నేతల ప్రతిష్టగా మారుతున్న స్కాములు, నేరాలు!

నేతల ప్రతిష్టగా మారుతున్న  స్కాములు, నేరాలు!

 గతంలో సామాన్య ప్రజలైనా, రాజకీయ నాయకులైనా ఏదైనా కేసులో పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తే వారి వంశ ప్రతిష్టకు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టు భావించేవారు. కానీ, సామాన్య వ్యక్తులను అటుంచితే.. రాజకీయ నాయకుల విషయంలో మాత్రం రాను రాను పరిస్థితులు మారిపోయి ఎన్ని స్కాముల్లో భాగస్వాములుగా ఉంటే.. ఎన్ని నేరాలకు పాల్పడితే, ఎన్ని నేరారోపణలు ఎదుర్కొంటే అంత గొప్ప రాజకీయ నాయకుడిగా, నాయకురాలిగా అవతారమెత్తే అవకాశాలు కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి.

కనిమొళి కథ.. 2011 నుంచి 2017 వరకు సాగిన 2జి స్పెక్ట్రమ్ స్కామ్​లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూతురు కనిమొళి ప్రధాన నిందితురాలిగా కోర్టుల చుట్టూ తిరిగి 190 రోజులు తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది. చివరికి ఈ స్కామ్ లో సరైన ఆధారాలు లేనందున నిందితులందరికీ సీబీఐ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ స్కామ్ విచారణలో భాగంగా తీహార్ జైల్లో 190 రోజులు గడిపిన ఒక వ్యక్తి. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఆమెను రికార్డు మెజారిటీతో గెలిపించి చట్టాలు చేసే సభకు పంపించడం గమనార్హం.

లాలూ, ఆయన కుటుంబం 

బీహార్ ముఖ్యమంత్రిగా దశాబ్దాలు ఏలిన లాలూ ప్రసాద్ యాదవ్ స్కామ్​ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. బీహార్ రాష్ట్రాన్ని కుదిపేసిన దాణా కుంభకోణంలో ఇప్పటివరకు నాలుగు కేసుల్లో తీర్పులు వెలువరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రతి కేసులోనూ లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలు శిక్షలు విధించింది. చిట్టచివరి, అయిదోది అయిన డొరండా ఖజానా కేసులో ఆయనకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసి, రూ.60 లక్షల జరిమానా సైతం విధించింది. అయినా, ఆయనకు ఆ రాష్ట్ర ప్రజల్లో ప్రజాదరణ తగ్గలేదు. అలాగే లాలూ భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి యాదవ్​తోపాటు కుమార్తె మీసా భారతిపై 2017లో రైల్వే టెండర్ లంచం, అక్రమ ఆస్తులు, ఆదాయపు పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. కాగా తేజస్వి యాదవ్ పాత్ర ఆయా కేసుల్లో అంతగా లేనట్టు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరామామూలుగానే తీర్పునివ్వడం.. అనంతరం10 ఆగస్టు 2022న, మహాఘట్​బంధన్​లో భాగంగా నితీశ్​ కుమార్ ముఖ్యమంత్రి కాగా, తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రి కావడం జరిగింది.

జగన్​ అక్రమాస్తుల కేసులు

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికొస్తే..2012 మే 27న అక్రమాస్తుల ఆరోపణలపై ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. వైఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సీబీఐ జగన్ కు సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై జగన్ మోహన్ రెడ్డి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సీబీఐ, ఈడీ సమన్లు సైతం పంపిన విషయం విదితమే. 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. 2013 సెప్టెంబరు 23 న సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఆయనపై నమోదైన కేసులు ప్రభావం చూపకపోవడం విశేషం. 2014లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో అత్యల్ప ఓట్ల తేడాతో ఆయన పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ.. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 175 శాసన సభ స్థానాలకుగాను, ఆయన స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఏకంగా ఏపీ సీఎంగా ఎన్నికవ్వడం విశేషం.

మద్యం కేసులో కవిత 

ఇక ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత సైతం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమెకు ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. స్కామ్​లో ఆమె పాత్రపై ఎన్ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఆమెను ప్రశ్నించడం, ప్రస్తుతం దర్యాప్తు దశలో కేసు కొనసాగుతుండడం, ఈ కేసుకు హాజరయ్యే ప్రతిసారి కవిత విజయ సూచికలు సూచిస్తూ వీరనారిలా దరహాసాలు, ఉపన్యాసాలు చేస్తూ ఉంటే.. పార్టీ కార్యకర్తలు ఆమెను వీరవనితలా అభివర్ణిస్తుండడం విశేషం.

నిందితుడుగా చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనపై గతంలో నమోదైన ఎన్నో కేసుల్లో రికార్డు స్థాయిలో స్టేలు తెచ్చుకున్నారనే విషయం విదితమే. అలాగే 2015 తెలంగాణా శాసన మండలి ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు సూత్రధారిగా ప్రముఖంగా వినిపించగా ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆ కేసులో  రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కిన ప్రధాన నిందితుడు కావడం విశేషం. ప్రస్తుతం 9 సెప్టెంబర్ 2023న, 371 కోట్ల స్కిల్ డెవప్​మెంట్  స్కామ్ కేసులో చంద్రబాబు A 37 నిందితుడిగా ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబు కడిగిన ముత్యంలా వస్తారంటూ ఆయనకు పాజిటివ్ ప్రమోషన్లు సైతం మొదలు పెట్టేశారు. ఫలితంగా చంద్రబాబుకు ప్రజల్లో సింపతీ కలిగే విధంగా పార్టీ శ్రేణులు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో కెమెరా కంటికి చిక్కి ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితానికి సైతం ఆ కేసు ఎలాంటి అవరోధాలు సృష్టించకపోగా ప్రజల్లో ఆయనకు మరింత ఆదరణ పెరగడం విశేషం.