హద్దు దాటుతున్న పథకాలు : ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్ ఎం. పద్మనాభ రెడ్డి

బలహీనవర్గాల అభివృద్ధి కోసం, పేద – సంపన్న వర్గాల మధ్య తేడా తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 సూచిస్తుంది. ఈ దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజల కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. ముఖ్యంగా చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు తక్కువ ధరలో ఆహారధాన్యాలు, ఇతర పదార్థాలు పంపిణీ చేయడం, గృహనిర్మాణాలు చేపట్టడం జరిగేది. గత మూడు దశాబ్దాల్లో సంక్షేమ పథకాలను చాలా రాష్ట్రాల్లో ఓటరును ప్రలోభ పెట్టడానికి వాడుకుంటున్నట్లు కనిపిస్తున్నది. 1990లో తమిళనాడు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సంక్షేమ పథకాల పేరుతో ప్రెషర్ కుక్కర్లు, టీవీలు, ఫోన్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు, చీరలు.. ఇలా ఒకటేమిటి రకరకాల వస్తువులు ఇస్తామని ఎన్నికల్లో గెలుపొందారు. దీనికి తోడు ఉచిత కరెంటు, ఉచిత మంచినీరు, రుణ మాఫీ వంటివి కూడా హామీ ఇచ్చారు. అప్పటి నుంచి రాజకీయపార్టీల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, అవి బెంగాల్, పంజాబ్, తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని ఎన్నికల్లో ఉచితాలుగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఏది సంక్షేమ పథకం? ఏది ఉచితం అని చెప్పలేని పరిస్థితి నెలకొంది.

గ్రీస్

పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్యం జీవన విధానం, తత్వశాస్త్రం కళలు, అలాగే ఒలింపిక్ ఆటలు అన్నీ గ్రీస్ దేశం నుంచి మొదలయ్యాయి. ప్రస్తుతం గ్రీస్ దేశం ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందిన దేశం. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు, ఉన్నతస్థాయిలో ఉండేవి. గత రెండు దశాబ్దాలుగా సంక్షేమ పథకాల పేరిట ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయడంతో గ్రీసు దేశం ఆర్థిక వ్యవస్థ కూలిపోయి నేడుఅప్పుల ఊబిలో కూరుకుపోయింది.

శ్రీలంక

అస్తవ్యవస్త పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం విచ్చలవిడిగా ఉచిత పథకాలు అమలు చేయడంతో ప్రశాంతంగా అభివృద్ధి చెందుతున్న శ్రీలంకలో నేడు ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. దేశంలో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. ఇలా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చాలా ప్రభుత్వాలు ఉచితాల పేరుతో దేశాన్ని అప్పుల ఊబిలో దించాయి. 

ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అధికారులు

ఇక్కడ మరో విషయమేమిటంటే దేశంలో కొన్ని రాష్ట్రాలు పేరిట పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నాయని, ఈ పద్ధతి ముందు ముందు దేశ ఆర్థికవ్యవస్థపై పెనుభారం మోపుతుందని ఈ మధ్య కొందరు నిష్ణాతులైన ఉన్నతాధికారులు ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సమస్య తీవ్రతకు ఇదే ఉదాహరణ. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మన రాష్ట్రంలో సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న ఖర్చు, విపరీతంగా పెరిగిన పాలన ఖర్చు వంటి వాటిని పరిశీలించాల్సిన అవసరముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ప్రకటించరాదని, అలా చేసినప్పుడు వాటి అమలుకు కావాల్సిన నిధులు ఏవిధంగా సమకూరుస్తారో మానిఫెస్టోలో రాజకీయ పార్టీలు తెలపాలని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే మన రాజకీయ పార్టీలకు గెలుపే ముఖ్యం కాబట్టి సుప్రీంకోర్టు ఆర్డరు అమలు కావడం లేదు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలైన పంజాబ్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచితాలు రాష్ట్ర జీఎస్​డీపీలో 2 శాతం దాటాయని, దీన్ని1 శాతం కంటే మించకుండా చూడాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుకు నివేదించింది.

పన్నులన్నీ ఉచితాలకే పోతే మరి అభివృద్ధి ?

సామాన్యుడు టీ తాగితే పన్ను, ఒక చిన్న పిల్లవాడు చాక్లెట్ తింటే పన్ను, పెట్రోల్, డీజిల్​పై పన్నుల విషయం చెప్పాల్సిన పని లేదు. ఇలా ప్రజలు కట్టిన పన్ను, ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలే కానీ, దుబారా చేయరాదు. 2020 –21 సంవత్సరం ఆర్థిక నివేదికలో ‘కాగ్’ తెలంగాణ లోవిద్య, వైద్యం పై నానాటికీ కేటాయింపులు తగ్గిపోతున్నాయని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ఏ మేరకు నిర్లక్ష్యం చేస్తున్నదో స్పష్టం చేసింది. ప్రజలు కట్టే పన్నులన్నీ ఉచితాలకే సరిపోతే మరి అభివృద్ధి సంగతేంటి ? దీనికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేయడం, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రభుత్వభూముల అమ్మకం వంటి వాటికి పాల్పడుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ పూచికత్తుతో తెచ్చే అప్పులు దేశంలో తెలంగాణలో అధికంగా ఉన్నాయి. రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఉచిత పథకాలను ప్రవేశపెట్టకుండా రాష్ట్రంలో ఉచితాలు తగ్గించి ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- ఎం. పద్మనాభ రెడ్డి,
ఫోరం ఫర్​ గుడ్​ గవర్నెన్స్