దేశాభివృద్ధిలో ‘సోల్’ కీలకం

దేశాభివృద్ధిలో ‘సోల్’ కీలకం
  • స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌‌షిప్ (సోల్) తొలి సదస్సులో మోదీ 
  • వికసిత్ భారత్ లక్ష్యానికి ఇదే ముందడుగు 
  • గొప్ప లక్ష్యాలు సాధించాలంటే సోల్ ఎంతో అవసరమన్న పీఎం 

న్యూఢిల్లీ:  ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి రంగంలో నాయకుల అభివృద్ధి ఎంతో కీలకమని తెలిపారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన సోల్ (స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌‌షిప్) సదస్సు తొలి ఎడిషన్‌‌ను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోల్ నుంచి గొప్ప నాయకులు పుడతారని తెలిపారు. 

వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సోల్ ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. అభివృద్ధి వైపు వేస్తున్న ప్రతి అడుగులో సంస్థ పాత్ర ఉంటుందన్నారు. గిఫ్ట్ సిటీకి దగ్గరలో సోల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్కి టెక్చర్​లోనూ ఈ సంస్థ విశేష సేవలు అందిస్తుందని తెలిపారు. వంద మంది యువతను ఇస్తే.. దేశాన్ని మారుస్తానన్న స్వామి వివేకానంద కామెంట్లను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. 

దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. బానిసత్వ సంకెళ్ల నుంచి ఇండియాను విముక్తి చేసేందుకు స్వామి వివేకానంద ఎంతో కృషి చేశారని కొనియాడారు. గొప్ప లక్ష్యాలు సాధించాలంటే సోల్ లాంటి సంస్థ ఎంతో అవసరమని చెప్పారు. ఇండియా ప్రతి రంగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రపంచ స్థాయి నాయకుల అవసరం ఎంతో ఉందని తెలిపారు.

మోదీ నాకు పెద్దన్నలాంటి వారు: భూటాన్ ప్రధాని  

ప్రధాని మోదీ తనకు పెద్దన్న వంటి వారని భూటాన్‌‌ ప్రధాని షెరింగ్ తోబ్గే అన్నారు.  కాన్‌‌క్లేవ్‌‌లో   ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన కొత్తలో నాకు నాయకత్వం గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఇండియా పర్యటనకు ఓ స్టూడెంట్​గా వచ్చాను. ప్రపంచంలోనే గొప్ప నేతగా పేరొందిన  నరేంద్ర మోదీ  నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకొనే అవకాశం నాకు దక్కడం సంతోషంగా ఉంది’’ అని భూటాన్‌‌ ప్రధాని షెరింగ్ తోబ్గే అన్నారు.