- గంజాయి, డ్రగ్స్ కు బానిసలైన హైస్కూల్ బాలికలు
- వాళ్లతో ఓ ముఠా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు అనుమానాలు
- ఓ బాధితురాలి ద్వారా వెలుగులోకి ఘటన
- దాదాపు 10 మంది బాధితులు ఉన్నట్టు గుర్తింపు
- చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు
- రంగంలోకి పోలీసులు.. దర్యాప్తు ప్రారంభం
జగిత్యాల, వెలుగు: పట్టుమని 15 ఏండ్లు కూడా లేని స్కూల్ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. వారిలో బాలికలు కూడా ఉన్నారు. మొదట్లో గంజాయి, ఆ తర్వాత డ్రగ్స్ కు బానిసలయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ ముఠా.. ఆ బాలికలకు గంజాయి ఆశచూపి రేవ్ పార్టీలకు తరలిస్తున్నదని, వాళ్లతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నదని తెలిసింది. ఈ వ్యవహారం జగిత్యాల జిల్లాలో కలకలం రేపుతున్నది. తమ కూతురిపై అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలి కుటుంబం ఇటీవల చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో జగిత్యాల పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
ఎట్ల బయటపడిందంటే..
జగిత్యాల పట్టణంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలిక గంజాయికి బానిసైంది. గంజాయి కొనేందుకు కావాల్సిన డబ్బుల కోసం తన క్లాస్మేట్, గంజాయికే అడిక్ట్అయిన బాలుడిపై ఆధారపడేది. ఈ క్రమంలో 15 ఏండ్లు కూడా నిండని ఆ ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు. కొద్దిరోజులకు ఆ బాలుడు గంజాయి ఇవ్వడం లేదని అతణ్ని వదిలేసిన బాలిక.. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన యువకుడికి దగ్గరైంది. అతడు చెప్పినట్టు చేస్తే ఇచ్చే డబ్బుతో గంజాయి కొనుగోలు చేసేది.
ఈ క్రమంలో బాలికపై అత్యాచారం జరిగిందని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పేరెంట్స్ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు యువకుడిని తీసుకొచ్చి కొట్టి పంపించారు. కానీ ఎలాంటి కేసు పెట్టలేదు. బాలిక డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యిందా? లేదా? అనే విషయం తెలుసుకోవడానికి ఎలాంటి టెస్టులు కూడా చేయలేదు. దీంతో సీపీఐ జిల్లా అధ్యక్షుడు వెన్న సురేశ్ తో కలిసి బాధితురాలి తండ్రి పోయిన నెల 15న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు.
అప్పటి జగిత్యాల సీఐ నటేశ్, కరీంనగర్ సీపీ రిఫరెన్స్ మేరకు బాధితురాలికి ప్రకృతి ఎన్జీవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్నిర్వహించారు. ఆ తర్వాత హోమ్ స్వధార్ కు తరలించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆఫీసర్లు బాధితురాలి నుంచి వివరాలు ఆరా తీయగా.. అదే స్కూల్లో ఆమెలాగే దాదాపు 10 మంది బాలికలు డ్రగ్స్‌కు అడిక్ట్అయినట్లు గుర్తించారు. వారిని ఓ ముఠా రేవ్పార్టీలకు తీసుకెళ్తున్నదని, వాట్సాప్ గ్రూపుల ద్వారా సెక్స్రాకెట్కూడా నడుపుతున్నదని తెలిసి షాక్‌కు గురయ్యారు.
మొదట కార్లలో.. తర్వాత బస్సుల్లో..
జగిత్యాలలోని ఓ హైస్కూల్లో చదువుతున్న పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. గంజాయి కోసం కొంతమందిని సంప్రదించేవారు. ఈ క్రమంలో వాట్సాప్‌గ్రూపులు ఏర్పాటు చేసిన ఓ ముఠా.. కోడ్‌భాషలో గంజాయిని సప్లై చేస్తూ వచ్చింది. గ్రూపులో పది మంది దాకా అమ్మాయిలు ఉండడం, వారు మత్తుకు బానిస కావడంతో హైదరాబాద్‌లో జరిగే రేవ్పార్టీలకు ఆహ్వానించారు. పార్టీకి వచ్చే ప్రతి అమ్మాయికి గంజాయితో పాటు రూ.30 వేలు ఇస్తామని ఆశ చూపారు. బాలికలు అందుకు ఒప్పుకోవడంతో మొదట్లో కార్లు కూడా పంపించారు.
ఆ తర్వాత గంజాయి స్థానంలో డ్రగ్స్అలవాటు చేశారు. క్రమంగా వారితో అర్ధనగ్న నృత్యాలతో పాటు సెక్స్ చేయించేవారని తెలిసింది. నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు కావడం, కూలీనాలీ చేసుకుని బతికే వాళ్ల తల్లిదండ్రులు బాలికల్లో మార్పులను ఆలస్యంగా గ్రహించడంతో ఘటన చాలా రోజులుగా వెలుగులోకి రాలేదు. బాలికలు ఓరోజు రాత్రి పూట చెప్పాపెట్టకుండా వెళ్లిపోయి, రెండ్రోజుల తర్వాత తిరిగిరావడంతో అనుమానం వచ్చి తల్లిదండ్రులు రాత్రిపూట కాపలా కాశారు.
దీంతో దొరికిపోతామని కార్లను పంపించడం బంద్పెట్టిన ముఠా.. ఉదయం బస్సులో హైదరాబాద్‌కు రావాలని, రాత్రి పార్టీ తర్వాత తిరిగి బస్సులోనే వెళ్లిపోవాలని బాలికలకు చెప్పినట్టు తెలిసింది. కాగా, స్కూల్‌కు వెళ్తున్న పిల్లలు ఒకట్రెండు రోజుల దాకా ఇండ్లకు రాకపోవడం, వారి ప్రవర్తలో మార్పు వస్తుండడంతో పలువురు తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. బయటకు తెలిస్తే పరువు పోతుందని మరికొందరు లోలోపలే కుమిలిపోతున్నారు. ఈ విషయంలో తాజాగా పోలీసులు దర్యాప్తు ప్రారంభిచడంతో పాటు త్వరలో నార్కోటిక్స్కంట్రోల్బ్యూరో (ఎన్సీబీ) కూడా రంగంలోకి దిగనున్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్సీబీ రంగంలోకి దిగితే స్టూడెంట్ల బతుకులను ఆగం చేసిన ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు.
నా బిడ్డ ఎప్పుడూ మత్తులో ఉన్నట్టు ఉంటది..
నా బిడ్డ సర్కార్ బడిలో పదో తరగతి చదువుతున్నది. సదువు లో ఫస్ట్ ఉండే. కొన్ని రోజులుగా అదోరకంగా కనిపిస్తాంది. సదువు మీద ధ్యాస పెడుతలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తది. కొద్దిసేపు ఏమీ మాట్లాడదు. కొంచంసేపు హుషారుగా ఉంటది. అప్పుడప్పుడు ఏదో కలవరిస్తూ ఉంటది. మత్తులో ఉన్నట్టు ఉంటది. ఏది సరిగా మాట్లడదు. మేం ఏం మాట్లాడినా బదులియ్యది.
ఒక్కోసారి చెప్పాపెట్టకుండా రెండు మూడ్రోజులు ఎటెల్తదో తెల్వది. పైసలు ఎక్కడి నుంచి వస్తయో తెల్వదు గానీ.. కొత్త బట్టలు కొంటది. స్కూల్‌కు వెళ్లి అడిగితే నా బిడ్డ లాంటోళ్లు అక్కడ సానామంది ఇట్లనే ఉన్నట్టు తెలిసింది. అందరూ ఏదో మత్తు మందుకు బానిసలైన్రట. పోలీస్‌స్టేషన్‌కు పోయి కంప్లయింట్ ఇచ్చిన. చిన్న పిల్లల బతుకులు ఖరాబ్కాకుంట సూడాలె.
మత్తుకు బానిసైన ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ తండ్రి ఆవేదన
ముఠాను పట్టుకోవాలి..
జగిత్యాలలో కొందరు బాలికలు గంజాయికి బానిసలు కావడంతో వారిపై లైంగిక దాడులు జరుగుతున్నాయని వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆ బాలికలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా, నిందితులపై పోక్సో కేసు పెట్టకుండా బాధితులను పునరావాస శిబిరాలకు పంపి చేతులు దులుపుకున్నారు. ఇది సరికాదు. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, డ్రగ్స్ముఠాను పట్టుకోవాలి. లేదంటే మరింత మంది పిల్లల భవిష్యత్నాశనమయ్యే ప్రమాదముంది.
-వెన్న సురేశ్, సీపీఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు