కుప్పకూలిన బిల్డింగ్ 22 మంది విద్యార్థులు మృతి..

కుప్పకూలిన బిల్డింగ్ 22 మంది విద్యార్థులు మృతి..

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల స్కూల్ భవనం కూలిపోయింది. క్లాసులు జరుగుతున్న టైంలో  ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్  అండ్  రెస్క్యూ టీమ్ లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 

 బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

ప్రమాదంపై నైజీరియా ప్రభుత్వం స్పందించింది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను వెంటనే గుర్తించి, వాటిని మూసివేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియాలో భవనాలు కూలిపోవడం సర్వసాధారణమైపోయింది. గడచిన గత రెండేళ్లలో ఇటువంటి సంఘటనలు డజనుకు పైగా నమోదయ్యాయి.