9, 10 తోపాటు ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్‌కే క్లాసులు
ఆరు పేపర్లతోనే టెన్త్ ఎగ్జామ్స్ సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు
అవసరమైతే సిలబస్ కుదింపు
ఒకటి నుంచి 8వ తరగతులకు క్లాసులు, ఎగ్జామ్స్‌పై అస్పష్టత
హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్‌తో పది నెలలుగా మూసిఉన్న స్కూళ్లు, కాలేజీలను తిరిగి ఓపెన్ చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పండుగ తర్వాత విద్యా సంస్థలన్నింటినీ తెరవాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ ఎగ్జామ్స్నిర్వహించాలని నిర్ణయించింది. ముందుగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి, స్టూడెంట్స్‌ను ఎగ్జామ్స్‌కు రెడీ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రపోజల్స్ సీఎం కేసీఆర్ వద్దకు చేరాయి. మరోవైపు విద్యా సంస్థలను ఓపెన్ చేస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు క్లాసులను మొదలుపెట్టనున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్టూడెంట్లకు క్లాసులు, ఎగ్జామ్స్ పై మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
ఆన్లైన్ క్లాసులతో ఇబ్బందులు
కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో మార్చి 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇప్పటిదాకా ఫిజికల్ క్లాసులు స్టార్ట్ కాలేదు. అకడమిక్ ఇయర్ నష్టపోవద్దనే ఆలోచనతో సెప్టెంబర్ నుంచి డిజిటల్, ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రోజూ 85 శాతం వరకు స్టూడెంట్లు ఆన్లైన్ క్లాసులు వింటున్నారని అంటున్నా.. నిజానికి ఇది 40శాతం మించడం లేదని అధికారులే చెప్తున్నారు. మొదట బతుకమ్మ, దసరా తర్వాత స్కూళ్లు, కాలేజీలు ప్రారంభించాలని సర్కారు భావించింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గింది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్టార్ట్ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదించినా.. సీఎం కేసీఆర్ ఒకే చెప్పకపోవడంతో వాయిదా పడ్డాయి.
సర్కారుపై ఒత్తిడితో..
పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను ఓపెన్ చేయడంతో.. రాష్ట్రంలో పేరెంట్స్, టీచర్ల నుంచి సర్కారుపై ఒత్తిడి మొదలైంది. ఏపీలో కూడా హైయ్యర్ క్లాసులకు టీచింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే ‘ఈ ఏడాది బడి బందేనా?’ శీర్షికతో ఈ నెల 10న ‘వెలుగు’లో కథనం ప్రచురితమైంది. సీఎం కేసీఆర్విద్యా సంస్థలు తెరవడంపై రివ్యూ కూడా చేయడం లేదన్న అంశాన్ని ఎత్తిచూపింది. దీంతో స్పందించిన సర్కారు.. ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని విద్యా శాఖను ఆదేశించింది. ఈ మేరకు అధికారులు వివరాలు సేకరించారు. ఏపీ, అస్సాం, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, కేరళ రాష్ట్రాల్లో ఫిజికల్ క్లాసులు మొదలుపెట్టినట్టు గుర్తించారు. అయితే వీటిలో పెద్దరాష్ట్రాలు లేకపోవడం, మధ్యలోమధ్యలో ఆపేస్తూ క్లాసులు కొనసాగిస్తుండటాన్ని అధికారులు సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలు మొదలుపెడ్తామని ముందుగా డేట్లు ప్రకటించినా.. తర్వాత వెనక్కి తగ్గాయి. త్వరలో మొదలుపెట్టేందుకు మరికొన్ని రాష్ట్రాలు రెడీ అయ్యాయి. వీటన్నింటినీ పరిశీలించిన రాష్ట్ర సర్కారు.. వచ్చే నెలలో విద్యాసంస్థలను ప్రారంభించాలని ఆలోచనకు వచ్చింది.
సంక్రాంతి తర్వాతే ఎందుకు?
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనల ప్రకారం.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ భయం, చలితీవ్రతతో సర్కారు వెనక్కి తగ్గింది. జనవరి ఫస్ట్ వీక్‌లో ప్రారంభించాలని అనుకున్నా.. చలితీవ్రత తగ్గిన తర్వాతే బడులు ఓపెన్ చేస్తే బెటర్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో సంక్రాంతి తర్వాత చలి తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో.. అప్పటి నుంచి క్లాసులు ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా.. రాష్ట్రంలో ప్రతిరోజూ క్లాసులు ఉండేలా షెడ్యూల్ రెడీ చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. అవసరమైతే సెలవురోజుల్లోనూ క్లాసులు తీసుకుని.. ఏప్రిల్చివరికల్లా సిలబస్ పూర్తి చేయాలని అధికారులు ఆలోచనలో ఉన్నారు. ఏప్రిల్ నెలాఖర్లో లేదా మే ఫస్ట్ వీక్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. మరోవైపు హాస్టళ్లనూ ఓపెన్ చేయనున్నారు.
టెన్త్ ఎగ్జామ్స్ ఆరు పేపర్లకు కుదింపు
రాష్ట్రంలో ప్రస్తుతం టెన్త్‌లో 11 పేపర్ల పరీక్షా విధానం కొనసాగుతోంది. హిందీ మినహా మిగతా సబ్జెక్టులకు రెండేసి పేపర్లు ఉన్నాయి. స్కూళ్లు నడవని పరిస్థితుల్లో.. ఎగ్జామ్ పేపర్లను ఆరుకు తగ్గించాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతిలోనూ ఆరు పేపర్లనే పెట్టాలని భావిస్తోంది. ఇక డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో ఈ ఏడాది ఒక సెమిస్టర్ ఎత్తివేస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అవసరమైతే పోటీ పరీక్షలకు ఇబ్బంది లేకుండా అన్ని తరగతుల సిలబస్ ను మరింత తగ్గించాలని ఆలోచిస్తున్నారు. అయితే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ క్లాసులు, ఎగ్జామ్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఆన్ లైన్లో టెట్!
టీచర్ పోస్టులను భర్తీచేసే ఆలోచనలో ఉన్న సర్కారు.. ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)’ నిర్వహణపై దృష్టి పెట్టింది. కరోనా నేపథ్యంలో ఫిజికల్‌గా కాకుండా ఆన్లైన్లో నిర్వహించేందుకు మొగ్గుచూపుతోంది. ఎక్కువ రోజులు టైం తీసుకున్నా సరే.. ప్రశాంతంగా నిర్వహించాలని భావిస్తోంది. రాష్ట్రంలో చివరిసారిగా 2017 జులైలో టెట్ నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో నిర్వహించి న 2011, 2012 జనవరి, 2012 జూన్ టెట్ల వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం 2014 మార్చి, 2016 మే, 2017 జులైలో నిర్వహించిన టెట్లకు వ్యాలిడిటీ ఉంది. అయితే గత మూడున్నర ఏండ్లలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన స్టూడెంట్స్, గతంలోని టెట్ల వ్యాలిడిటీ పూర్తయిన వారు కలిపి సుమారు 4 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. వారందరూ టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకసారి టెట్ క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండేలా ఇటీవల ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది. అది ఇక ముందు రాసేవారికి వర్తిస్తుందా, ఇప్పటికే క్వాలిఫై అయినవారికి కూడా వర్తిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
For More News..
ఏపీ సర్కారును సరిగా రాయడం నేర్చుకోవాలన్న కేంద్రం
పరిహారం తేల్చకుండా పనులు కానివ్వం