అప్పుడు వరదలు.. ఇప్పుడు కరవు… : కేరళ విలవిల

కేరళలోని మొత్తం 14 జిల్లాలు మూడు నెలలుగా నీటి కరువు కోరల్లో చిక్కుకున్నాయి. అక్కడి కుంటలు, బావులు అన్నీ ఎండిపోయాయి. దీంతో గ్రామాల్లో మూడు రోజులకోసారి ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. అయితే ఇంటికి 150 లీటర్ల చొప్పునే ఇస్తుండటంతో అవి ఏ మూలకూ సరిపోవట్లేదు. నీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి
పంచాయతీకి రూ.5 లక్షల రూపాయాల చొప్పున మంజూరు చేసింది. పరిస్థితిని చక్కదిద్దటానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.

ఎందుకీ పరిస్థితి ?

కేరళలో వాటర్​ క్రైసిస్​ తలెత్తటానికి చాలా కారణాలు దారితీశాయి. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి పెద్దగా రాకపోవటం వల్ల వానలు తక్కువగా కురిశాయి. దీంతోపాటు నీటి సంరక్షణ చర్యలు చేపట్టలేదు. 2018 జూన్​ నుంచి సెప్టెంబర్​ వరకు నైరుతి రుతుపవనాలు దట్టంగా వీయటంతో 23 శాతం ఎక్కువ వానలు పడ్డాయి. వర్షపాతం 2515.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఫలితంగా గత వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా వరదలు పోటెత్తి అతలాకుతలం చేశాయి. అక్టోబర్–డిసెంబర్​లో​ సాధారణం కన్నా మూడు శాతం తక్కువగా వర్షాలు పడ్డాయి.

ప్రి–మాన్​సూన్​ సీజన్​లో (మార్చి 1 నుంచి మే 15 వరకు) ఈ లోటు ఏకంగా 45 శాతానికి చేరింది. దీంతో గ్రౌండ్​ వాటర్​ లెవల్స్​ వేగంగా పడిపోయాయి. ఫలితంగా నీటికి కటకట ఏర్పడింది. మూడేళ్ల కిందట కూడా (2016లో) కేరళలోని అన్ని జిల్లాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొనటంతో ప్రభుత్వం ‘కరువు రాష్ట్రం’గా  ప్రకటించింది. అయితే ఆ చేదు అనుభవం నుంచి పాఠాలు మాత్రం నేర్చుకోలేదు. భవిష్యత్​లో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఇప్పటివరకూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు.

టిపికల్​ టోపోగ్రఫీ

కేరళ అరేబియా సముద్రం పక్కనే ఉంటుంది. అందువల్ల వర్షపు నీరు సముద్రంలోకి వేగంగా అంటే 48–72 గంటల్లోనే చేరిపోతోంది. వాన నీటిని ఎక్కువ కాలం భూమిలో నిల్వ ఉంచే ప్రయత్నాలేవీ చేయకపోవటం దీనికి తోడైంది. చెట్లు, తోటలు నరికేయటం; సాగు భూములను తవ్విపోయటం, లేటరైట్​ కొండలను తొలచటం వంటివి కొన్నేళ్లుగా ఎక్కువైంది. అందువల్ల నీరు భూమిలోకి ఇంకే ఛాన్స్​ లేకుండా పోతోంది. పడ్డ చుక్క పడ్డట్టే సముద్రంలోకి జారుకుంటోంది. ఫలితంగా భూగర్భ నీటి మట్టాలు పడిపోతున్నాయి.

గతంలో ఇకో సిస్టమ్ బలంగా ఉండేది. దీంతో 40 శాతం వాన నీరే సముద్రంలో కలిసేది. 20 శాతం ఆవిరైతే మిగిలిన 40 శాతం భూమిలోకి ఇంకేది. గ్రౌండ్​ వాటర్​ పుష్కలంగా ఉండేది. ఇకో సిస్టం వేగంగా దెబ్బతింటూ ఉండటంతో భూగర్భ నీటి మట్టాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే భారీ వర్షాలు, వరదలు వచ్చిన ఎనిమిది నెలల లోపే భూమిలో నీళ్లు అడుగంటాయి. గడ్డి భూములు, అటవీ ప్రాంతాలు, ల్యాటరైట్​ కొండలు దట్టంగా ఉంటే భూమే జలాశయంగా మారుతుంది. గత 30 ఏళ్లుగా ఫారెస్ట్​ కవరేజీ, ప్యాడీ ల్యాండ్స్​ తగ్గిపోతున్నాయి.

ల్యాటరైట్​ కొండలు, గడ్డి భూములు, పవిత్ర వనాల ప్రాముఖ్యతను కేరళ ప్రజలు ఈమధ్య గుర్తిస్తున్నారు. కానీ.. ఇప్పటికే చాలా ఆలస్యమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషించాలి. నీరు లేకపోతే మనిషి మనుగడ సాధ్యం కాదు. నీటి సమస్య మహా విపత్తగా మారకముందే ఈ నిజాన్ని గుర్తించాలని సామాజికవేత్తలు అంటున్నారు. దీనికి కొన్ని పరిష్కార మార్గాలనూ కూడా సూచిస్తున్నారు.

ఇలా చేస్తే బెటర్​..

వెల్లూరులోని చమక్కవు టెంపుల్​కి దగ్గరలో ఆరు ఎకరాల భూమిలో పవిత్ర వనాలు ఉన్నాయి. అవి ఎన్నో జాతుల మొక్కలకు నిలయంగా మారాయి. ఇలాంటి వనాలు ఒక్క ఎకరం భూమిలో ఉన్నా ఆ నేలలో 4 చెరువుల, 40 బావుల నీళ్లు ఉన్నట్లే లెక్క. ఆ వనాలకు దగ్గరలోని కాలనీల్లో సమ్మర్​లోనూ నీటి సమస్య తలెత్తదు. ఆ పవిత్ర వనాలను అక్కడి జనాలు తమ బతుకు దెరువుగా భావిస్తారు. వాటిని రక్షించటమే తమ పనిగా పెట్టుకుంటారు. కేరళలోని అన్ని ప్రాంతాల ప్రజలూ ఇలా చేస్తే ఎప్పటికీ వాటర్​  క్రైసిస్ రాదు.