
యూజీ, పీజీ.. కెరీర్‌ను నిర్ణయించే కోర్సులు. ఈ దశలో సదువుకోవాలని ఉత్సాహం ఉండి ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారే ఎక్కువ. అటువంటి వారు సైతం ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉత్తమ మార్గం స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు. కోర్సు ఫీజుతో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, స్టేషనరీ, ఇతర ఖర్చులకు కంటింజెన్సీ గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ, డాక్టోరల్ స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌ల వివరాలు మీకోసం..
ఉన్నత విద్యలో సాంప్రదాయ డిగ్రీ కోర్సులు, ప్రొఫెషనల్ ప్రోగ్రాములు చేస్తున్న వారు, మెరిట్ సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం www.scholarships.gov.in లో లభిస్తుంది. కొన్ని పథకాలకు ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సి ఉండగా మరి కొన్నింటికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సీఎస్ఎస్ఎస్
గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్‌లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ (CSSS). కుటుంబ ఆదాయం 8 లక్షలలోపు ఉండి మెరిట్ కలిగిన విద్యార్థులకు రోజవారీ ఖర్చులకు గాను ఆర్థిక సాయం చేస్తారు. దేశవ్యాప్తంగా బాలురకు 41,000, బాలికలకు 41 వేల చొప్పున మొత్తం 82 వేల స్కాలర్షిప్లు అందిస్తారు. 18–25 సంవత్సరాల మధ్య ఉండి 12వ తరగతిలో 80 శాతం పైగా మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిస్టెన్స్ లేదా కరస్పాండెంట్ మోడ్ లో చదివిన వారు అనర్హులు. దీని కింద సంవత్సరానికి పదివేల చొప్పున మొదటి మూడు సంవత్సరాలు (యూజీ), తర్వాతి రెండు సంవత్సరాలు (పీజీ) రూ.20 వేల చొప్పున అందిస్తారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. సైన్స్, కామర్స్, హ్యూమానిటీస్ విభాగాలకు 3:2:1 నిష్పత్తిలో కేటాయిస్తారు. వివరాలకు www.scholarships.gov.in చూడవచ్చు.
నాన్ హిందీ స్టేట్స్కు ప్రత్యేకం
హిందీ మాట్లాడని రాష్ట్రాల విద్యార్థులు హిందీ చదివేలా ప్రోత్సహించే స్కాలర్షిప్ ఇది. స్కీం ఆఫ్ స్కాలర్షిప్ టు స్టుడెంట్స్ ఫ్రమ్ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ అని పిలిచే ఈ స్కాలర్షిప్ ను 11వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఇస్తారు. మాతృభాష హిందీ కాకుండా నాన్ హిందీ స్పీకింగ్ రాష్ర్టాలకు చెంది 10+2+3+2 విధానంలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివేవారు అర్హులు. దేశవ్యాప్తంగా మొత్తం 2500 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. +2 వారికి సంవత్సరానికి రూ.3600, డిగ్రీ విద్యార్థులకు రూ.6000, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ అభ్యర్థులకు పదివేల రూపాయల సాయం చేస్తారు.
ఎస్టీలకు ఎన్ఎఫ్ఎస్హెచ్ఈ
ఉన్నత చదువుల్లో ఎస్టీ విద్యార్థులకు ఆసరాగా నిలవడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం నేషనల్ ఫెలోషిప్ అండ్ స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ (ఎన్ఎఫ్ఎస్హెచ్ఈ–ఎస్టీఎస్). డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్, ఎంఫిల్, పీహెచ్డీ అభ్యర్థులకు ఫెలోషిప్ ఇస్తారు. ఇందులో ఎంఫిల్ కు నెలకు రూ.25,000, పీహెచ్డీ లకు రూ.28,000 అందిస్తారు. దీనికి అదనంగా కంటింజెన్సీ గ్రాంట్‌కింద ఎంఫిల్ వారికి సంవత్సరానికి రూ.10 వేలు, పీహెచ్డీ వారికి రూ.20500 ఇస్తారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏ ఉంటుంది. గ్రాడ్యుయేట్లకు రూ.2.5 లక్షల వరకు ట్యూషన్ ఫీజు వేవర్‌తో పాటు బుక్స్‌కు మూడు వేలు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కు నెలకు రూ.2200, కంప్యూటర్ యాక్సెసరీస్‌కు ఒకేసారి రూ.45000 సాయం చేస్తారు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.6 లక్షలు దాటకూడదు.
సింగిల్ గర్ల్స్‌కు పీజీఐజీఎస్
బాలికలకు ఉన్నత చదువుల్లో ఉచిత విద్యనందించి ప్రోత్సహించేందుకు యూజీసీ ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరాగాంధీ స్కాలర్షిప్ ఫర్ సింగిల్ గర్ల్ చైల్డ్ (పీజీఐజీఎస్–ఎస్జీసీ). దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉండి రెగ్యులర్/ఫుల్‌టైం పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొంది ఉండాలి. సంవత్సరానికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు ఇస్తారు.
ఎస్సీలకు టాప్‌క్లాస్ స్కీం
స్కాలర్షిప్ స్కీం ఆఫ్ టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్.. యూజీ, పీజీ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ, ఏఐఐఎంఎస్, ఎన్ఐటీ, ఎన్ఐడీ, ఐహెచ్ఎం వంటి టాప్ క్లాస్ ఇన్స్టిట్యూట్లలో అడ్మిషన్ పొంది ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఆరు లక్షలకు మించకూడదు. ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లయితే ట్యూషన్ ఫీజు కింద రెండు లక్షలు, ప్రైవేటు ఇన్స్టిట్యూట్లలో 3.72 లక్షల వరకు స్కాలర్షిప్ అందిస్తారు. లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద నెలకు రూ.2220, బుక్స్ అండ్ స్టేషనరీ కి రూ.3000, ల్యాప్‌టాప్ ఎయిడ్ కింద రూ.45 వేల వరకు సాయం చేస్తారు.
టెక్నికల్ ఎడ్యుకేషన్‌కు ప్రగతి
టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, డిప్లొమా చదవాలనుకున్న బాలికలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ప్రగతి స్కాలర్షిప్ స్కీం ఫర్ గర్ల్స్. దీని కింద డిప్లొమా వారికి 2 వేలు, డిగ్రీ విద్యార్థులకు రెండు వేల స్కాలర్షిప్లు ప్రదానం చేస్తారు. ఇందుకు గాను మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉండి అడ్మిషన్ పొంది ఉండాలి. ఎంపికయిన వారికి ట్యూషన్ ఫీజు కింద 30 వేల వరకు, లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద నెలకు రూ.2000 చొప్పున పది నెలల పాటు సాయం పొందవచ్చు. వివరాలకు www.aicte-pragati-saksham-gov.in వెబ్సైట్ చూడవచ్చు. టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ, డిప్లొమా చేయాలనుకున్న దివ్యాంగులకు దాదాపు ఇవే నిబంధనలతో సాక్ష్యం స్కాలర్షిప్ స్కీం ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే స్కీం అందుబాటులో ఉంది. దీనిలో డిగ్రీకి 500, డిప్లొమా వారికి ఐదు వందల స్కాలర్షిప్లు కేటాయించారు.
యూఆర్ఎస్ ఫర్ మెరిట్
బీఎస్సీ, బీఏ, బీకాం డిగ్రీల్లో యూనివర్శిటీలో మొదటి, రెండు ర్యాంక్‌లు సాధించి ఏదైనా పీజీ ప్రోగ్రాములో చేరిన మెరిట్ విద్యార్థులు దీనికి అర్హులు. లైఫ్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథ్స్, ఎర్త్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, లాంగ్వేజస్ విభాగాల్లో రెండేళ్ల పాటు ఏటా రూ.31,000 అందిస్తారు. దీనిని కూడా యూజీసీ ప్రదానం చేస్తుంది.
పీజీఎస్పీసీ ఫర్ ఎస్సీ/ఎస్టీ
అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివేలా ప్రోత్సహించడమే పీజీ స్కాలర్షిప్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఫర్ ఎస్సీ/ఎస్టీ (పీజీఎస్పీసీ–ఎస్సీ/ఎస్టీ) ఉద్ధేశం. యూజీసీ అందించే ఈ స్కాలర్షిప్ను దేశవ్యాప్తంగా 1000 మంది ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ఎంఈ/ఎంటెక్ అయితే నెలకు రూ.7500, ఇతర కోర్సులకు రూ.4500 ఆర్థిక సాయంగా పొందవచ్చు.
ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్
రైల్వేలో రిటైరైన లేదా ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్ ఉద్యోగుల పిల్లలు, విడోస్ కు ఉన్నత చదువుల్లో సాయం చేయడానికి ప్రైమ్ మినిస్టర్స్ స్కాలర్షిప్ స్కీం (పీఎంఎస్ఎస్) ప్రవేశపెట్టారు. ఆయా రైల్వే జోన్లకు కోటా ఉంటుంది. మొత్తం 150 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 6, ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో 3 స్కాలర్షిప్లున్నాయి. 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి డిగ్రీ, పీజీలో ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ పొంది ఉండాలి. పురుషులకు రూ.20 వేలు, మహిళలకు రూ.22500 సాయంగా ఇస్తారు. కోర్సును బట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ ఒకటి నుంచి 5 సంవత్సరాల వరకు స్కాలర్షిప్ పొందవచ్చు.
మరికొన్ని..
యూజీ, పీజీ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులందరికీ నెలకు రూ.7000 సాయంగా అందించడానికి ప్రవేశపెట్టిన స్కీం స్కాలర్షిప్ ఫర్ టాప్‌క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీస్.
బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో పరిశోధనలు ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై)లో డిగ్రీ/ఇంటిగ్రేటెడ్ పీజీలో మొదటి మూడేళ్లు నెలకు రూ.5000 సాయంగా అందిస్తారు. ఈ సమయంలో రూ.20 వేలు కంటింజెన్సీ గ్రాంట్ కూడా ఉంటుంది. పీజీ/ఇంటిగ్రేటెడ్ పీజీలో రెండేళ్లు నెలకు రూ.7000 తో పాటు రూ.28 వేల కంటింజెన్సీ గ్రాంట్ అందిస్తారు. వివరాలకు: www.kvpy.iisc.ernet.in
నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NTSE) పరీక్షలో ప్రతిభ కనబర్చిన సైన్స్, సోషల్ గ్రూప్‌ల వారికి పీహెచ్డీ, మెడిసిన్, ఇంజినీరింగ్ అభ్యర్థులకు పీజీ వరకు ఆర్థిక సహాయం చేస్తారు. యూజీ, పీజీలో అయితే నెలకు రూ.2000, పీహెచ్డీ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్షిప్లు అందిస్తారు. వివరాలకు: www.ncert.nic.in, www.bse.telangana.gov.in
పైన పేర్కొన్న వాటితో పాటు ఆయా రాష్ర్టాలు ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ స్కాలర్‍షిప్‍లను అందిస్తున్నాయి. వాటికి కూడా దాదాపు ఇవే నిబంధనలు వర్తిస్తాయి.