మెట్పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఇండ్లకు స్టూడెంట్లను తీసుకెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అలర్ట్కావడంతో స్టూడెంట్లు, టీచర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. వివరాలిలా ఉన్నాయి.. పట్టణ శివారులో ఆరపేట్ లో నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ లో చదువుతున్న 32 మంది స్టూడెంట్లను గురువారం సాయంత్రం వారి వారి గ్రామాలకు తీసుకెళ్తుండగా వట్టివాగు సమీపంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది.
దీంతో బస్సులో ఉన్న స్టూడెంట్లు, టీచర్లు కేకలు వేశారు. మంటలను పసిగట్టిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి స్థానికుల సాయంతో వెంటనే స్టూడెంట్లను కిందికి దింపాడు. మంటలతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. బస్సులోపల ముందు భాగం కాలిపోయింది. తర్వాత వేరే బస్సులో స్టూడెంట్లను వారి గ్రామాలకు తరలించారు. కాగా స్కూల్ మేనేజ్మెంట్ బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యంగా ఉండడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.