జులై 1 నుంచి బడికి!

8, ఆపై తరగతులకు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయాలని విద్యా శాఖ కసరత్తు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి 8, ఆపై తరగతులకు ఫిజికల్ క్లాసులు ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 6,7 తరగతులకు వచ్చే నెల 20 నుంచి.. 3,4,5 తరగతులకు ఆగస్టు 16 నుంచి ఫిజికల్ క్లాసులు నిర్వహించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి సర్కారుకు విద్యా శాఖ ప్రతిపాదనలు చేసింది. వీటిపై సంబంధిత అధికారులతో ఆ శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ స్టూడెంట్లకు జులై1 నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభించాలని నిర్ణయించారు. వర్సిటీల్లో హాస్టళ్ల రీ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌పై వీసీలకు అధికారం ఇచ్చారు. ఈ విషయమై వీసీలతో ఉన్నత విద్యామండలి అధికారులు నాలుగైదు రోజుల్లో సమావేశం కానున్నారు. టీచర్లు, లెక్చరర్లు, డిగ్రీ ఆపై స్టూడెంట్లకు త్వరలో వ్యాక్సిన్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఒకటీ, రెండో తరగతి స్టూడెంట్లకు ఈ యేడాదీ ఆన్​లైన్, ఆఫ్​లైన్ క్లాసులు ఉండబోవని అధికారులు చెప్తున్నారు. 3వ తరగతి నుంచి ఇంటర్‌‌‌‌‌‌‌‌ వరకూ ఆన్​లైన్, ఆఫ్​లైన్ క్లాసులు కొనసాగించాలని భావిస్తున్నారు. 
రేపు వెల్ఫేర్ శాఖలతో సమీక్ష
స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌ కానుండటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించాలని మంత్రి సబితారెడ్డి నిర్ణయించారు. ఈ భేటీలో గురుకులాలు, హాస్టళ్ల రీ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌పై స్పష్టత వచ్చే అవకాశముంది. ఫిజికల్ క్లాసులు కొనసాగితే సగం మందితో షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. 
రెండు నెలల తర్వాత బడులకు టీచర్లు
ఈ నెల 25 నుంచి బడులకు టీచర్లు హాజరుకానున్నారు. గవర్నమెంట్, లోకల్​బాడీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, ఎడ్యుకేషన్ సొసైటీ గురుకులాలు, ఎయిడెడ్ స్కూళ్లు, డైట్ కాలేజీల్లో పనిచేసే టీచర్లు శుక్రవారం విధుల్లో చేరాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీచేశారు. దాదాపు 2 నెలల తర్వాత టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. 
నేడో రేపో ఇంటర్ సెకండియర్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్‌‌‌‌‌‌‌‌
ఇంటర్‌‌‌‌‌‌‌‌ సెకండియర్ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను నేడో రేపో ప్రకటించనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో వారంలోపు రిజల్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో ఇంటర్నల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మార్కులు ప్రకటించి రిజల్ట్ ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఈ ఏడాదీ జీవో 46 అమలు 
గతేడాది బడుల్లో ఫీజుల వసూళ్లకు సంబం ధించి సర్కారు ఇచ్చిన జీవో నెంబర్ 46ను ఈ ఏడాదీ అమలయ్యేలా ఉత్తర్వులివ్వాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రైవేటు స్కూల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లతో మంత్రి సబితారెడ్డి మీటింగ్ పెట్టనున్నారు. ఫీజులు పెంచొద్దని, నెలవారీగానే ట్యూషన్​ ఫీజులు తీసుకోవాలని  ఆదేశించనున్నారు. ఈయేడాదీ ఫీజులను 20 శాతం తగ్గించుకోవా లని సర్కారు ప్రతిపాదించనుంది.