
కాగజ్ నగర్, వెలుగు : అసలే కొండమీద ఉన్న ఆదివాసీగూడెం అది. చుట్టూ దట్టమైన అడవి. కరెంటు అంతంతే.. ఇక ఊరంతా కలిపి 150 మంది జనాభా. అందులో పూర్తిగా ఉన్నదంతా ఆదివాసీ గిరిజనులే. వారికి సరైన రోడ్డు లేదు. రవాణా వ్యవస్థ అన్ని కాలాల్లో ఎడ్ల కచ్చులో మాత్రమే. ఎండాకాలం, చలికాలం అతికష్టం మీద మోటార్ సైకిల్ తో వెళ్లొచ్చు. అది కూడా సాహసమే . ఇక ఇక్కడున్న పిల్లలకు విద్య నేర్పేందుకు సర్కారు బడి ఏర్పాటు చేశారు. పర్మనెంట్ బిల్డింగ్ కట్టకపోవడంతో కేవలం చుట్టూ తడకలు, కర్రలతో పెట్టిన దడి, పైన రేకులతో ఉండేది. గట్టి వాన పడితే చదువులు సాగని పరిస్థితి. ఇదంతా ఇప్పుడు గతం. అసెంబ్లీ ఎన్నికల పుణ్యమా అని విద్యార్థుల చదువుల కోసం పక్కా బడి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ ప్రతిఒక్కరికీ ఓటు హక్కును వినియోగించునేలా చొరవ చూపడంతో పిల్లలకు నిజమైన ఆనందం కలిగింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని మాలిని గ్రామ పంచాయితీ మానిక్ పటార్ గ్రామంలో 79 మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అయితే, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పోలింగ్ బూత్ గా మారగా అదికాస్తా తడకలతో ఉండడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే, సిర్పూరు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రత్యేక చొరవ తీసుకుని మానిక్ పటార్ లో కొత్తగా పోలింగ్ బూత్ కోసం పక్కా భవన నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఎన్నికల వేళ నెల రోజుల్లో రేకుల బడి రెడీ అయింది. పోలింగ్ అయిన తర్వాత ఇది స్కూల్ గా మారింది. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చూసిన గ్రామస్తులు ఎన్నికలు తెచ్చిన సర్కారు బడి షెడ్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ కు స్టూడెంట్లు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.