Bangladesh: మీరు కేక: ప్రధానమంత్రి ఇల్లు లూఠీ.. తిన్నారు.. తాగారు.. దొరికింది ఎత్తుకెళ్లారు !

Bangladesh: మీరు కేక: ప్రధానమంత్రి ఇల్లు లూఠీ.. తిన్నారు.. తాగారు.. దొరికింది ఎత్తుకెళ్లారు !

దేశ ప్రధాని రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో బంగ్లాదేశ్లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు సొంతం చేసుకున్న నాటి పరిస్థితులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో కనిపిస్తున్నాయి. ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారిక నివాసంలోకి వెళ్లిన నిరసనకారులు లోపల ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అంతేకాదు.. ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదన్న తరహాలో కొందరు నిరసనకారులు ప్రధాని ఇంట్లో ఉన్న చీరలను, వస్తువులను దొంగిలించి తీసుకెళుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

షేక్ హసీనా బెడ్ రూంలోకి వెళ్లి బెడ్పై పడుకుని సేద తీరిన నిరసరకారులు కొందరైతే, స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన వారు మరికొందరు. ప్రధాని ఇంట్లో వండుకోవడానికి సిద్ధంగా ఉంచిన చేపలను, కోళ్లను కూడా కొందరు దొంగిలించి తీసుకెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదీ అది అని ఏం లేదు. ఏది దొరికితే అది దొంగిలించి తీసుకెళ్లిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రధాని ఇల్లు గుల్ల చేస్తున్నారు. ప్రధాని కార్యాలయంలో ఆ కార్యాలయం తప్ప ఏం మిగిలేలా కనిపించడం లేదు.

 

బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా  మారాయి. ఈ కోటాను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్తో విద్యార్థుల చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటివరకూ 300 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన పరిస్థితులొచ్చాయి.

 

బంగ్లాదేశ్లో పాలన పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆర్మీ హెలికాఫ్టర్లో షేక్ హసీనా తన సోదరితో కలిసి భారత్లోని అగర్తలకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఆమె లండన్కు వెళ్లి తలదాచుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి.