- రంగారెడ్డి జిల్లాలోని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్ లో ఘటన
ఇబ్రహీంపట్నం/శంషాబాద్, వెలుగు: ఆరేండ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఫిబ్రవరి 4వ తేదీన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన ఇన్ఫాంట్ జీసెస్ స్కూల్.. తన విద్యార్థులతో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ గ్రామంలో ని సిరి నేచర్ వ్యాలీ రిసార్ట్ కు పిక్నిక్ కు వెళ్లింది.
అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నారు. అదే సమయంలో స్కూల్ బస్సు డ్రైవర్ తుమ్మ జోసెఫ్ రెడ్డి.. ఆరేండ్ల చిన్నారి ఒంటరిగా వాష్రూంకి వెళ్లగా గమనించి, అడ్డగించాడు. మాటవినకుంటే కొడతానని బెదిరించి లోపలికి తీసుకెళ్లి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. బయట చెప్పొద్దని భయపెట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత రోజు ఆ బాలిక వాష్రూంకి వెళ్లడంలో ఇబ్బందిపడడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆరాతీయగా.. జరిగిన విషయాన్ని వారికి చెప్పింది.
దీంతో కుటుంబ సభ్యులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు శంషాబాద్‌లోని ఇన్ఫాంట్ జీసెస్ స్కూల్ కు వెళ్లి నిలదీశారు. డ్రైవర్లందరినీ పోలీసులు వరుసగా నిలబెట్టి చూపించగా.. ఘటనకు పాల్పడ్డ జోసెఫ్‌ను చిన్నారి గుర్తించింది. దీంతో అతడిని ఇబ్రహీంపట్నంలోని మంచాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పొక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విశ్వహిందూ పరిషత్ సభ్యులు శంషాబాద్ లోని స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.
గతంలో కూడా ఎన్నో తప్పులు జరిగినా స్కూల్ యాజమాన్యం సరి చేయడం లేదని, ఇప్పటికైనా ప్రిన్సిపాల్‌ను మార్చేసి ఈ ఘటనకు పాల్పడ్డ డ్రైవర్‌ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు, అనంతరం వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.