టెండర్ లేకుండానే ఆన్సర్ ​షీట్ల స్కానింగ్ వర్క్స్

  •     నామినేషన్‌ పద్ధతిలో ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించిన వీసీ
  •     అప్రూవ్ చేసిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 

కరీంనగర్, వెలుగు: ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనుల అప్పగింతలో శాతవాహన యూనివర్సిటీ వీసీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు నిబంధనలకు నీళ్లొదిలారు. రూ.కోట్ల విలువైన పనులను టెండర్ పిలవకుండానే ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. రూ.5 లక్షలకు మించి ఎలాంటి పనులు చేపట్టినా టెండర్లు పిలవాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నామినేషన్ పద్ధతిలో మూడేళ్లుగా ఒకే ఏజెన్సీకి ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులు  అప్పగించడపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

శాతవాహన పరిధిలో పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్‌భూపాలపల్లి, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల్లో 120 డిగ్రీ, 28 పీజీ, 23 బీఈడీ, 7 ఎంబీఏ కాలేజీలు, ఎంఈడీ కాలేజీ, బీపీఈడీ కాలేజీ, లా కాలేజీ  ఉన్నాయి. వీటిలో లక్షల మంది చదువుతున్నారు. కాగా, కరోనా తర్వాత రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పేపర్ వాల్యూయేషన్ ప్రక్రియను ఆన్ లైన్ చేశారు.

పరీక్షల్లో భాగంగా స్టూడెంట్లు రాసిన ఆర్సర్​షీట్లను స్కానింగ్ చేసి అప్ లోడ్ చేస్తే.. లెక్చరర్లు ఆన్ లైన్ లోనే వాల్యుయేషన్ చేస్తారు. రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల్లో ఆన్సర్ షీట్ల స్కానింగ్ కోసం టెండర్ ద్వారా ఏజెన్సీలను ఆహ్వానించగా.. శాతవాహన యూనివర్సిటీలో అలాంటిదేమీ జరగడం లేదు. మూడేళ్ల కింద ఆన్సర్ షీట్ల స్కానింగ్ పనులను కోసిన్ అనే ఏజెన్సీకి అప్పగించారు.

ఒక ఆన్సర్  షీట్​ను స్కాన్​చేసేందుకు తొలుత రూ.12కు అగ్రిమెంట్ చేసుకున్న సదరు సంస్థ, ఇప్పుడు రూ.21 తీసుకుంటున్నట్లు సమాచారం. టెండర్ పద్ధతిలో నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీలో పనులు దక్కించుకున్న ఇదే సంస్థ అక్కడ రూ.17.75కు స్కాన్ చేస్తుండడం గమనార్హం. మొదటి సంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారనుకున్నా.. ఆ తర్వాత రెండేళ్లు టెండర్లు ఎందుకు పిలవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

టెండర్​కు ప్రిపేర్ చేస్తున్నాం
 
గత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచన మేరకు ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ ఆమోదంతోనే కోసిన్ సంస్థకు స్కానింగ్ పనులు అప్పగించాం. వారికి ఎక్స్ పీరియన్స్ ఉందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. మూడేళ్లుగా వారే కొనసాగుతున్నారు. ఈసారి టెండర్ పిలిచేందుకు నోట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ విషయంలో ఉస్మానియా యూనివర్సిటీని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. 
- ప్రొఫెసర్‌ మల్లేశం, వీసీ, శాతవాహన యూనివర్సిటీ

అలా ఎలా అప్పగిస్తారు.. 

యూనివర్సిటీలో నిత్యం ఏదో ఒక అక్రమం వెలుగు చూస్తోంది. ఆన్సర్ షీట్ల పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడం సరికాదు. ప్రైవేట్ ఏజెన్సీతో వీసీ, అధికారులు కుమ్మక్కయ్యారని అనుమానించాల్సి వస్తోంది. చెల్లింపులను బయటపెట్టాలి. వెంటనే టెండర్లు పిలవాలి. ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరపాలి. 
- మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు