ఆసిఫాబాద్ జిల్లాలో రాంగ్​రూట్​లో స్కూల్​ బస్సు డ్రైవర్..విద్యార్థులకు గాయాలు

  • లారీ ఢీకొని విద్యార్థులకు గాయాలు

ఆసిఫాబాద్, వెలుగు : రాంగ్​రూట్​లో వెళ్తున్న స్కూల్ ​బస్సును లారీ ఢీకొన్న ఘటనలో విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రెబ్బెనలోని అన్నపూర్ణ హై స్కూల్​కు చెందిన బస్సు డ్రైవర్​ సుధాకర్​ స్కూల్ ముగిసిన తర్వాత 35 మంది విద్యార్థులతో బయల్దేరాడు.  ఆసిఫాబాద్ వైపునకు వెళ్తూ ఇంద్రనగర్ వద్ద కొందరు విద్యార్థులను దింపాడు.

కానీ  యూటర్న్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా రాంగ్ రూట్​లో వెళ్లడంతో ఎదురుగా వచ్చిన ఓ లారీ బస్సును ఢీ కొట్టింది. దీంతో అందులోని 15 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ సుధాకర్ రెండు కాళ్లు విరగడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు.