బడి లైబ్రరీలు బలపడాలి: రవి కుమార్ చేగొనీ

యూఎస్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల్లో ప్రతి బడిలో కచ్చితంగా అత్యాధునిక లైబ్రరీ ఉంటుంది. మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా ఈ పాఠశాల గ్రంథాలయాలు సేవలు అందిస్తున్నాయి. మన దేశంలో కూడా స్కూల్​లైబ్రరీలను బలోపేతం చేయడం చాలా అవసరం. మొన్నటి కేంద్ర బడ్జెట్ ను బట్టి చూస్తే.. ఆ తరహా ప్రయత్నం మొదలైనట్లు కనిపించింది. 

కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్​లో విద్యకు రూ.1,12,899 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ అంచనా కంటే రూ. 8,621 కోట్లు ఎక్కువ. ఇందులో ఉన్నత విద్యకు ఈసారి కిందటి ఏడాది కంటే నిధుల కేటాయింపు పెరిగింది. ఐఐటీ ఖరగ్​పూర్ సారథ్యంలో విజయవంతంగా నడుపుతున్న నేషనల్ డిజిటల్ లైబ్రరీలో దాదాపు 9 కోట్ల రీసోర్సెస్(పుస్తకాలు, ఆర్టికల్స్, ఆడియో, వీడియోలు సిములేషన్స్, పరిశోధన పత్రాలు, పరిశోధన గ్రంథాలు తదితరాలు) అందుబాటులో ఉన్నాయి. ఈ రిసోర్సెస్ కేజీ నుంచి పీజీ వరకు ఆపై తరగతుల వారికి అందుబాటులో ఉన్నాయి. ఈసారి కేంద్ర బడ్జెట్ లో చిన్న పిల్లలకు సంబంధించిన నాణ్యమైన సమాచారాన్ని
(పుస్తకాలు, ఆడియో, విజువల్, బొమ్మల పుస్తకాలు) నేషనల్ డిజిటల్ లైబ్రరీలో పొందుపరిచేందుకు కృషి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో విద్యార్థులకు జాగ్రఫి, భాషలు, శైలి సహా వివిధ స్థాయిల్లో నాణ్యమైన విషయ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి. జాతీయ విద్యా మిషన్‌‌కు కేంద్రం రూ.38,953 కోట్లు కేటాయించింది. నూతన విద్యావిధానం(ఎన్‌‌ఈపీ)–2020 అమలును ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉత్తమ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు రూ.4,235.74 కోట్లు కేటాయించింది. వాటిలో అత్యాధునిక ప్రయోగశాలలు, డిజిటల్ రిసోర్సెస్, డిజిటల్ గ్రంథాలయాలు, వాటిని ఉపయోగించుకునేందుకు కావాల్సిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం కూడా నిధులు ప్రతిపాదించింది.

భౌతిక గ్రంథాలయాలు

అన్ని రాష్ట్రాల్లో ఉన్న గ్రామపంచాయతీల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పుస్తకాల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్‌‌, చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును ప్రోత్సహించనున్నట్లు చెప్పింది. ఇది మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాల లైబ్రరీలు నేషనల్ డిజిటల్ లైబ్రరీ పుస్తకాలను వాడుకునేలా అవసరమైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపింది. గ్రంథాలయాల ఏర్పాటులో ఎన్జీవోల సహకారం తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది. ఇప్పటికే బిలిందా గేట్స్ ఫౌండేషన్, సుధా మూర్తి ఫౌండేషన్, ఫుడ్ ఫర్ థాట్, రూరల్ లైబ్రరీ ఫౌండేషన్, రూమ్ టు రీడ్ వంటి అనేక సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాలకు సేవలందిస్తున్నాయి. వీటితోపాటు ఇంకా అనేక ఎన్జీవోల సహకారంతో గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కరోనా కాలంలో దాదాపు రెండేండ్లపాటు విద్యా వ్యవస్థలో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రామీణ, పట్టణ యువత, విద్యార్థుల్లో రీడింగ్ కల్చర్ ను పెంపొందించేందుకు నేషనల్ బుక్ ట్రస్ట్ ,చిల్డ్రన్ బుక్స్ ట్రస్ట్ ల సేవలను వాడుకోవాలని సూచించింది. 47 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణకు తాజా బడ్జెట్‌‌లో ‘యూత్‌‌ పవర్‌‌’ పేరుతో వారికి ప్రాధాన్యం కల్పించారు. యువత సాధికారత, ఉద్యోగాల సృష్టికి లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రధానమంత్రి కౌశల్‌‌ వికాస్‌‌ యోజన-4.0ను అమలు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లు ఇచ్చే శిక్షణలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. యువత అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్‌‌ ఇండియా ఇంటర్నేషనల్‌‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వాటిలో ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు, గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని కేంద్రం పేర్కొంది. 

మౌలిక వసతుల కల్పన కీలకం

కేంద్ర ప్రభుత్వం డిజిటల్ గ్రంథాలయాల రూపకల్పనకు చర్యలు తీసుకోవడం ఆహ్వానించదగినదే. కానీ గ్రామీణ ప్రాంతాల్లో బడుల్లో మౌలిక వసతుల కల్పన చాలా కీలకం. కనీసం కరెంట్, కంప్యూటర్​, ఫర్నీచర్​లేని పాఠశాలల్లో డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు కత్తిమీద సాములాంటిదే. అక్కడ పారదర్శకమైన విధానంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి జరగాలి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు డిజిటల్ రిసోర్సెస్ నీ, డిజిటల్ గ్రంథాలయాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే అంశాలపై తర్ఫీదు అవసరం. ఇదీగాక ప్రభుత్వాలు బడ్జెట్​లో ప్రతిపాదించినట్లు క్షేత్రస్థాయిలో జరగాలి. ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రంథాలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తామని అనేక సార్లు చెప్పినా, ఆ స్థాయిలో అమలు జరగలేదు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్​ లైబ్రరీలకు, గ్రామీణ యువత రీడింగ్ ​కల్చర్ ను అలవాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లే.. రాష్ట్ర సర్కారూ ఆ దిశగా ప్రయత్నాలు సాగించాల్సిన అవసరం ఉంది.​

రాష్ట్ర స్థాయిలోనూ కృషి అవసరం

తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు – మనబడి’ పథకంలో భాగంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగా తొలుత రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు నెలకొల్పి ఒక్కో లైబ్రరీకి150 పుస్తకాలు నేషనల్ బుక్ ట్రస్ట్ సాయంతో అందించేందుకు ప్రయత్నం చేస్తున్నది. భవిష్యత్తులో అన్ని జిల్లాలకు విస్తరింప చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇక మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే  గ్రామపంచాయతీల్లో 4,000కు పైచిలుకు  డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో దాదాపు 20 శాతం గ్రంథాలయ భవనాలు నిర్మాణం కూడా పూర్తి కావొస్తున్నది దశల వారీగా డిజిటల్ గ్రంథాలయాల నిర్మాణానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. ఢిల్లీ రాష్ట్రంలో పాఠశాల గ్రంథాలయాలు విద్యార్థులకు చక్కటి సేవలు అందిస్తున్నాయి. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పాఠశాల లైబ్రరీలు బాగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రతి బడిలో గ్రంథాలయాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలనే నియమం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాలూ అదే స్ఫూర్తితో పనిచేయాలి. 
- డా. రవి కుమార్ చేగొనీ,
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం