స్కీంలు దళితులకు.. పదవులు పెద్దలకా?

రాజకీయ పార్టీలకు దళితులపై నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో వారికి రిజర్వ్ అయిన స్థానాలకు అదనంగా ఇప్పటికి ఒక్క స్థానమైనా ఇచ్చిఉండాలి. డబ్బులిస్తాం.. స్కీంలు తెస్తాం కానీ ఎమ్మెల్యే పదవులు మాత్రం ఇవ్వబోమనడంతోనే పార్టీల అసలు రంగు బయటపడుతోంది. నిజంగా హుజూరాబాద్ లో దళితుల అభివృద్ధిని కోరుకున్నప్పుడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎస్సీ నేతను నిలబెడితే నిజాయతీగా ఉంటుంది. హుజూరాబాద్ బై ఎలక్షన్ కారణంగా, ఇప్పుడు రోజూ పత్రికల్లో కేసీఆర్, రాజేందర్, దళితబంధు వార్తలే ప్రధానం అయ్యాయి. దళితుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నడూలేని ప్రయోగాలు చేస్తున్నారు. వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నారు. నిజంగా దళితులపై అంతగానం ప్రేమ ఉంటే తాను ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటే సరిపోతుంది. దళితుడే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అన్నమాటను నిజం చేస్తే వారికి అవసరమైన పథకాలు వాళ్ళే అమలు చేసుకుంటారు. ముఖ్యమంత్రిగా దళితుడిని, ఉపముఖ్యమంత్రిగా బీసీ వర్గానికి చెందిన నేతను గద్దెనెక్కించి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే కొనసాగితే ఆయన చిత్తశుద్ధిని చాటుకున్నట్లు అవుతుంది.  

ఓట్ల కోసమే దళితులపై ప్రేమ 
పాలకులు ఎవరైనా దళితులపై ప్రేమ కురిపించేది కేవలం ఓట్ల కోసమేనన్నది అందరికీ తెలిసిన విషయమే. గత ఏడేండ్లుగా దళితులపై జరుగుతున్న దాడులకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం మరియమ్మ కేసు విషయంలో సంబంధిత పోలీసులని ఏకంగా ఉద్యోగాల నుంచి తీసేయడం ముందున్న ఉప ఎన్నిక దృష్టితోనే జరిగిందని అనుకోవచ్చు. ఇసుక మాఫియాను ఎదుర్కొన్న నేరెళ్ల దళితులపై పోలీసులు దౌర్జన్యం చేసిన తీరు తమిళ సినిమా విసారణైని మించినది. అసలు ఆ విషయం పత్రికలకెక్కకుండా, టీవీల్లో రాకుండా దాచాలనే ప్రయత్నం జరిగింది. మంథనిలో దళిత ప్రేమికుడు అయిన మధు హంతకులు ఎవరో బయటపడలేదు. దళితులకు అగ్రవర్ణాల నుంచి రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఇంటికి పది లక్షలు పంచి పెద్దగా సాధించేదేమీ ఉండదు. డబ్బు కన్నా సామాజిక గౌరవం, యువత ప్రేమను అర్థం చేసుకునే మంచి గుణం, విద్య వైద్య అవకాశాలపై ప్రత్యేక దృష్టి అవసరం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నట్లు రూ. 2 వేల కోట్లు దళితుల ఎడ్యుకేషన్ కోసం ఒక ప్లాన్ ప్రకారం ఖర్చు చేస్తే రాష్ట్రంలోని దళితజాతికి గొప్ప మేలు జరుగుతుంది. కానీ తక్షణ రాజకీయ లబ్ధి ఏమీ ఉండదు. కానీ నేతలకేమో ఓట్లు, సీట్లు కావాలి. 

కొరివితో తలగోక్కుంటున్న టీఆర్ఎస్ 
టీఆర్ఎస్ పార్టీ కోరి కొరివితో తల గోక్కున్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికను కొనితెచ్చుకున్నట్లుంది. కరోనా టైంలో తీరిక లేకుండా దవాఖానల పర్యవేక్షణలో ఉన్న ఈటలతో కావాలనే కయ్యం పెట్టుకుని పార్టీలోంచి ఆయనను బయటకు పంపింది. నిజానికి ఈటల అన్న మాటలకన్నా ఆయనకు వేసిన శిక్ష చాలా పెద్దది. గులాబీ జెండాను మోసిన వారంతా టీఆర్ఎస్ వారసులే, పార్టీలో భాగస్వాములేనని ఆయన అనడంలో తప్పేమీలేదు. తెలంగాణ కోసం నిలబడి, టీఆర్ఎస్ నేతల్లో ఒకరిగా సుదీర్ఘ కాలం పోరాడిన నాయకుడు ఈటల. దీనిని ఎవరూ కాదనలేరు. తోడబుట్టిన తమ్ముడిలా ఉన్నవాడిని ఒక్కవేటుతో దూరం చేయడం కేసీఆర్ కే చెల్లింది. ఉరుములేని పిడుగులా ఓ సాయంత్రం మూడు తెలుగు చానళ్లలో ఈటల భూకబ్జాలంటూ ప్రసారాలు మొదలై ఒక విస్మయ ప్రపంచాన్ని సృష్టించాయి. మాటమాత్రమైనా అతనిని సంప్రదించకుండా దాడి చేశాయి. మంత్రులపై అనేక ఆరోపణలతో కూడిన టీవీ ప్రసారాలు, పత్రిక కథనాలు రావడం సహజమే. ప్రభుత్వం వాటిని ఆధారంగా చేసుకొని వారిపై ఎలాంటి చర్యలకు సిద్ధపడదు. పైగా రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఫోన్ కాల్ రికార్డింగ్ లతో సహా ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆరోపణలు వచ్చిన సందర్భాలు సోషల్ మీడియాలో కోకొల్లలు. అవన్నీ తేలిగ్గానే తీసుకున్నారు. కానీ ఈటల విషయం వచ్చేసరికి ఇది పెను తుఫాను అయింది. కావాలనే కేసీఆరే దీనికంతటికి వెనుకుండి కథ నడిపించాడని అందరికీ అర్థమైపోయింది. ఈటలను బలిపశువు చేయాలని ఆయన రచించిన నాటకమిది.

ఈటలను ఎదుర్కొనేందుకే దళితబంధు 
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీ అండతో నియోజకవర్గమంతా తిరుగుతూ రేపటి ఎన్నికలో తన విజయానికి పునాదులు వేసుకుంటున్నాడు. వామపక్ష భావజాలమున్న ఈటల చేరితే కాంగ్రెస్ లో చేరవచ్చు లేదా మరో పార్టీ పెట్టి పోరులో నిలువవచ్చు అనుకున్న కేసీఆర్ కు రాజేందర్ బీజేపీలో చేరడం కొత్త చిక్కుల్ని తెచ్చిపెట్టింది. అందుకే ఈటలను దీటుగా ఎదుర్కొనేందుకు ఓ కొత్త పథకాన్ని రచించాడు. అదే దళితబంధు. ఈ ఆయుధంతో హుజూరాబాద్ ఉపఎన్నికను సునాయాసంగా దాటవచ్చనుకున్న కేసీఆర్ అడుగడుగునా కొత్త  ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తోంది. టీఆర్ఎస్ వర్గాలు ఎన్ని గొప్పలు చెప్పినా దళితబంధు అమలును జనం పూర్తిగా నమ్మని పరిస్థితి ఉంది. ఇతర రాజకీయపార్టీలు, టీఆర్ఎస్ ను సమర్థించని దళిత సంఘాలు ఆగస్టు15లోగా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఆ పథకం కింద ప్రకటించిన రెండు వేల కోట్ల రూపాయలు ఎంపికైన కుటుంబాలకు అందజేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. దళితబంధు నిజమే అనే నమ్మకం కలిగేందుకు రూ.500 కోట్లు హుజూరాబాద్ లో పథకం అమలు కోసం సర్కారు విడుదల చేసినట్లు పత్రికల్లో వచ్చింది.

హామీలతో కేసీఆర్ గారడీ 
దళితుల పేరిట సీఎం కేసీఆర్ ఇదివరకు ఇచ్చిన హామీల అమలులో ఒక్క అడుగు కూడా ముందుకు జరగడం లేదు. దళితులకు మూడెకరాల భూమి అన్నమాట గారడీవాడి లాస్ట్ ఐటమ్ పాము ముంగిస కొట్లాటలాగా జారుకుంటోంది. అది సాధ్యం కాని వాగ్దానమని తేలిపోయింది. దళిత, బహుజనుల కమ్యూనిటీ భవనాలకు జాగా, నిధుల విషయానికొస్తే అగ్ర కులాలకు ముందు వరుసలో చోటు దొరుకుతోంది. ఏ సంవత్సరం కూడా బడ్జెట్ లో ఎస్సీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు పూర్తిగా విడుదల కాలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు. దళితబంధు పథకం హుజూరాబాద్ ఉప ఎన్నికతో సంబంధం లేకుండా ముందే అనుకున్నదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కానీ దళితుల కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ అనుకున్నప్పటికీ, దానికి  దళితబంధుగా పేరు పెట్టి హుజూరాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుకు ఎంచుకోవడం మాత్రం ఇటీవలి పరిణామాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోసం ఇచ్చిన హామీలను తర్వాత మరిచిపోవడమో, వాయిదాలు వేయడమో జరుగుతూ ఉంటుంది.

రెండు వర్గాలుగా దళితులు 
కొత్త పథకం కారణంగా రాష్ట్రంలోని దళితులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. దళితబంధుకు అనుకూలంగా ఉన్నవాళ్లు ఒక వర్గంగా, అదంతా ఎన్నికల డ్రామా అనేవాళ్లు మరో వర్గంగా విడిపోయారు.  కొందరు రోజూ పనిగట్టుకొని పథకాన్ని నెత్తినెట్టుకొని తిరుగుతుండగా, మరికొందరు ఈటల రాజీనామా పుణ్యమే దళితబంధు ప్రయోజనమని ప్రచారం చేస్తున్నారు. అలాగే పథకం కోసం లబ్ధిదారుల ఎంపికలో పార్టీనేతల ప్రమేయం కూడా కాదనలేనిది. వారి అనుచరులు లాభం కలిగే ఈ పథకాన్ని వదులుకోరు. ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తల పేర్లతో జాబితాలు సిద్ధమై ఉండొచ్చు కూడా. అయితే తెరాస సన్నాసుల పార్టీ కాదు, హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసమే దళితబంధును ప్రకటించామని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగా అనడంతో కొత్త చిక్కు వచ్చింది. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఎన్నికలయ్యేదాకా దళితబంధును వాయిదావేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇది ఏ మలుపైనా తీసుకోవచ్చు. 

‘‘నేను, నా రాజ్యం’’ అన్నట్లుగా.. 
ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. కరోనా కాలంలో అప్పటికే దేశంలో జరిగిన ఎన్నికల కారణంగా కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. ఎప్పటినుంచో ఈటలను పంపించేయాలని కాచుకు కూర్చున్న కేసీఆర్ కు మాత్రం నాగార్జున సాగర్ ఉప ఎన్నిక గెలుపు, కొన్ని మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో సాధించిన విజయం తగిన ముహుర్తంలా అనిపించింది. రాష్ట్రానికి మరో ఉప ఎన్నిక అవసరమా? అనవసరపు ఖర్చు, శ్రమ కదా.. కోపముంటే ఈటల మంత్రి పదవిని వెనక్కి తీసుకోవచ్చు. లేదా ప్రాధాన్యత లేని శాఖని కేటాయించవచ్చు. ఇంకో రెండేండ్లు ఆగి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటే ఇయ్యకుండా దాటేయవచ్చు. ఇన్ని ఆప్షన్లు ఉన్నా ఈటల అన్న మాటలకు కసి తీర్చుకోవాలని, ఆయనను హుజూరాబాద్ గడ్డపైనే ఓడించి ఒంటరి వాణ్ణి చేయాలని, ఆ తర్వాత కేసులు తీవ్రం చేసి పిచ్చోడిలా కోర్టుల చుట్టూ తిప్పాలన్న బలమైన కోరిక కేసీఆర్ ను నిలువనీయలేదు. ఈ విషయంలో ‘‘నేను, నా రాజ్యం’’ అన్నట్లుగా ఆయన తీవ్ర అహంకారంతో ప్రవర్తించారు.
- బి. నర్సన్, పొలిటికల్​ ఎనలిస్ట్