
- యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్, నోట్స్ పంపిణీ
- బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్ అందించాలని యోచన
- రూ.16.87 కోట్ల ఖర్చుతో సౌకర్యాల కల్పన
- జిల్లాలో 738 స్కూళ్లు.. 60వేలకు పైగా స్టూడెంట్స్
- బడిబాటతో పెరగనున్న విద్యార్థుల సంఖ్య
మంచిర్యాల, వెలుగు: విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ ముగిశాయి. 2024–25 విద్యాసంత్సరంలో భాగంగా బుధవారం స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి. దాదాపు నెలన్నర రోజులు వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన స్టూడెంట్లు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్, నోట్‌బుక్స్‌తోపాటు రెండు జతల యూనిఫామ్స్ పంపిణీ చేయనున్నారు. స్కూళ్లలో అవసరమైన సౌలత్లు కల్పించేందుకు ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు రూ.16.87 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పటికే కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. మరోవైపు టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
కొనసాగుతున్న అడ్మిషన్లు
జిల్లాలో లోకల్ బాడీస్, గవర్నమెంట్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిపి మొత్తం 738 ఉన్నాయి. వీటిలో 41,969 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. అలాగే అన్ని రకాల రెసిడెన్షియల్ స్కూళ్లు 136 ఉండగా, వీటిలో 22,960 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు డ్రాప్ అవుట్స్‌ను చేర్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 9 నుంచి బడిబాట ప్రోగ్రాం చేపట్టింది.
ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. టీచర్లు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గవర్నమెంట్ స్కూళ్ల గురించి ప్రజలకు వివరిస్తూ పిల్లలను చేర్పించుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు సైతం సర్కారు బడుల వైపు ఆకర్షితులవుతున్నారని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెడుతుండగా, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, ఈవెనింగ్ స్నాక్స్ అందించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ..
విద్యాసంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్స్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్ అందించేందుకు గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. జిల్లాకు 3,04,310 టెక్ట్స్ బుక్స్ అవసరమని అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపారు. ఈ మేరకు కొద్దిరోజుల ముందే కావాల్సిన టెక్ట్స్ బుక్స్ జిల్లాకు చేరుకున్నాయి. తెలుగు, ఇంగ్లిష్ వర్షన్లో బుక్స్‌ను రూపొందించారు. అలాగే యూపీఎస్‌లు, హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న స్టూడెంట్లకు నోట్ బుక్స్ పంపిణీ చేయనున్నారు. జిల్లాకు అవసరమైన 2,49,446 నోట్ బుక్స్ కూడా వచ్చాయి.
వీటిని జిల్లా కేంద్రం నుంచి మండలాలకు పంపించారు. బుధవారం అన్ని స్కూళ్లలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. 43,714 మంది స్కూడెంట్లకు రెండు జతల చొప్పున యూనిఫామ్స్ అందించనున్నారు. గతంలో యూనిఫామ్స్ కుట్టడం ఆలస్యమయ్యేది. విద్యాసంవత్సరం ముగుస్తున్నా విద్యార్థులకు అందకపోయేది. ఈ నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. యూనిఫామ్స్ కుట్టే పనిని మహిళా సంఘాలకు అప్పగించింది. ఒక్కో జతకు రూ.75 చొప్పున కుట్టు కూలీ చెల్లించింది. మొత్తం 87,428 యూనిఫామ్స్ కు గానూ 70 శాతానికి పైగా రెడీ అయినట్టు అధికారులు తెలిపారు. ముందుగా ఒక్కో జత అందజేస్తామన్నారు.
రూ.16.87 కోట్లతో సౌలత్లు
విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి స్కూళ్లలో అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.16.87 కోట్లు రిలీజ్ చేసింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో 479 స్కూళ్లలో డ్రింకింగ్ వాటర్, టాయ్‌లెట్స్, ఎలక్ట్రిఫికేషన్, పెయింటింగ్స్ తదితర పనులు చేపట్టారు. ఇప్పటికే 116 స్కూళ్లలో పనులు పూర్తి కాగా, మిగతా వాటిలో చివరి దశలో ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు మన ఊరు–మన బడి ఫస్ట్ ఫేజ్‌లో 248 స్కూళ్లను సెలెక్ట్ చేసింది. రూ.68 కోట్ల అంచనాలతో వివిధ పనులను చేపట్టింది. అందులో 51 స్కూళ్లలో వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. 113 స్కూళ్లలో సివిల్ వర్క్స్ పూర్తయ్యాయి.
ప్రైవేట్కు దీటుగా సర్కారు బడులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్కు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. స్కూళ్లలో అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యనందిస్తోంది. ఫలితంగా విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. పేరెంట్స్ తమ పిల్లలను వేలు, లక్షల్లో ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లకు పంపడం కంటే సర్కారు బడులకు పంపించాలి.
యాదయ్య, మంచిర్యాల డీఈవో