లు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతూ వ‌సూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో హైడ్రా అధికారులను మేనేజ్ చేయొచ్చునని సామాన్యుల దగ్గర చందా వసూలు చేస్తుండటంపై ప‌లువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 

ALSO READ : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఇక నుంచి ‘చిల్లర’ గొడవలకు ఎండ్..!

దీనిపై హైడ్రా స్పందించింది. అమీన్‌ పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధార‌ణ‌పై హైడ్రా చేస్తున్న క‌స‌ర‌త్తును ఆస‌రాగా తీసుకుని ఎవ‌రైనా దందాల‌కు పాల్పడితే క‌ఠిన చ‌ర్యలుంటాయ‌ని క‌మిష‌న‌ర్ హెచ్చరించారు. దందాల‌కు పాల్పడిన‌ వారిపై పోలీసు స్టేష‌న్‌ లో ఫిర్యాదులు చేయాల‌ని బాధితుల‌కు హైడ్రా సూచించింది.