![స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారా..? ఇలాంటోళ్లు కూడా ఉంటారు.. జాగ్రత్త..!](https://static.v6velugu.com/uploads/2025/02/scamsters-are-robbing-investors-by-promising-big-returns-from-upper-circuit-stocks_QsIbKLfEuy.jpg)
- అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ అంటూ.. రూ.10 లక్షలు హాంఫట్
బషీర్‌బాగ్, వెలుగు: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరిట ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. సిటీకి చెందిన 40 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి తొలుత సైబర్ నేరగాళ్లు ఇందిరా ఫైనాన్స్ సర్వీసెస్ పేరిట ఫోన్ కాల్ చేశారు. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. అతని నంబర్ను ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. అందులో అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్స్ను రోజూ పోస్టు చేసేవారు. వీటితో లాభాలు పొందుతున్నట్లు కొందరు గ్రూప్ సభ్యులు స్క్రీన్ షాట్స్ షేర్ చేసేవారు. ఇలా ఒక నెలరోజులు గడిచిన తర్వాత బాధితుడు తన డీమ్యాట్ అకౌంట్ ద్వారా సదరు స్టాక్స్ కొనేందుకు ప్రయత్నించగా, సాధ్యం కాలేదు.
దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్ కొనుగోలు చేయలేరని స్కామర్లు నమ్మించారు. తమ కంపెనీలో వీఐపీ ఇన్వెస్టర్‌గా నమోదు చేసుకోవాలని సూచించి, ఓ లింక్‌ను పంపించారు. ఆ లింక్ ద్వారా బాధితుడు యాప్ డౌన్ లోడ్ చేసుకొని కొంత మేర డబ్బులు చెల్లించాడు. అనంతరం స్టాక్స్ ను ఎప్పుడు పడితే అప్పుడు విక్రయించలేరని చీటర్లు ఆంక్షలు విధించారు. ఆ తర్వాత ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బాధితుడికి బ్యాలెన్స్ చూపించసాగారు. బాధితుడు తన డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరడంతో స్కామర్లు స్పందించడం మానేశారు. దీంతో మొత్తం రూ 10, 40, 000 మోసపోయానని సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు బుధవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.