కట్టిన ఇండ్లనూ ఇయ్యలే .. ఇప్పటిదాకా పంచినవి 4,349 

  • ఉమ్మడి జిల్లాలో శాంక్షన్​ అయిన డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లు 25,815 
  • పెద్దపల్లి జిల్లాలో ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే
  • కొత్త సర్కారైనా ఇస్తుందని పేదల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదురుచూపులు

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత సర్కార్ హయాంలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్ అబాసుపాలైంది. ఉమ్మడి జిల్లాకు 8 ఏండ్లలో మొత్తం 25,815 ఇండ్లు మంజూరైతే 10,092 మాత్రమే  నిర్మాణం పూర్తయ్యాయి. వీటిలో 4,349 ఇండ్లనే పంపిణీ చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే 3,282 ఇళ్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లాలోనైతే ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు. పంపిణీ చేసిన చోట కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకు, అనర్హులకు  ఇచ్చారని విమర్శలు  వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో మరో 7,513 ఇళ్ల నిర్మాణం స్టార్ట్​ కాలేదు. మరికొన్ని పిల్లర్లు, స్లాబ్ దశలోనే ఉన్నాయి.  

 కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 6,564 మంజూరు

కరీంనగర్ జిల్లాకు 6,564 ఇళ్లు మంజూరైతే ఇందులో 789 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. మరో 4,118 నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటి దాకా జిల్లాలో 388 మాత్రమే పంపిణీ చేశారు. ఇంకా 1,657 ఇండ్లకు పునాది కూడా తీయలేదు. హుజూరాబాద్ శివారులోని సిర్సపల్లి రోడ్ పక్కన సుమారు 600 ఫ్లాట్లను, జమ్మికుంట శివారులోని ధర్మారంలో 152 ఇండ్లు పూర్తయినప్పటికీ డ్రా తీయలేదు. వీణవంక మండలంలో 95,  గన్నేరువరంలో 30 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. చొప్పదండి మండలంలో జీ ప్లస్ టు పద్ధతిలో నిర్మిస్తున్న 250,, రామడుగు మండలం గోపాల్ రావు పేట లో 20, జమ్మికుంట పత్తి మార్కెట్ కు సమీపంలోని 278, మారుతీనగర్ లోని 200 ఇండ్లు ఇంకా పిల్లర్లు, స్లాబ్​దశలోనే ఉన్నాయి. వీటికి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే వదిలేశారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో 72 ఇళ్లు పూర్తయినా అర్హుల లిస్టు ఫైనల్ కాలేదు. 

 పెద్దపల్లిలో ఒక్కరికీ పంచలేదు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాకు 8 ఏండ్లలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు. మొత్తం 3,394 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నాటి ప్రభుత్వం అనుమతులిచ్చింది. 8 ఏండ్ల కింద ప్రారంభమైన ఇండ్లలో పూర్తయినవి 262 మాత్రమే.  ఇంకా 1669 నిర్మాణ దశలోనే ఉన్నాయి. పునాదులు కూడా తీయనివి 1463 ఉన్నాయి. 14 మండలాల్లో మంథని మండలంలో 92, కాల్వ శ్రీరాంపూర్ లో 170 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం మండలాల్లో ఒక్కటీ పూర్తికాలేదు. 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాకు 7,129 ఇండ్లు మంజూరైతే 3,368 నిర్మాణాలు పూర్తయ్యాయి. సిరిసిల్లలో 3,282 నిర్మాణం పూర్తి కాగా, వేములవాడలో కేవలం 80 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తంలో జిల్లాలో 3,368 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. 702 ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా, ఇంకా 2,417 ఇండ్ల నిర్మాణం స్టార్ట్​ కాలేదు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో నిర్మాణం పూర్తయిన ఇండ్లకు డ్రా సిస్టమ్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినా వారికి ఇంకా పంపిణీ చేయడం లేదు. 

జగిత్యాల జిల్లాలో అత్యధికం 

జగిత్యాల, వెలుగు: ఉమ్మడి జిల్లాలోనే జగిత్యాల జిల్లాకు అత్యధికంగా 8,770 ఇళ్లు మంజూరైతే ఎన్నికల ముందు వరకు 1,133 ఇళ్లు పూర్తి కాగా మరో 4,838 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ జిల్లాలో 593 ఇండ్లను పంపిణీ చేశారు. ఇంకా 2,799 ఇండ్లకు ముగ్గు కూడా పోయలేదు.

కొత్త సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆశలు

ఇళ్ల నిర్మాణం కొన్ని చోట్ల పూర్తయినా పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుదారులు గతంలో ఆందోళనలకు దిగారు. కరీంనగర్ సిటీ శివారులోని చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఫ్లాట్ల ఆక్రమణకు పలుమార్లు యత్నించారు. కొందరైతే ఏకంగా ఫ్లాట్ల డోర్లకు తమ పేర్లు రాసుకున్నారు. ఇళ్ల కోసం దరఖాస్తులు ఎక్కువ సంఖ్యలో రావడం, నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేక ఎమ్మెల్యేలు అప్పట్లో ఇళ్ల పంపిణీని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వంలోనైనా నిర్మాణం పూర్తయిన 5743 ఇళ్లను పంపిణీ చేయాలని పేదలు కోరుతున్నారు.