రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో చదివే స్టూడెంట్లకు యూనిఫాం ఇవ్వడంతో పాటు, సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్టూడెంట్లకు కావాల్సిన యూనిఫాం క్లాత్ తయారీకి సంబంధించిన ఆర్డర్‌ను సిరిసిల్ల నేతకార్మికులకు అప్పగించింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా గతేడాది రెండు నెలలు ఆలస్యంగా ఆర్డర్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం వచ్చే ఏడాది పిల్లలకు అందజేసే యూనిఫాం కోసం నవంబర్‌లోనే ఆర్డర్ ఇచ్చారు.
66 లక్షల మీటర్ల క్లాత్, రూ. 36.91కోట్లు
రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్లకు యూనిఫామ్స్ అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ స్కూళ్లలో ఉన్న పిల్లల కోసం సూటింగ్, షర్టింగ్, స్కర్ట్ కోసం మొత్తం 66 లక్షల మీటర్ల క్లాత్ అవసరం అని గుర్తించారు. ఈ మొత్తం క్లాత్ తయారీ ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు అప్పగించారు. ఈ క్లాత్ తయారీకి మొత్తం రూ. 36.91 కోట్లు అవసరం కానున్నాయి. సూటింగ్ కోసం 33 లక్షల 10 వేల మీటర్ల క్లాత్‌కు రూ. 23.45 కోట్లు, షర్టింగ్ కోసం 32 లక్షల 2 వేల మీటర్ల క్లాత్ కోసం రూ. 13.23 కోట్లు, స్కర్ట్‌కు సంబంధించి 55 వేల మీటర్ల క్లాత్ కోసం రూ. 23.48 లక్షలు అవసరం కానున్నాయి.
కార్మికులకు రెండు నెలల పాటు ఉపాధి
ఆర్వీఎం క్లాత్ ఆర్డర్ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు రెండు నెలల పాటు పని దొరకనుంది. దీంతో సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమకు కొంత మేరకు ఊరట లబించనుంది. పవర్‌లూం కార్మికులకు నెలకు రూ. 15 వేల వరకు అందే అవకాశం ఉంది. ఈ క్లాత్ ఉత్పత్తి పూర్తి కాగానే మహిళా సంఘాలకు ఇవ్వబోయే చీరల ఆర్డర్‌ను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులకు ఏడాదంతా పని దొరకనుంది.
నేతన్నలకు ఉపాధి
ప్రతి సంవత్సరం ఆర్వీఎం క్లాత్ ఆర్డర్‌ను నవంబర్‌లోనే ఇస్తుంటాం. వచ్చే ఏడాదికి సంబంధించిన క్లాత్ ఆర్డర్‌ను సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అప్పగించింది. దీని ద్వారా కార్మికులకు రెండు నెలల పాటు ఉపాధి దొరకనుంది.
- సాగర్, చేనేత జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల