ఉద్యమకారులందరికీ పథకాలు వర్తింపజేయాలి

హుజూర్ నగర్, వెలుగు: మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని మలిదశ ఉద్యమకారుల ఐక్యకార్యాచరణ నియోజకవర్గ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు కోరారు. సోమవారం హుజూర్​నగర్ లోని రైస్ మిల్లర్ అసోసియేషన్ భవన్ లో మలిదశ ఉద్యమకారుల నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. 

యడ్ల విజయ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉద్యమకారులందరికీ 250 గజాల స్థలం, ఆరు గ్యారంటీలు అందేలా చూడాలని, ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల సాయం చేయాలని కోరారు. ఈ విషయమై త్వరలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఉద్యమకారులను ఒక తాటిపైకి తెచ్చి కార్యాచరణ రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో దొడ్డ నరసింహారావు, ముసుగుల చంద్రారెడ్డి, అజయ్ కుమార్, నూకల చంద్రం, శీలం వీరయ్య, పిండిపోలు కోటేశ్వరరావు, ఎండీ లతీఫ్, కడియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.