హైదరాబాద్, వెలుగు: మల్టీజోన్ 2 పరిధిలోని లోకల్ బాడీలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు ఎట్టకేలకు ప్రమోషన్ లభించింది. 776 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ మల్టీజోన్ 2 ఆర్జేడీ విజయలక్ష్మి బుధవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సర్వీస్ రూల్స్ ఆధారంగా స్కూల్ అసిస్టెంట్లు ఇచ్చిన వెబ్ ఆప్షన్ ప్రకారం.. సీనియార్టీ ఆధారంగా ప్రమోషన్లు ఇచ్చినట్టు చెప్పారు.
ప్రమోషన్ ఆర్డర్స్ పొందిన వారంతా వెంటనే కేటాయించిన స్కూళ్లలో జాయిన్ కావాలని ఆదేశించారు. ప్రమోషన్లు పొందిన స్కూల్ అసిస్టెంట్లను ప్రస్తుతం పనిచేస్తున్న స్కూళ్ల నుంచి హెచ్ఎం, ఎంఈవోలు రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 109 హెచ్ఎం పోస్టులు భర్తీకాగా, సూర్యాపేటలో 102, వికరాబాద్ లో 94, యాదాద్రిలో 83, నాగర్ కర్నూల్లో 76, సంగారెడ్డిలో 69, జనగామలో 64, వనపర్తిలో 51, నారాయణపేటలో 49, జోగులాంబలో 30, రంగారెడ్డిలో 19, మహబూబ్ నగర్ లో 16, మేడ్చల్ లో ఆరు హెడ్మాస్టర్ పోస్టులు భర్తీ అయ్యాయి.