100 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ బలరామ్​

100 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం: సీఎండీ బలరామ్​
  • భారీ మెషినరీ దిశగా సింగరేణి
  • 13 ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్, వెలుగు: కోల్ మైనింగ్ లో లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఆస్ట్రేలియా కంపెనీలతో కలిసి ముందుకు వెళ్తామని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో 13 ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ రానున్నకాలంలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్​గా పెట్టుకున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో భారీ మైనింగ్ యంత్రాలు, లేటెస్ట్ సేఫ్టీ వ్యవస్థలను సింగరేణి సమకూర్చుకుంటున్నదన్నారు. సోలార్ పవర్​ను భారీగా పెంచే ఆలోచన చేస్తుందని తెలిపారు.

 అలాగే కరెంట్ నిల్వ చేసుకునే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. సింగరేణి చేపట్టనున్న బిజినెస్ విస్తరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎండీ వివరించారు. అవసరమైన మెషీనరీ, వ్యవస్థల ఏర్పాటుకు ఆస్ట్రేలియన్ కంపెనీలు సహకరించాలని సూచించారు. ఆస్ట్రేలియా కంపెనీల ఉత్పత్తులను పరిశీలించి మేలైన, లాభదాయకమైన మెషీనరీకి ప్రాధాన్యత ఇస్తామన్నారు. లాంగ్ వాల్ టెక్నాలజీ, ఓపెన్ కాస్ట్ గనుల్లో ఓబీ, బొగ్గు తవ్వకాన్ని మరింత సమర్థంగా నిర్వహించే యంత్ర పరిజ్ఞానం అవసరం ఉందన్నారు. 

అలాగే మెరుగైన డంపుల భద్రత, సమాచార వ్యవస్థలకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా13 కంపెనీల ప్రతినిధులు తమ ప్రాడక్ట్ టెక్నాలజీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  సమావేశంలో సంస్థ డైరెక్టర్లతో పాటు ఒరిసెంట్, విల్సన్ మైనింగ్ సర్వీసెస్, మైన్సైట్, డీటీఎన్ ఏసియా పసిఫిక్, ఆర్ఎంఈ గ్లోబల్, మినరల్ టెక్నాలజీస్, తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.