స్కాలర్ షిప్ రాలేదని సర్టిఫికెట్స్ ఇస్తలేరు

  • స్కాలర్ షిప్​ రిలీజ్​ చేయని సర్కారు     
  •  ఫీజు మొత్తం కట్టాలంటున్న మేనేజ్​మెంట్లు
  • ఎంసెట్  కౌన్సిలింగ్ నేపథ్యంలో విద్యార్థుల టెన్షన్​

ఖమ్మం/ ఖమ్మంటౌన్, వెలుగు: ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్ షిప్​ మొత్తం రిలీజ్​ కాకపోవడంతో ఇంటర్​ కంప్లీటైన స్టూడెంట్స్ కు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఖమ్మం జిల్లాలోని ప్రైవేట్ జూనియర్​ కాలేజీ యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్మిషన్​ సమయంలో స్కాలర్​షిప్​కు అర్హులైన స్టూడెంట్స్  పైసా చెల్లించాల్సిన అవసరం లేదంటూ జాయిన్​ చేసుకుంటున్న మేనేజ్ మెంట్లు, సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ స్కాలర్ షిప్​లు రాలేదని, మొత్తం ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నాయి. డిగ్రీ, ఎంసెట్ కౌన్సిలింగ్ కు అటెండ్ కావాల్సిన సమయంలో సర్టిఫికెట్లు లేక స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. 

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

జిల్లాలో ప్రభుత్వ అనుమతి ఉన్న 58 ప్రైవేట్​ జూనియర్​​కాలేజీలు, 19 గవర్నమెంట్ కాలేజీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలతో కలిపి మరో 49 విద్యాసంస్థల్లో దాదాపు 10 వేల మందికి పైగా స్టూడెంట్స్​ ఇంటర్​ కంప్లీట్ చేసుకున్నారు. ప్రైవేట్  విద్యాసంస్థల్లో చదివే వారిలో దాదాపు 60 శాతానికి పైగా విద్యార్థులు స్కాలర్​షిప్​పైనే ఆధారపడి చదువుతున్నారు. ఇంటర్ లో జాయిన్ అయ్యే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలకు చెందిన స్టూడెంట్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్స్ ఇస్తే చాలని, ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకుంటామని ప్రైవేట్ కాలేజీ మేనేజ్​మెంట్లు చెప్పి జాయినింగ్ చేసుకుంటున్నాయి. స్టూడెంట్స్ పేరుపై బ్యాంకు అకౌంట్లు తెరిచి పాస్ పుస్తకం, ఏటీఎం  కార్డు కాలేజీ యాజమాన్యాలు తమ దగ్గరే పెట్టుకుంటూ, స్టూడెంట్స్ ప్రమేయం లేకుండా ప్రభుత్వం నుంచి స్టూడెంట్స్ ఖాతాలో జమ అయిన డబ్బును డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్, సెకండ్  ఇయర్  పాస్ అయ్యాక మెమో, స్టడీ కండక్ట్, టీసీ కోసం వెళితే ఫీజు కట్టకుంటే సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటూ తెగేసి చెబుతున్నాయి. 

అందరికీ స్కాలర్ షిప్​ రాలే..

జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 2020–21 విద్యాసంవత్సరానికి 10147 మంది​ విద్యార్థులు స్కాలర్​ షిప్​ కోసం అప్లై చేసుకోగా, 9059 మందికి రిలీజ్​ అయ్యాయి. 1088 మందికి వేర్వేరు కారణాలతో రిలీజ్​ కాలేదు. ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి 11,677 మంది అప్లై చేసుకోగా, 10425 మందికి రిలీజ్​ అయ్యాయి. 2021–22 సంవత్సరానికి బీసీ సంక్షేమ శాఖ నుంచి 8696 మందికి గాను 6612 స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్​ రిలీజ్​ కాగా, 2084 మందికి రాలేదు. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి 10748 మంది అప్లై చేసుకోగా 7978 మందికి స్కాలర్​ షిప్​ వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఇంటర్​, డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు రిలీజ్​ అయ్యాయనే విషయంలో మాత్రం ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రైవేట్  కాలేజీల మేనేజ్​మెంట్స్​ చెబుతున్నాయి. ఒక్కో కాలేజీకి లక్షల్లో పెండింగ్​ అమౌంట్​ ఉందని మేనేజ్ మెంట్లు చెబుతున్నాయి. ఇదిలాఉంటే తమ భవిష్యత్​ను దృష్టిలో పెట్టుకొని వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. 

ఫీజు కడితేనే సర్టిఫికెట్స్ ఇస్తామంటున్నారు

ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్​ కంప్లీట్ చేశాను. సర్టిఫికెట్స్ కోసం పోతే స్కాలర్ షిప్​ పెండింగ్ ఉందని, ఆ డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని అంటున్నారు. ఫస్ట్ ఇయర్ లో రూ.5 వేలల్లో రూ.3500 స్కాలర్ షిప్  వచ్చింది. సెకండ్ ఇయర్ కు సంబంధించిన రూ.5 వేలు ఇంకా అకౌంట్ లో జమ కాలేదు. రూ.6500 తో పాటు టీసీ కోసం మరో రూ.1500 కడితేనే ఒరిజినల్ లాంగ్ మెమో, టీసీ ఇస్తామని అంటున్నారు. నాన్న ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నాడు. డబ్బులు కట్టే పరిస్థితిలో లేరని బతిమిలాడినా పట్టించుకుంటలేరు. - బి.స్నేహ, తిరుమలాయపాలెం

ఇబ్బంది పెట్టొద్దని చెప్పాం

సర్టిఫికెట్ల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని కాలేజీ యాజమాన్యాలను ఆదేశించాం.రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బ్యాంక్​ పాస్​బుక్, ఏటీఎం కార్డులు  కాలేజీ మేనేజ్​మెంట్లు తీసుకోవద్దు. - రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం