స్కూల్​ బాత్రూమ్​ గోడ కూలి చిన్నారికి తీవ్రగాయాలు

  • రెండు కాళ్లు విరిగాయని  డాక్టర్ల వెల్లడి
  • అంగన్‌వాడీకి బిల్డింగ్​ లేక ప్రైమరీ స్కూలులో  నిర్వహణ
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

పిట్లం, వెలుగు :  కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం ధన్నూరులో శిథిలావస్థకు చేరిన  స్కూల్ బాత్రూమ్ పిట్టగోడ కూలి బుధవారం అంగన్​వాడీ చిన్నారికి  తీవ్ర గాయాలయ్యాయి. అంగన్​వాడీ కేంద్రానికి  సొంత బిల్డింగ్​లేకపోవడంతో ప్రైమరీ స్కూల్లో  నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు చిన్నారులు బాత్రూమ్​కు వెళ్లారు. వీరిపై పిట్టగోడ కూలడంతో నాలుగేండ్ల బాలుడు దినేశ్​ మట్టిపెల్లల కింద చిక్కుకున్నాడు.  ప్రమాదం నుంచి మిగతా పిల్లలు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. 

స్కూల్ టీచర్లు మట్టిపెల్లల నుంచి దినేశ్ ను బయటకు తీసి  మద్నూర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ్నుంచి నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. బాలుడికి రెండు కాళ్లు విరిగినట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అంగన్ వాడీకి సొంత బిల్డింగ్​ లేకపోవడంతోనే  ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో బాత్రూమ్ శిథిలావస్థకు చేరినా పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని ఐసీడీఎస్ సూపర్ వైజర్ కవిత పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.