ఎడ్యుకేషన్​ వీసాల పేరిట  మోసాలు

  •     ఫేక్​ సర్టిఫికెట్లు, వీసా ప్రాసెస్​పేరిట రూ. 7 నుంచి 10 లక్షలు వసూల్​
  •     విదేశాలకు వెళ్లాలనుకునే వారి బలహీనతే లక్ష్యంగా దందా 

జగిత్యాల, వెలుగు : ఎడ్యుకేషన్ ​వీసాల పేరిట జగిత్యాల జిల్లాలో నయా దందా నడుస్తోంది.  బీటెక్‌‌, డిగ్రీ, డిస్​కంటిన్యూ స్టూడెంట్స్ టార్గెట్‌‌గా వీసా మోసాలు జరుగుతున్నాయి.  ఒరిజినల్​సర్టిఫికేట్లు లేకపోయినా ఫేక్​వి తయారు చేసి వీసా ప్రాసెస్​మొత్తం తామే చూసుకుంటామని చెబుతూ రూ.లక్షల్లో వసూల్​ చేస్తున్నారు. ఫేక్​సర్టిఫికేట్లు, వీసా ప్రాసెస్​పేరిట రూ.7 నుంచి 10లక్షల వరకు వసూల్​చేస్తున్నారు.  

వీసా రిజక్టైమోసపోతున్న వారు కొందరైతే, మరికొందరు ఫేక్​సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లాక అక్కడి అధికారులు గుర్తించి వెనుకకు పంపించిన ఘటనలూ ఉన్నాయి.  ఇటీవల ఫేక్ ​డాక్యుమెంట్లతో యూకే పంపిస్తానని చెప్పి ఓ స్టూడెంట్​నుంచి రూ.7లక్షలు వసూల్​చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. 

కన్సల్టెన్సీ ముసుగు లో అక్రమ దందాలు

రాజధాని హైదరాబాద్‌‌తోపాటు, వరంగల్‌‌ కేంద్రంగా కన్సల్టెన్సీ ముసుగులో కొందరు ఫేక్​సర్టిఫికేట్ల దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ కన్సల్టెన్సీలతో కుమ్మకైన కొందరు స్థానికంగా ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్నారు. లైటెక్స్​అనే సాఫ్ట్‌‌వేర్​ద్వారా ఎడిట్ చేసిన ఫేక్ డిగ్రీ, బీటెక్ సర్టిఫికేట్లకు రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూల్ చేస్తున్నారు.  

కర్ణాటక, ఛత్తీస్‌‌గఢ్‌‌, ఏపీ, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్​యూనివర్సిటీలు, కాలేజీల పేరిట ఫేక్​సర్టిఫికేట్లు తయారు చేసి రూ.1.5 నుంచి రూ.2.50లక్షల వరకు వసూల్​చేస్తున్నారు.  

డిస్​ కంటిన్యూ స్టూడెంట్సే టార్గెట్ 

ఆర్థికంగా ఉండి డిగ్రీ, బీటెక్ లో బ్యాక్ లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ కుటుంబాలను ఫేక్ సర్టిఫికెట్స్ మాఫియా టార్గెట్​చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే.. వంటి దేశాల్లో ఎంఎస్ చేయాలంటే రూల్స్ ప్రకారం జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, టోఫెల్, జీమ్యాట్ ఎగ్జామ్స్​ రాసి క్వాలిఫై కావాల్సి ఉంటుంది. దీంతోపాటు డిగ్రీ పాసైన వారే విదేశాల్లో ఎంఎస్​చేయడానికి అర్హులు. ఈక్రమంలో వీసా ప్రాసెస్‌‌లో కచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్లు చెక్​చేస్తారు.

కాగా డిగ్రీ, బీటెక్ ఫెయిలైన స్టూడెంట్స్ ఫేక్ సర్టిఫికెట్స్ అందిస్తున్న నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. ఫేక్ సర్టిఫికేట్లతోపాటు వీసా ప్రాసెస్ కోసం దాదాపు రూ. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు వారికి ఇస్తున్నారు. అనంతరం కన్సల్టెన్సీలు ఫేక్​సర్టిఫికేట్లు తయారు చేసి వీసా ప్రాసెస్​ చేస్తున్నారు.

ఇటీవల ఫేక్​సర్టిఫికేట్లతో మెట్‌‌పల్లి కళానగర్‌‌‌‌కు చెందిన ఓ స్టూడెంట్‌‌ను ఫేక్​సర్టిఫికేట్లతో యూకేకు పంపిస్తానని చెప్పి మనోశ్​అనే వ్యక్తి రూ.7లక్షలు వసూల్​చేశాడు. ఫేక్​ సర్టిఫికేట్లు కావడంతో వీసా రిజెక్ట్​అయింది. మోసపోయానని గ్రహించిన స్టూడెంట్‌‌ పోలీసులను ఆశ్రయించడంతో మనోశ్‌‌పై కేసు ఫైల్​ అయింది. 

‘ఈ నెల 10న ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కట్ట మనోశ్‌‌(30) ను మెట్‌‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతను విదేశాలకు వెళ్లేందుకు వీసా ప్రాసెస్  చేస్తానని డీల్ మాట్లాడుకొని ఫేక్​ సర్టిఫికేట్లు తయారు చేసేవాడు. ఈక్రమంలో మెట్‌‌పల్లి కళానగర్ కు చెందిన ఓ స్టూడెంట్‌‌(26)ను యూకే పంపిస్తానని నమ్మించాడు.

తనకు డిగ్రీ లేదని స్టూడెంట్​ చెప్పగా, సర్టిఫికెట్‌‌తోపాటు వీసా ప్రాసెస్ మొత్తం తానే చూసుకుంటానని చెప్పి, రూ. 9 లక్షలతో డీల్​కుదుర్చుకున్నాడు. స్టూడెంట్​పేరు మీద ఫేక్​ సర్టిఫికేట్లు సృష్టించాడు. అవి ఫేక్‌‌వి కావడంతో వీసా రిజెక్ట్ అయ్యింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’

ఫేక్ సర్టిఫికేట్లపై కఠినంగా వ్యవహరిస్తాం

ఫేక్ సర్టిఫికెట్ల తయారీపై కఠినంగా వ్యవహరిస్తాం. ఉన్నత చదువులు చదవకుండానే  విదేశాలకు పంపిస్తామని కొందరు ఏజెంట్లు నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టి యువకులను మోసం చేస్తున్నారు. నిరుద్యోగ యువత అలాంటి ఏజెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ సర్టిఫికేట్లు అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తాం. ఫేక్​సర్టిఫికేట్లతో భవిష్యత్‌‌ను పాడు చేసుకోవద్దు. ఫారిన్ పంపించే కన్సల్టెన్సీ ఏజెంట్లపై నిఘా ఏర్పాటు చేశాం

- రవీంద్ర రెడ్డి, మెట్ పల్లి డీఎస్పీ