బీజేపీ ఎన్నికల హామీగా..300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్!

  • 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్!
  • ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనున్న బీజేపీ? 
  • ఉచిత నల్లా నీరు, మహిళలకు 
  • లాడ్లీ బెహ్నా, ఫ్రీ మెట్రో, బస్ స్కీంనూ ప్రకటించే చాన్స్ 

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్​పై విజయం సాధించేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. ఓటర్లను ఆకర్షించేలా ఎన్నికల హామీలను రూపొందిస్తున్నది. 

పార్టీ అధికారంలోకి వస్తే గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, నల్లా నీళ్లు, బస్సు, మెట్రోల్లో ఉచిత ప్రయాణంతోపాటు మహిళలకు ఆర్థికసాయం అందించే లాడ్లీ బెహ్నాలాంటి స్కీమ్స్​ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం 200 యూనిట్లలోపు విద్యుత్‌‌ వినియోగదారులకు ఎలాంటి చార్జీలు విధించడం లేదు. ఈ నేపథ్యంలో దానిని 300కి పెంచే యోచనలో బీజేపీ  ఉన్నట్టు సమాచారం. 

అలాగే, దేవాలయాలు, గురుద్వారాలకు నెలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్​ స్కీమ్​అమలు చేసేందుకు ప్లాన్​ చేస్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో ఆప్​ మళ్లీ అధికారంలోకి రావడానికి ఈ పథకాలే ప్రధాన కారణమయ్యాయి. దీంతో ఇలాంటి పథకాలనే బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

ఆప్ స్కీమ్స్​ను తలదన్నేలా..

ప్రస్తుతం ఆప్​ సర్కారు ఢిల్లీ మహిళలకు ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్​ యోజన’ కింద ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థిక సాయం చేస్తున్నది. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని ఆప్​ కన్వీనర్​ కేజ్రీవాల్​ ఇటీవల హామీ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో మహిళలకోసం బీజేపీ ఎలాంటి ఆర్థిక సాయం పథకాన్ని ప్రకటిస్తుందోననే ఉత్కంఠ నెలకొన్నది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ ఎన్నికల్లోనూ బీజేపీ జయంలో మహిళలకు నగదు బదిలీ పథకాలే కీలక పాత్ర పోషించాయి.