- ఎఫ్‌టీఎల్ పరిధిలో వెంచర్లు వేసి అమ్మిన రియల్టర్లు
- వనపర్తి జిల్లా కేంద్రంలో నీట మునుగుతున్న 1,200 ప్లాట్లు
- ఇండ్లు కట్టుకున్నవారికి నోటీసులు ఇచ్చిన అధికారులు
- న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్న బాధితులు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో రియల్ వ్యాపారుల మోసాలు ఒక్కొక్కటికిగా వెలుగులోకి వస్తున్నాయి. వీళ్లు అధికార పార్టీ అండతో గతంలో చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్ భూములను ఆక్రమించి వెంచర్లు వేశారు. వెంచర్‌కు అనుమతులు ఉన్నాయని, నిర్మాణాలకూ అనుమతులు వస్తాయని చెప్పి కస్టమర్లకు ప్లాట్లను అంటగట్టారు. ప్రస్తుతం చెరువుల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం పుల్ట్యాంక్ లెవల్ నీటిని నిల్వ ఉంచుతుండడంతో ప్లాట్లు నీట మునుగుతున్నాయి. కొందరు ఇప్పటికే కట్టుకున్న ఇండ్లలోకి నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అంతేకాదు ప్లాట్లలో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చేదిలేదని, ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లను కూల్చివేస్తామని మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఓనర్లకు నోటీసులు ఇచ్చారు. దీంతో వారంతా లబోదిబోమంటున్నారు.
ఇష్టారాజ్యంగా వెంచర్లు..
వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలోని నల్లచెరువు, మర్రికుంట, ఈదుల చెరువు, తాళ్ల చెరువు, అమ్మచెరువులు ఉన్నాయి. రియల్ వ్యాపారులు వీటి పరిధిలో ఉండే శిఖం, ఎఫ్‌టీఎల్‌ను కబ్జా చేసి వెంచర్లు వేశారు. ఒక్క నల్లచెరువులోనే 81 ఎకరాలు శిఖం భూమిని కలుపుకొని మొత్తం 230 ఎకరాల ఏరియాలో ప్లాట్లు చేశారు. మిగతా చెరువుల పరిస్థితి ఇలాగే ఉంది. పక్కనే ఉండే రైతుల భూములు కొనుగోలు చేసి.. శిఖం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వరకు వెంచర్‌ను విస్తరించారు. పట్టా భూముల్లో ఎఫ్‌టీఎల్ ఉన్నా పట్టించుకోలేదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా కూడా కన్వర్షన్ చేయలేదు. మున్సిపల్ పర్మిషన్, రూల్స్ ప్రకారం విశాలమైన రోడ్లు, ప్రజావసరాలకు కామన్ స్థలాలు వదలడం లాంటివి ఎక్కడా చేయలేదు.
చెరువుల ఆధునీకరణతో..
మంత్రి నిరంజన్ రెడ్డి చొరవతో వనపర్తి జిల్లా కేంద్రం పరిధిలోని ఐదు చెరువులను ఆధునీకరిస్తుండడంతో అక్రమాలు బయటపడుతున్నాయి. కేఎల్‌ఐ ద్వారా కృష్ణాజలాలను తరలించి ఎఫ్ టీఎల్ ( పుల్ ట్యాంక్ లెవల్) వరకు నీటిని నింపుతుండడంతో గతంలో వేసిన వెంచర్లు నీటిలో మునుగుతున్నాయి. రూ.10 కోట్లతో మినీట్యాంక్ బండ్‌గా డెవలప్ చేస్తున్న నల్లచెరువు పరిధిలోనే 600 ప్లాట్లు నీట మునిగాయి. మర్రికుంటలో 100 ప్లాట్లతో పాటు ఇందులో నిర్మించిన 10 ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. ఈ ఇండ్లను కూల్చేస్తామని రెవెన్యూ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఐదు చెరువుల పరిధిలో సుమారు 1200 ప్లాట్లు ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చేదిలేదని తేల్చిచెప్పారు.
అందరూ మధ్యతరగతి వాళ్లే..
శిఖం, ఎఫ్‌టీఎల్ పరిధిలో ప్లాట్లు కొన్నది మధ్యతరగతి ప్రజలే. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చూపించిన పత్రాలు చూసి, నిర్మాణానికి కావాల్సిన అనుమతులు కూడా వస్తాయని చెప్పడంతో కొనుగోలు చేశామని వాళ్లు చెబుతున్నారు. ఇప్పుడు పర్మిషన్ ఇయ్యకుంటే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కూడబెట్టిన ప్లాట్‌కే పెట్టామని సర్కారే న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే తమ పైసలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మా పైసలు మాకు ఇవ్వాలి
రియల్ వ్యాపారులను నమ్మి నల్లచెరువు సమీపంలోని 1063 సర్వే నెంబర్‌లో 2009లో ప్లాటు కొన్న. అది పట్టా భూమి అయినప్పటికీ ఎఫ్ టీఎల్‌లో ఉందంట. దీంతో ఇల్లు నిర్మించుకోవడానికి వీల్లేదని మున్సిపల్ , రెవెన్యూ అధికారులు అంటున్నారు. అప్పుడు చూపించిన ప్లాట్లు ఇప్పుడు నీటిలో మునిగిపోయాయి. మా పైసలు
మాకు ఇప్పించాలి.
- విజయభాస్కర్, ప్లాట్ల బాధితుడు, వనపర్తి
నోటీసులు ఇచ్చినం
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐదు చెరువుల పరిధిలో ఎఫ్ టీఎల్ వరకు నీళ్లు నిల్వ ఉంచుతున్నం. గతంలో చెరువులకు అక్రమంగా గండ్లు కొట్టడం, తూములను ఖరాబ్ చేయడంతో నీళ్లు నిలిచేవి కావు. ఇప్పుడు చెరువు అలుగు లెవల్ వరకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదు. ఇళ్లు నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చినం. త్వరలో కూల్చి వేస్తం.
- రాజేందర్ గౌడ్, తహసీల్దార్, వనపర్తి