దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె​

దరఖాస్తులు క్లియరైనా నిధులు విడుదల​ చేస్తలె​
  • స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ బకాయిలు 3,200 కోట్లు
  • 13 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులు
  • బకాయిలు రాక స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఆపుతున్న కాలేజీలు 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్‌‌షిప్​లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు చెల్లిస్తలేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు రెండేండ్లుగా మొత్తం రూ. 3,200 కోట్లు పెండింగ్​లో పెట్టింది. వీటి కోసం దాదాపు 13 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. విద్యార్థుల దరఖాస్తులు క్లియర్‌‌ అయినా.. డబ్బులు మాత్రం ప్రభుత్వం శాంక్షన్​ చేస్తలేదు. కొందరికైతే మూడు, నాలుగేండ్ల నుంచి కూడా డబ్బులు వస్తలేవు. ఖజానా ఖాళీ కావడం వల్లే బకాయిలు చెల్లించడం లేదని అధికారులు చెప్తున్నారు. కోర్సులు పూర్తయినా ఫీజులు రాక మేనేజ్‌‌మెంట్లు తమ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, డబ్బులు కడితేనే ఇస్తామని సతాయిస్తున్నాయని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌‌, ఫార్మసీ, బీఈడీ తదితర అన్ని రకాల కోర్సుల నుంచి ఏటా సుమారు 12 లక్షల మంది స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. 
ఇందుకోసం ఏటా రూ. 2,400 కోట్ల దాకా అవసరమవుతాయి. అయితే రెండేండ్లుగా సంక్షేమ శాఖ బకాయిలు చెల్లించడంలేదు. రెండు సంవత్సరాలకు కలిపి రూ. 3,200 కోట్లు ఫీజు రీయింబర్స్​మెంట్​ పైసలు విడుదల కావాల్సి ఉంది. ఇందులో 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంకా రూ. 900 కోట్లు చెల్లించాల్సి ఉంది. 2021–22 సంబంధించి రూ. 2,300 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. 2020–21లో ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఫండ్‌‌ ఉండటంతో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు ఫీజులు చెల్లించాయి. 2021–22లో కేవలం  ఎస్టీ సంక్షేమ శాఖ నుంచి కొంత డబ్బు విడుదలైంది. 
అప్లికేషన్లు క్లియరైనా..
కాలేజీలో చేరాక విద్యార్థులు స్కాలర్‌‌షిప్‌‌, ఫీజురీయింబర్స్‌‌మెంట్‌‌కు అప్లికేషన్‌‌ చేసుకోవాలి. సంక్షేమ శాఖలు వెబ్‌‌సైట్‌‌ ఓపెన్‌‌ చేశాక నిర్ణీత గడువులోగా ఆన్‌‌లైన్‌‌లో వివరాలు, సర్టిఫికెట్లు అప్‌‌లోడ్‌‌ చేయాలి. ఫిజికల్‌‌ కాపీలను మేనేజ్‌‌మెంట్లకు అందించాలి. ఆ తర్వాత సంబంధిత అధికారులు వెరిఫై చేసి ఫైనల్‌‌ చేస్తారు. ఈ అప్లికేషన్ల వెరిఫికేషన్‌‌ ప్రక్రియ సాఫీగా సాగుతున్నది. కానీ, ఫీజుల డబ్బు మాత్రం ప్రభుత్వం నుంచి రిలీజ్​ కావడం లేదు. నిరుడు ఫీజులు చెల్లించేందుకు టోకెన్లు ఇష్యూ చేసినా డబ్బులు మాత్రం స్టూడెంట్స్‌‌ అకౌంట్లలో జమ కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగియడంతో టోకెన్స్‌‌ లాప్స్‌‌ అయిపోయాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. 
ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి
నేను బీటెక్‌‌ ఫైనలియర్‌‌ చదువుతున్న. ఫస్టియర్‌‌లో ఫీజు రీయింబర్స్​మెంట్ వచ్చింది. సెకండియర్‌‌, థర్డ్‌‌, ఫైనలియర్‌‌వి మాత్రం ఇంకా రాలేదు. ఎప్పుడు చూసినా అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. నిరుడు ఫైనల్‌‌ ఇయర్‌‌ కంప్లీట్‌‌ అయిన వాళ్లు ఫీజులు కట్టాల్సిందేనని మేనేజ్​మెంట్లు చెప్పాయి. ఇప్పుడు మాకు భయమైతున్నది. మేం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. - హర్షిత, బీటెక్‌‌, కేయూ
సర్టిఫికెట్లు ఆపుతున్న కాలేజీలు
సాధారణంగా ప్రైవేట్‌‌ కాలేజీలు సర్కారు నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్​మెంట్​పైనే ఆధారపడతాయి. ఫీజులన్నీ క్లియర్‌‌ అయ్యాకే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తాయి. అయితే సర్కారు నుంచి ఫీజు రీయింబర్స్​మెంట్​ డబ్బులు రాకపోవడంతో విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫీజులు చెల్లించాలని, లేకపోతే సర్కారు నుంచి ఫీజు డబ్బులు వచ్చిన తర్వాతే ఇస్తామని తేల్చిచెప్తున్నాయి. కొంత మంది విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు అవి చెల్లించలేక.. చేతిలో సర్టిఫికెట్లు లేక, ఉన్నత  చదువులను ఆపేస్తున్నారు. ఇంకొంత మంది ఉద్యోగాలకు వెళ్దామన్నా సర్టిఫికెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
శాంక్షన్‌‌ చూపిస్తున్నా పైసలిస్తలే
హైదరాబాద్‌‌లోని ఓ ప్రైవేట్‌‌ కాలేజీ లో పీజీ ఆర్గానిక్‌‌ కెమిస్ట్రీ చదువుతున్న. రెండేండ్లుగా ఫీజు రీయింబర్స్‌‌మెంట్స్ రావడంలేదు. 2020–21 సంవత్సరంలో శాంక్షన్‌‌ అని చూపిస్తున్నా పైసలు రిలీజ్‌‌ కాలేదు. కాలేజీ మేనేజ్‌‌మెంట్లు మాత్రం ఫీజులు కట్టాల్సిందేనంటున్నాయి.  ‑ రమేశ్​, స్టూడెంట్

వెంటనే చెల్లించాలి
హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్‌‌ ఇంజనీరింగ్‌‌ కాలేజీలో బీటెక్‌‌ ఫైనలియర్‌‌ చేస్తున్న. ఫస్టియర్‌‌, సెకండియర్​ వరకు ఫీజులు వచ్చాయి. థర్డ్​ ఇయర్​, ఫైనలియర్‌‌ ఫీజులు రావాల్సి ఉంది. కాలేజీ మేనేజ్‌‌మెంట్‌‌ మాత్రం ఆగడంలేదు. ఫీజులు కట్టాల్సిందేనని మాకు స్పష్టం చేస్తున్నది. మా పేరెంట్స్‌‌ ఎట్లనో అట్ల అడ్జెస్ట్‌‌ చేసి కడుతున్నరు. వెంటనే ఫీజులు చెల్లించాలి. ‑ సాయికిరణ్‌‌, స్టూడెంట్​
నిధులు విడుదల చేయాలి
ప్రభుత్వం విద్యపై నిర్లక్ష్యం వహిస్తున్నది. స్కాలర్‌‌షిప్‌‌లు, ఫీజు రీయింబర్స్‌‌మెంట్ చెల్లించకుండా స్టూడెంట్లను ఇబ్బందులు పెడుతోంది. ఫీజులు చెల్లించకపోవడంతో మేనేజ్‌‌మెంట్లు సర్టిఫికెట్లు ఇస్తలేరు. కొంతమంది డబ్బులు లేక మధ్యలోనే స్టడీస్​ బంద్‌‌ చేస్తున్నరు. సర్కార్‌‌ స్పందించి నిధులు విడుదల చేయాలి.  ‑ శ్రీహరి, ఏబీవీపీ, సెంట్రల్ వర్కింగ్‌‌ కమిటీ మెంబర్‌‌