- 55 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చిన ప్రభుత్వం
- బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చేందుకూ కార్యాచరణ
- నేతన్నలకు 365 రోజులు పని కల్పిస్తాం: మంత్రి పొన్నం
రాజన్నసిరిసిల్ల, వెలుగు: వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో తీవ్ర కష్టాల్లో ఉన్న సిరిసిల్ల నేతన్నలకు కొత్త సర్కారు నుంచి కొండంత ఊరట లభించింది. ఎప్పట్లాగే సమగ్ర శిక్ష కింద విద్యార్థుల యూనిఫాం క్లాత్తయారీ ఆర్డర్ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా 55 లక్షల మీటర్ల సూటింగ్, షర్టింగ్బట్టను తయారు చేసి అందించాల్సి ఉంటుంది. మరోవైపు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చేందుకూ చేనేత ఔళిశాఖ రెడీ అవుతోంది. సిరిసిల్ల నేత కార్మికులను తాము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని, 365 రోజులు పని కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ప్రకటించడంపై నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలలు పని..
కొత్త ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం తయారీ ఆర్డర్లతో సిరిసిల్ల కార్మికులకు రెండు నెలలపాటు ఉపాధి దొరుకుతుంది. 20 లక్షల మీటర్ల సూటింగ్, 35 లక్షల మీటర్ల షర్టింగ్ క్లాత్.. మొత్తంగా 55లక్షల మీటర్ల క్లాత్ ను ఉత్పత్తి చేసే పనిలో నేత కార్మికులు నిమగ్నమయ్యారు. 126 ఎస్ఎస్ఐ యూనిట్స్, 140 మ్యాక్స్ సంఘాల ఆధ్యర్యంలో ఈ క్లాత్ఉత్పత్తి జరుగుతోంది.
బతుకమ్మ చీరల ఆర్డర్లు కూడా..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల నేతకార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి, ఆడపడుచులకు అందజేస్తూ వచ్చింది. తద్వారా కార్మికులకు ఏడాదంతా ఉపాధి దొరికింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్న దృష్ట్యా కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ సర్కారు కూడా బతుకమ్మ చీరల ఆర్డర్ఇవ్వాలని భావిస్తోంది. సీఎం సూచనల మేరకు ఇప్పటికే చేనేత, ఔళిశాఖ ఆఫీసర్లు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిసింది. అంతా ఒకే అయితే ఈ నెలలోనే ఆర్డర్ ఇచ్చే అవకాశముంది. గతేడాది ఫిబ్రవరి15న 5.56 కోట్ల మీటర్ల క్లాత్ కు ఆర్డర్వచ్చింది. సెప్టెంబర్ 15 కల్లా కోటి చీరలు 25 కలర్స్, 25 డిజైన్లలో అందించగలిగారు. వీటికి సంబంధించిన పాత బకాయిలు చెల్లించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని నేతన్నలు కోరుతున్నారు.
నేతన్నలు దిగులు చెందొద్దు
సిరిసిల్ల నేతన్నలు ఎట్టి పరిస్థితుల్లో దిగులు చెందొద్దు. యూనిఫాం ఆర్డర్లతోపాటు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాం. 365 రోజులు కార్మికులకు పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. నాసి రకం చీరలు కాకుండా పాలిస్టర్, కాటన్ మిక్స్క్వాలిటీతో ఉండే చీరలు ఇవ్వాలని భావిస్తున్నాం.
– మంత్రి పొన్నం ప్రభాకర్
రానున్న రోజుల్లో మరిన్ని ఆర్డర్లు
సమగ్ర శిక్ష కింద స్టూడెంట్ల యూనిఫామ్స్కోసం ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులకు 55లక్షల మీటర్ల కాత్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ల ద్వారా రెండు నెలలపాటు ఉపాధి దొరుకుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి మరిన్ని ఆర్డర్లు అందనున్నాయి.
– సాగర్, ఏడీ, చేనేత జౌళిశాఖ