తెలంగాణలో ఓట్లను చెల్లాచెదురు చేసిన్రు: మర్రి శశిధర్రెడ్డి

  • 77 లక్షల ఓట్లను వేర్వేరు బూత్​లలో ఎన్రోల్ చేశారు
  • కేంద్ర ఎన్నికల సంఘానికి  మర్రి శశిధర్ రెడ్డి ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒత్తిడితో అధికారులు ఓట్లను చెల్లాచెదురు చేశారని బీజేపీ నేత​ మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. అర్బన్ ఏరియాల్లో ఒకే ఫ్యామిలీలో నలుగురు ఉంటే.. తల్లి, తండ్రి, పిల్లల ఓట్లను వేర్వేరు పోలింగ్ బూత్​లలో ఎన్ రోల్ చేశా రని పేర్కొన్నారు. ఇలా 43 నియోజకవర్గాల్లో సుమారు 77 లక్షల ఓట్లు చెల్లాచెదురయ్యాయని ఆయన తెలిపారు. 

ఈ మేరకు బుధవారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని నిర్వచన్ సదన్ లో శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎలక్షన్స్ కమిషన్ ఎఫైర్ కమిటీ సభ్యులు సరళ, అజయ్ కుమార్, పవన్ కుమార్, భరద్వాజ్​ఈసీ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు వంటి అంశాలను వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు కిషన్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర అధికారులే దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ దాదాపు 20 లక్షల కొత్త ఓట్లు నమోదు కాకుండా కుట్ర చేశారని, వెంటనే స్పెషల్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ను నియమించి, స్పెషల్ టీం ను తెలంగాణకు పంపాలని ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.  

ALSO READ: తెలంగాణను కేసీఆర్​ నంబర్​ వన్​ చేసిండు : హరీశ్​ రావు 

నిర్మల్​లో 30 వేల దొంగ ఓట్లు..
నిర్మల్ నియోజకవర్గంలో ఒకే వర్గానికి చెందిన వ్యక్తుల పేర్లతో 25 నుంచి 30 వేల ఓట్లు నమోదయ్యాయని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ దొంగ ఓట్ల జాబితాను సాక్ష్యాలతో సహా ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించినట్లు చెప్పారు.