![పాలమూరు ఎంపీగా ఉన్నపుడు హామీ ఇచ్చి ఇంకా నెరవేర్చని కేసీఆర్](https://static.v6velugu.com/uploads/2022/12/School-sweepers-cannot-be-made-permanent_Bm92zUjKtf.jpg)
- స్కూల్ స్వీపర్లను పర్మనెంట్ చేస్తలేరు
- పాలమూరు ఎంపీగా ఉన్నపుడు హామీ ఇచ్చిన కేసీఆర్
డ్యూటీలో చేరి 25 ఏండ్లు కావస్తున్నా స్కూల్ స్వీపర్ల సమస్యలను రాష్ట్ర సర్కారు పరిష్కరించడం లేదు. సర్వీస్పూర్తయి రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నా, ఇప్పటికీ వారిని పర్మనెంట్ఉద్యోగులుగా గుర్తించడం లేదు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమాలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు. చివరకు సీఎం కేసీఆర్‌ను కలిసి గోస చెప్పుకుందామంటే ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేసి వారి గొంతులు నొక్కేశారు.
మహబూబ్‌నగర్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వాలు 1984, 1993, 1997లో సర్కారు బడుల్లో స్కూల్ స్వీపర్లను నియమించాయి. తెలంగాణ వ్యాప్తంగా 5,600 మందిని డ్యూటీల్లోకి తీసుకున్నారు. వీరికి అప్పటి ఎంపీడీవోలు, డీఈవోలు, ఎంపీపీలు జాయినింగ్ఆర్డర్లు ఇచ్చారు. అలా మహబూబ్‌నగర్ జిల్లాలో 217 మంది, నారాయణపేటలో 210, నాగర్‌కర్నూల్‌లో 273, వనపర్తిలో 207, జోగులాంబ గద్వాలలో 67, రంగారెడ్డిలో 211, వికారాబాద్‌లో 76 మంది స్కూళ్లలో స్వీపర్లుగా పని చేస్తున్నారు. 1997 తర్వాత మళ్లీ స్కూల్ స్వీపర్ల నియామకాలు చేపట్టలేదు. అప్పట్లో డ్యూటీల్లో చేరిన వారికి నెలకు రూ.75 చొప్పున జీతాలు ఇచ్చారు. ప్రతి ఏటా కొంత పెంచుకుంటూ రాగా, 2014 నాటికి స్వీపర్లు రూ.1,662 జీతం అందుకున్నారు. కేసీఆర్ ఎంపీగా ఉన్నపుడు 2009లో పాలమూరు పర్యటనలో స్కూల్ స్వీపర్లను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటవడం, గతంలో కేసీఆర్ హామీ ఇచ్చి ఉండడంతో వీరి పరిస్థితి చక్కబడుతుందని అందరూ భావించగా.. మరింత అధ్వానంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం తమను ఫుల్‌టైం వర్కర్లుగా గుర్తించి, జీతాలు పెంచాలని 2015 నుంచి డిమాండ్ చేస్తున్నా ఇంతవరకు అతీగతి లేదు.
జాయినింగ్ ఆర్డర్లు చెల్లవని..
1985 నుంచి 1997 వరకు డ్యూటీల్లో చేరినవారికి ఎంపీడీవోలు, ఎంపీపీలు, డీఈవోలు ఎక్కడికక్కడ జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఆర్డర్లలో కేవలం ఎంపీడీవోలు ఇచ్చిన ఆర్డర్లే చెల్లుతాయని 2015లో తెలంగాణ ప్రభుత్వం జీవో 180 తీసుకొచ్చింది. దాని ప్రకారం 1984 నుంచి 1993 వరకు జాయిన్ అయిన రెండు వేలలోపు మందికి మాత్రమే రూ.4 వేల జీతాలు ఇస్తామని ప్రకటించింది. వారిలో కూడా కొందరి జాయినింగ్ఆర్డర్లు సక్కగ లేవని కొర్రీలు పెట్టింది. 1994 నుంచి 1997 వరకు చేరినవారి జాయినింగ్ఆర్డర్లు చెల్లవని వారికి ఇప్పటికీ రూ.1,662 మాత్రమే చెల్లిస్తోంది.
పార్ట్‌టైం వర్కర్లుగా కూడా గుర్తిస్తలే..
ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు డ్యూటీలు చేస్తున్నా స్కూల్ స్వీపర్లను రాష్ట్ర ప్రభుత్వం పార్ట్‌టైం వర్కర్లుగా కూడా గుర్తించడం లేదు. పార్ట్‌టైం వర్కర్లకు వర్తించే జీవో 64 ప్రకారం కూడా జీతాలు చెల్లించడం లేదు. ఈ జీవో ప్రకారం ఇతర డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తున్న కార్మికులకు రూ.11,220 జీతం చెల్లిస్తుండగా స్కూల్ స్వీపర్లకు మాత్రం ఈ జీవోను వర్తింపజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో 5,600 మంది స్వీపర్లు ఉండగా ఇప్పటి వరకు 2,400 మందిని సర్కారు డ్యూటీల నుంచి తొలగించింది. ఇందులో ఎక్కువ మంది 60 ఏండ్లు పైబడినవారు ఉండటంతో వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్వర్తింపజేయాల్సి ఉంది. కానీ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 320 మందిని తొలగించగా, వీరికి కనీసం పింఛన్‌కూడా ఇవ్వడం లేదు. డ్యూటీల నుంచి ఎందుకు తొలగించారని విద్యాశాఖ కమిషనర్‌ను ప్రశ్నిస్తే, జీవో 45 ప్రకారం తొలగించినట్లు సమాధానం ఇచ్చారని స్వీపర్లు చెబుతున్నారు. ఈ జీవో ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ఇయ్యాల్సి ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం తొలగించిన స్కూల్ స్వీపర్లందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇవ్వాలని స్కూల్ స్వీపర్ల సంఘం లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమాలు చేస్తున్నా ఫలితం శూన్యం
జీతాలు పెంచాలని, డ్యూటీల నుంచి తొలగించిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని 2015 నుంచి స్కూల్ స్వీపర్లు దశలవారీగా ఉద్యమం చేస్తున్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, శ్రీనివాస్‌గౌడ్‌లను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రెండువారాల కిందట ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన స్వీపర్లు పాలమూరు జడ్పీ ఎదుట రెండు రోజులపాటు నిరసన వ్యక్తం చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇటీవల పాలమూరుకు వచ్చిన సీఎంను కలిసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న స్వీపర్లు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రెండు రోజుల ముందు వారిని అదుపులోకి తీసుకొని, వారి సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.
మేం సీఎంను కలవొద్దా?
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 5,600 మంది స్వీపర్లు ఉండేవారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సగం మందిని తొలగించారు. ఇప్పుడు 3,200 మందే మిగిలారు. మా సమస్యలు సీఎంకు చెప్పుకుందామని అనుకున్నాం. కానీ ముందస్తుగా మమ్మల్ని అరెస్టు చేశారు. మా సమస్యలు చెప్పుకోవడానికి మేం సీఎంను కలవొద్దా? ప్రజల కోసం సీఎం వచ్చినప్పుడు.. ఈ అరెస్టులు చేసుడెందుకు? అదేదో పార్టీ మీటింగ్పెట్టుకుంటే అయిపాయే కదా? తెలంగాణలో పేదోళ్ల పిల్లలు చదువుకోవద్దనేదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్లు ఎక్కువగా ఇచ్చి, సర్కారు బడులను గాలికి వదిలేస్తోంది.
– గట్టన్న, స్కూల్ స్వీపర్ల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు, మహబూబ్‌నగర్