జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్​ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్​రావు

సూర్యాపేట, వెలుగు : జూన్ 5వ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్​రావు అధికారులను ఆదేశించారు. శనివారం సూర్యాపేట గోపాలపురం కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా స్వశక్తి కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఎస్‌‌హెచ్‌‌జీ మహిళల ద్వారా స్కూల్ యూనిఫామ్స్ కుట్టించి ప్రభుత్వ పాఠశాలలకు సప్లై చేయనున్నట్లు తెలిపారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో స్వయంశక్తి గ్రూపుల ద్వారా యూనిఫామ్స్​ కుట్టించాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. జిల్లాలోని 53,234 మంది విద్యార్థులకు జూన్ 12 నాటికి రెండు జతలు యూనిఫామ్స్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీవో మధుసూదన్ రాజు,  అడిషనల్ డీఆర్డీవో సురేశ్, డీపీఎం ఆంజనేయులు, ఏపీఎం వెంకయ్య, సీసీలు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధ్య వేలుకు సిరా చుక్క.. 

లోక్ సభ ఎన్నికల్లో ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుపై ఇంక్ పెట్టగా, ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటర్ల మధ్య వేలుకు సిరా గుర్తు పెట్టనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్​రావు తెలిపారు. ప్రిసైడింగ్​ అధికారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓటరు ఎడమ చూపుడు వేలుని పరిశీలించి ఇంకు పెట్టాలని కలెక్టర్ 
సూచించారు. 

జూన్​12 వరకు యూనిఫామ్​సిద్ధం 

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 12 వరకు స్కూల్ యూనిఫామ్స్​సిద్ధం చేయాలని కలెక్టర్​హనుమంత్ జెండగే అధికారులను ఆదేశించారు. శనివారం యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ మండల పరిషత్, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, తరగతుల మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ కుడుతున్న మహాలక్ష్మి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 673 ప్రభుత్వ, ఎయిడెడ్, కస్తూర్బా, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు 51,848 మంది విద్యార్థులకు యూనిఫామ్స్​కోసం అన్ని మండల కేంద్రాలకు క్లాత్ పంపించామని చెప్పారు. ఆయన వెంట డీఆర్డీవో ఎంఏ.కృష్ణన్, డీఈవో కే నారాయణరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు వైష్ణవి, సంధ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మహిళా సమాఖ్య సభ్యులు ఉన్నారు.