జడ్చర్ల, వెలుగు : సరిగా చదవడం లేదంటూ ఒకటో తరగతి స్టూడెంట్‌ను ఓ స్కూల్ కరస్పాండెంట్ చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, అరుణ దంపతుల కూతురు జస్విత (5) అదే గ్రామంలోని నవోదయ కాన్వెంట్ స్కూల్‌లో ఫస్ట్ క్లాస్ చదువుతోంది. బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన జస్వితను సరిగా చదవడం లేదంటూ కరస్పాండెంట్ రాందాస్ కర్రతో చితకబాదాడు. దీంతో బాలిక వీపుపై గాయాలు అయ్యాయి.
అనంతరం జస్వితను ఇంటికి పంపించి వేశారు. బాలిక వీపుపై గాయాలు చూసిన తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి రాందాస్‌ను నిలదీశారు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, ఎదురుదాడికి దిగడంతో జడ్చర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సమాచారం అందుకున్న డీఈవో రవీందర్, ఎంఈవో మంజూలదేవి స్కూల్‌కు చేరుకొని విచారణ జరిపారు. ఘటనకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.